శిక్షణతోనే సరి.. రాయితీలు మరి! | Corporation discounted debts as dry days | Sakshi
Sakshi News home page

శిక్షణతోనే సరి.. రాయితీలు మరి!

Published Thu, Feb 7 2019 12:54 AM | Last Updated on Thu, Feb 7 2019 12:54 AM

Corporation discounted debts as dry days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వయం ఉపాధి గాడి తప్పింది. నిరుద్యోగ యువతను ఉద్యోగావకాశాలకు ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి రంగంవైపు ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఫైనాన్స్‌ కార్పొరేషన్ల లక్ష్యం అటకెక్కింది. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించిన ఆశావహులందరికీ రాయితీలిచ్చి సహకరిస్తామంటూ వార్షిక సంవత్సరం ప్రారంభంలో భారీ ప్రణాళికలు తయారు చేసిన వివిధ కార్పొరేషన్లు ప్రస్తుతం ముఖం చాటేశాయి. రాయితీలపై నోరుమెదపకుండా శిక్షణ కార్యక్రమాలతో సరిపెడుతున్నా యి. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న వారికి చెయ్యిచ్చాయి. మరో నెలన్నరలో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. కనీసం దరఖాస్తుల పరిశీలన సైతం చేయకపోవడంతో అర్జీదారులు డీలా పడ్డారు.

10.25 లక్షల మంది ఎదురుచూపులు..
భారీ వార్షిక ప్రణాళికలు రూపొందించిన ఫైనాన్స్‌ కార్పొరేషన్లు గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 10.25 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. ఇందులో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరం చివర్లో 7,59,788 మంది దరఖాస్తు చేసుకోగా... 2018–19 వార్షికం ప్రారంభంలో 2,65,375 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలిం చి లబ్ధిదారులను గుర్తించాలి. ఈక్రమంలో ముందు గా జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధారిస్తే... ఆమేరకు పరిశీలన చేపట్టి అర్హులను గుర్తిస్తారు. కానీ ఇప్పటివరకు జిల్లాల వారీ లక్ష్యాలను ఆయా ఫైనా న్స్‌ కార్పొరేషన్లు నిర్ధారించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఫైనాన్స్‌ కార్పొరేషన్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించకపోవడమే. సాధారణంగా ఫైనాన్స్‌ కార్పొరేషన్లు వార్షిక ప్రణాళికలను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే వాటికి ఆమోదం రావాల్సి ఉంటుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు సమర్పించిన 2018–19 వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లు లబ్ధిదారుల ఎంపికను సైతం నిర్వహిం చలేదు. 2018–19 వార్షిక ప్రణాళికలకు ఆమోదం రాకపోవడం, గత దరఖాస్తులకు మోక్షం కలగని కారణంగా ఈ ఏడాది ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతో పాటు బీసీ ఫెడరేషన్లు కనీసం దరఖాస్తులు సైతం స్వీకరిం చలేదు. ప్రస్తుతం కార్పొరేషన్ల వద్ద ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలంటే రూ.18,062.41 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌ వద్ద అందుబాటులో ఉన్న రూ.250 కోట్ల నిధితో 17వేల మంది లబ్ధిదారులకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. వీరంతా రూ.50 వేలలోపు యూనిట్లు పెట్టుకున్నవారే. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో ఇవికూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి.

‘ముందస్తు’తో ఆవిరైన ఆశలు..
2017–18 వార్షికంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ తరువాతి ఏడాదిపైనే కార్పొరేషన్లు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఈక్రమంలో 2018–19 వార్షిక ప్రణాళికలను భారీగా తయారు చేసిన అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు. ఎన్నికల సీజన్‌ కావడంతో తప్పకుండా నిధులు వస్తాయని అన్నివర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ రెండో త్రైమాసికంలోనే ప్రభుత్వం ముందస్తుకు సిద్ధం కావడంతో నిరుద్యోగ యువతకు భంగపాటు తప్పలేదు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో మరో రెండు నెలలపాటు కాలయాపన జరిగింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానుండడంతో ఈసారి స్వయం ఉపాధికి రాయితీ రుణాలు కష్టమేనని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement