ఎంపీడీవోల ఇష్టారాజ్యం
బ్యాంకర్ల సహకారం
ప్రజాప్రతినిధులే లబ్ధిదారులు
ఫిర్యాదుల వెల్లువ
కరీంనగర్ సిటీ : నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన సంక్షేమ రుణాలు జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకర్ల సహకారంతో ఎంపీడీవోలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలాలు, పట్టణాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల జాబితా చాలా చోట్ల కొలిక్కి రాకపోవడానికి కారణం ఇదేననే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అందచేస్తున్న రుణాల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా గణనీయంగా సబ్సిడీని, రుణాలు పెంచిన విషయం తెలిసిందే. రూ.80వేల నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధిదారులకు సబ్సిడీ లభిస్తుండడంతో సహజంగానే పెద్దల కన్ను ఈ రుణాలపై పడింది. ఇందుకు తగినట్లుగానే ఆయా యూనిట్లకు లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సాక్షాత్తు కలెక్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
కోనరావుపేట మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రుణాల లబ్ధిదారుల ఎంపికలో ఇన్‌చార్జి ఎంపీడీవో అక్రమాలకు పాల్పడ్డారని ఆ మండలం ఎంపీటీసీలు కలెక్టర్, సీఈవోలకు ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు చేతులు మారాయని ఆరోపించారు. బ్యాంక్ టార్గెట్ లేకున్నా ఎనిమిది మందికి ఎస్టీ రుణాల మంజూరు ప్రతిపాదనలు పంపించారన్నారు. పైగా ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులనే రుణాలకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తకు, అంగన్‌వాడీ కార్యకర్త భర్తకు, 2014-15లో రుణాలు తీసుకున్న వారిని తిరిగి ఎంపిక చేశారని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనర్హులైన కేవలం ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్నారనే ఎంపిక చేశారని తెలిపారు.
వీటిపై విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు.
గంగాధర మండలంలో లబ్ధిదారుల ఎంపిక మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇటీవల ఎంపిక చేసిన జాబితాను చూసిన నిరుద్యోగులు మండిపడుతున్నారు. కలెక్టర్‌ను కలిసిన మండలానికి చెందిన నిరుద్యోగులు పర్శరాం, సుధాకర్ తదితరులు ఫిర్యాదు చేశారు. మండలంలోని ప్రజాప్రతినిధి భర్తను రూ.10 లక్షల రుణానికి (కారుకోసం) ఎంపిక చేశారు. రుణానికి ఎంపిక బ్యాంక్ పరిధిలోనే అతని గ్రామం లేకపోవడం విశేషం. పైగా కారు లోను కోసం తప్పనిసరిగా దరఖాస్తుదారుడి పేరిట డ్రైవింగ్ లెసైన్స్, బ్యాడ్జీ ఉండాలి. కాని ఇవేవీ అతడికి లేవు. అయినా ఎంపిక పూర్తయింది.
అలాగే ఇదే మండలం బూరుగుపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి ఎస్సీ రుణాలు మంజూరయ్యా యి. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు దరఖాస్తుదారులుగా అవతారమెత్తితే, బ్యాంకర్ల సహకారంతో ఎంపీడీవోలు నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతూ లబ్ధిదారుల ఎంపిక తతంగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.ఇవి జిల్లాలో రుణాల ఎంపికలో జరుగుతున్న బాగోతానికి మచ్చుతునకలు. ఆయా మండల పరిధిలో ఎంపీడీవోలు, బ్యాంకర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, అనర్హులకు యూనిట్లు దక్కుతున్నాయనే ప్రచారం ఉంది. వీటిపై కలెక్టర్ దృష్టిసారిస్తే అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది.
పక్కదారి పడుతున్న రుణాలు
Published Sat, Feb 27 2016 1:49 AM | Last Updated on Sat, Jun 2 2018 8:32 PM
Advertisement
Advertisement