బదిలీల జాతర | Transfer fair | Sakshi
Sakshi News home page

బదిలీల జాతర

Published Sat, Oct 18 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

బదిలీల జాతర

బదిలీల జాతర

‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం’ సామెతను అధికార పార్టీ నేతలు చక్కగా వంటబట్టించుకున్నారనే చర్చ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. తమకు తెలీకుండా బదిలీలు జరిగేందుకు వీల్లేదని ఉన్నతాధికారులకు హుకూం జారీ చేశారు. పోస్టులకు వెలకట్టి ద్వితీయ శ్రేణి నేతలతో బేరసారాలు సాగిస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత సిఫార్సు లేఖను చేతిలో పెట్టి ‘బెస్టాఫ్.. లక్’ చెబుతున్నారు.
 

 సాక్షి ప్రతినిధి, అనంతపురం :
 పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో జేబు నింపుకోవడమే ధ్యేయంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. తహసిల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఎస్‌పీడీసీఎల్ ఏఈలతో పాటు పలు కీలక శాఖలకు సంబంధించిన పోస్టులకు తాము సిఫార్సు చేస్తూ లేఖలు ఇచ్చినవారికే ఇవ్వాలని కొందరు ప్రజాప్రతినిధులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. కోరుకున్న స్థానాన్ని దక్కించుకునేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ‘మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను.

మీ సూచనలు, నిర్ణయాలకు ఫేర్‌గా ఉంటాను. నాకు లెటర్ ఇవ్వండి సార్’ అంటూ పలువురు ఉన్నతోద్యోగులు.. ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు అధికారులు నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లెటరు కూడా తీసుకుంటున్నారు. సిఫార్సు లేఖలు ఇచ్చేందుకు కొందరు ప్రజాప్రతినిధులు పోస్టును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. దీంతో కొందరు అధికారులు అంత డబ్బులు ఇవ్వలేమని వెనకడుగు వేస్తుంటే, ఇంకొందరు పోస్టింగ్‌లో చేరిన వెంటనే ఒప్పుకున్న డబ్బులు ముట్టజెపుతామని ముందడుగు వేస్తున్నారు.

 కీలక పోస్టులకు ఖరారైన అధికారులు!
 విద్యాశాఖలో కీలకమైన సర్వశిక్ష అభియాన్ పోస్టుకు ఓ మంత్రి లేఖ ఇచ్చారు. దీని కోసం భారీ మొత్తానికి బేరం కుదిరినట్లు సమాచారం. దీంతో ఆ ఫైలు సెక్రటేరియల్‌లో అన్ని టేబుళ్లుదాటి చివరగా సీఎం వద్దకు చేరింది. అక్కడ పీటముడి పడింది. రెవెన్యూకు చెందిన వ్యక్తికి ఆ పోస్టు ఇచ్చేందుకు సీఎం విముఖత చూపుతున్నారని సమాచారం.

పెనుకొండ, కళ్యాణదుర్గం ఆర్డీవో పోస్టులకు రూ.20 లక్షలు, రూ.15 లక్షలు ధర నిర్ణయించినట్లు.. ఆ మొత్తం చెల్లించడానికి ఇద్దరు అధికారులు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. సీఐల బదిలీలకు సంబంధించి కూడా లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి.

  జెడ్పీ చైర్మన్ సిఫార్సు కోసం ఎంపీడీవోల యత్నాలు
 ఎంపీడీవోల నియామకంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్మన్ సిఫారసు తప్పనిసరి అవుతోంది. ఎమ్మెల్యే లేఖ ఇచ్చినా జెడ్పీచైర్మన్ అభిప్రాయం కూడా ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలు మండలాలకు చెందిన టీడీపీ నేతలు తమ మండలానికి ఎంపీడీఓ ఎవరు ఉండాలనే అంశంపై జెడ్పీ చైర్మన్‌తో చర్చించారు.

కొందరు ప్రజాప్రతినిధులు అధికారులకు లేఖ ఇచ్చినప్పటికీ, ఫోన్‌లో మరొకరి పేరు సిఫార్సు చేస్తూ ‘చేతివాటం’ ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి, ఉరవకొండలో కందికుంట వెంకట ప్రసాద్, పయ్యావుల కేశవ్ సూచించిన వారికే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement