స్త్రీ శక్తికి ప్రతీక గిరిజన మహిళ
స్వయం ఉపాధితో జీవనం
పేదరికం వల్ల కానని ప్రగతి
పాడేరు: స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే గిరిజన మహిళలు ప్రగతిలో వెనుకబడి ఉన్నారు. నిరక్షరాస్యులైన వేలాదిమంది గిరిజన మహిళలు తమ సంస్కృతి సంప్రదాలయాలకు ప్రతిరూపంగా స్వయం ఉపాధితో కొండకోనల్లో శ్రమైక్య జీవనం సాగిస్తున్నారు. మన్యంలో పురుషులతో సమానంగా నిలిచే గిరి మహిళల పురోభివృద్ధికి పేదరికం, నిరక్ష్యరాస్యత అడ్డుగోడలుగా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా మన్యంలో గిరిజన మహిళలకు ఉపాధి రంగంలో అవకాశాలు మెరుగుపడటం లేదు. మైదాన ప్రాంతాలతో పోల్చితే మన్యంలో మహిళాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేది అంతంత మాత్రమే! మన్యంలో శ్రమజీవులుగా కనిపించే గిరిజన మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వపరంగా చిన్నతరహ ,కుటిర పరిశ్రమలు అందుబాటులో లేవు. సాంకేతిక ఉపాధి రంగాల్లో గిరిజన మహిళాలకు తోడ్పటునందించడం కోసం నేటికీ ప్రత్యేక కార్యక్రమాలు అమలు జరగడం లేదు. అక్షరాస్యతకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన మహిళలు ఒక శ్రామిక శక్తిగా జీవనం సాగిస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. నేటికీ వీరి జీవనానికి కూలీపనులు, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ అధారంగా ఉన్నాయి. విద్య అవకాశాలను అందిపుచ్చుకున్న గిరిజన మహిళలు కూడా నేడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందడం లేదు. కాఫీ కార్మికులుగా, అరోగ్యకార్యకర్తలుగా, అంగన్‌వాడీకార్యకర్తలుగా,హాస్టల్‌వర్కర్లుగా. జీవనోపాధికి కష్టపడుతూ ఉద్యోగభద్రత లేక శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించడంలో గిరిజన మహిళలు వెనుకబడి ఉన్నారు. పేదరికం నుంచి విముక్తి పొందడం లేదు.
ఆర్థిక తోడ్పాటు అందించాలి.
గిరిజన మహిళలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టాలి. మన్యంలో మహిళల ప్రగతి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విద్యావకాశాలు విస్తరించడం లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా అందుకోలేకపోతున్నారు. మన్యంలో మహిళల కోసం ప్రభుత్వ పథకాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల డ్వాక్రా సంఘాలు వెనుకబడ్డాయి. రుణసౌకర్యాలు అంతంతమాత్రమే. అటవీ ఉత్పత్తులు అంతరించి ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు విద్య, వైద్యం, ఆహార కొరత వంటి సమస్యల వల్ల పేదరికం సమసి పోవడం లేదు. మహిళలకు అవసరమైన రంగాలలో, పురుషులతో సమాన హక్కు కల్పించాలి.
-ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి(పాడేరు)