సిరి గానుగ | Nalini Sindhay became a social entrepreneur for providing oils | Sakshi
Sakshi News home page

సిరి గానుగ

Mar 21 2019 2:04 AM | Updated on Mar 21 2019 2:05 AM

Nalini Sindhay became a social entrepreneur for providing oils - Sakshi

స్వయం ఉపాధి పొందడంతోపాటు సమాజానికిఆరోగ్యదాయకమైన గానుగ నూనెలు అందించడం కోసంసోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు నళినీ సింధే

ఎద్దుతో నడిచే కట్టె గానుగ నూనెలు ఆరోగ్యదాయకమైనవని డాక్టర్‌ ఖాదర్‌ వలి వంటి నిపుణులు ప్రచారం చేస్తుండడంతో కొందరు గ్రామీణ యువతీ యువకులు ఈ నూనెల తయారీని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. నగరాల్లో ఉద్యోగాలు వదిలేసి గ్రామాలకు తిరిగి వెళ్లి గానుగలు నెలకొల్పుతున్న వారు కొందరైతే, ఉన్న ఊళ్లోనే ఎద్దు గానుగలు ఏర్పాటు చేసుకొని తమ కాళ్ల మీద తాము నిలబడుతూ మరొ కొందరికి ఉపాధి కల్పిస్తున్న ఉన్నత విద్యావంతులు మరికొందరు. నళిని కూడా ఈ కోవకే చెందుతారు. మైసూరు జిల్లాలోని అత్తిగుప్పె నళిని స్వగ్రామం. మైసూరు–కె.ఆర్‌. నగర్‌ మెయిన్‌రోడ్డులో మైసూరుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నదీ గ్రామం. మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ చదువుకున్న నళిని డాక్టర్‌ ఖాదర్‌ వలి ప్రసంగం విన్నారు. ఉపాధి కోసం నగరాలకు వెళ్లడం కాదు.. తమ గ్రామంలోనే తల్లి సత్యవతిబాయితోపాటే ఉండిపోవాలనుకున్నారు.

తాను స్వయం ఉపాధి పొందడంతోపాటు సమాజానికి ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలు అందించడం కోసం సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నారు. 6 నెలల క్రితం మోహన్‌కుమార్‌ అనే వ్యక్తి భాగస్వామ్యంతో రూ. 3 లక్షల పెట్టుబడితో ఎద్దుతో నడిచే కట్టెగానుగను తమ ఇంటివద్ద ఏర్పాటు చేశారు. రూ. 1,30,000తో కట్టె గానుగ తెచ్చారు. రూ. 60 వేలతో దేశీ జాతి జోడెడ్లు కొన్నారు. గానుగ కోసం రేకుల షెడ్డు వేశారు. ‘గ్రామ సిరి’ అని పేరు పెట్టారు. పరిసర గ్రామాల్లో రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించిన వేరుశనగలు, నువ్వులు, కొబ్బరికాయలను కొనుగోలు చేసి తేవడం, గానుగ పట్టించడం వంటి పనులను మోహన్‌కుమార్‌ చూస్తుంటారు. ఇద్దరు మహిళా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా ఆడించిన నూనెను అర లీటరు గాజుసీసాల్లో లేదా స్టీలు క్యానుల్లో నింపి, విక్రయించడం నళిని బాధ్యత.

డాక్టర్‌ ఖాదర్‌ వలి ప్రసంగాలు వినడానికి వచ్చిన వారు, చికిత్స కోసం వచ్చే వారు తమ వద్ద ఎద్దు గానుగ నూనెలు కొనుగోలు చేస్తున్నారని నళిని తెలిపారు. అంతేకాదు.. నూనెలను స్టీలు క్యాన్లలో తీసుకెళ్లి నళిని స్వయంగా డోర్‌ డెలివరీ ఇస్తున్నారు. జత ఎద్దులు నెమ్మదిగా గానుగను తిప్పుతూ ఉంటాయి. ఎద్దు కట్టె గానుగ నిమిషానికి 3 సార్లు అతి నెమ్మదిగా తిరుగుతుంది. అందువల్ల నూనె వెలికి తీసే సమయంలో ఉష్ణం జనించదు (అందుకే దీన్ని కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ అంటారు). కాబట్టి, నూనెలో పోషకాలు దెబ్బతినకుండా ఉంటాయి. విత్తన రకాన్ని బట్టి ఎంత సమయంలో నూనె వస్తుంది, ఎంత పరిమాణంలో నూనె వస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. రోజూ రెండు బ్యాచ్‌లలో నూనె తీస్తున్నారు. బ్యాచ్‌కు ఏ రకం నూనె గింజలైనా 12.5 కిలోలను గానుగలో వేస్తారు. 12.5 కిలోల వేరుశనగ నూనె గింజలు వేస్తే 4.5–5 లీటర్ల తీయడానికి 3.5 గంటలు పడుతుంది.

ఎండుకొబ్బరి వేస్తే 2.30 – 3 గంటల్లోనే 4.5–5 లీటర్ల నూనె వస్తుంది. వెర్రి నువ్వులు వేస్తే 6 గంటల్లో కేవలం 1.7 – 2 లీటర్ల నూనె వస్తుంది. నువ్వులైతే 4–4.30 గంటల్లో 2–2.5 లీటర్ల నూనె వస్తుంది. డిమాండ్‌ను బట్టి ఒక్కో రకం నూనెను రెండు లేక మూడు రోజులు వేస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలతోపాటు నగర వాసుల్లో కూడా అవగాహన పెరుగుతుండడంతో  గానుగ నూనెలకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతున్నది. రోజూ పది గంటలు శ్రమిస్తున్నారు నళిని. ఈ పని తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తున్నదని, ప్రస్తుతం నెలకు రూ. 30 వేల వరకు నికరాదాయం పొందుతున్నానని నళిని ‘సాక్షి’తో చెప్పారు. త్వరలో రెండోగానుగ ఏర్పాటు చేసుకోవాలని, రెండోజత ఎడ్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు ఉత్సాహంగా చెప్పారామె. గ్రామ స్వరాజ్యం, స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న నళిని, మోహన్‌ కుమార్‌ ఆదర్శనీయులు.
పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్, సాక్షి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement