గ్రానైట్ వార్ | Granite War | Sakshi
Sakshi News home page

గ్రానైట్ వార్

Published Mon, Sep 29 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

గ్రానైట్ వార్

గ్రానైట్ వార్

ఎమ్మెల్యేల పోరు.. అధికార పార్టీలో చిచ్చు
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
 ప్రజాప్రతినిధుల మధ్య గ్రానైట్ వార్ మొదలైంది. అధికార పార్టీ నేతల మధ్యనే చిచ్చు పెట్టింది. ఇటీవల జిల్లా పరిషత్ వేదికగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గ్రానైట్ పరిశ్రమపై రెండు వర్గాలుగా చీలిపోవటం చర్చనీయాంశంగా మారింది. పర్యావరణ విధ్వంసంతో పాటు రహదారులను ఛిద్రం చేస్తున్న గ్రానైట్ క్వారీలు.. రవాణాకు అడ్డుకట్ట వేయాలని మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఎమ్మెల్యేలు బొడిగె శోభ, రసమయి బాలకిషన్ తమ ఆవేదన వెళ్లగక్కారు. గ్రానైట్ లారీలు, క్వారీలతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని.. తమ సొంత నియోజకవర్గాల్లో రోడ్లన్నీ పాడైపోయాయని.. గ్రానైట్ రవాణా కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని ఆందోళన వెలిబుచ్చారు. అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు వారికి మద్దతు పలికారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే గ్రానైట్ పరిశ్రమపై ఏకపక్షంగా మాట్లాడటం సరైంది కాదని.. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి సైతం ఘాటుగానే స్పందించారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయం తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మైనింగ్ అధికారులను పిలిచి గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించినట్లు తెలిసింది. అదీ మొదలు.. జిల్లాలో గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై అధికారులు కన్నెర్ర జేశారు. వరుసగా వారం రోజుల్లోనే 37 కేసులు నమోదు చేసి జరిమానా విధించటం వెనుక అసలు తతంగం ఇదేనని అర్థమవుతోంది.
  జిల్లాలో దాదాపు 350 గ్రానైట్ క్వారీలున్నాయి. ప్రతిరోజు దాదాపు 300 లారీల్లో గ్రానైట్ రవాణా అవుతోంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో సగానికి పైగా రాజకీయ నేతలకు చెందినవే. కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు.. విపక్షాలకు చెందిన నేతలు సైతం ఈ వ్యాపారంలో పాతుకుపోయారు. దీంతో అధికారులు సైతం గ్రానైట్ క్వారీల నిబంధన ఉల్లంఘన.. అడ్డగోలు ఓవర్‌లోడ్ రవాణా.. సీనరేజీ ఎగవేతపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆరోపణలున్నాయి.
  గ్రానైట్ రాళ్ల రవాణాతో కరీంనగర్, హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, చొప్పదండి, బోయినపల్లి, వేములవాడ, గంగాధర, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేసింది. గ్రానైట్ క్వారీల నుంచి తొలిగించిన మట్టి గుట్టలు కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై ప్రమాదాలకు నిలయంగా మారాయి. గ్రానైట్, ఇనుక లారీలతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేసేందుకు కనీసం రూ.50 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ.. ప్రభుత్వం నుంచి నిధులేవీ రాకపోవటంతో ఆర్‌అండ్‌బీ విభాగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.
  గత ప్రభుత్వ హయాంలో ఓవర్ లోడ్ రవాణాను అనుమతించాలని గ్రానైట్ క్వారీల యజ మానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన జిల్లా కు ప్రత్యేకంగా జీవో తెచ్చుకోవటం గమనార్హం. ఇక్కడి రాజకీయాలను.. అధికారులను శాసించే స్థాయికి గ్రానైట్ పరిశ్రమ వేళ్లూనుకుందని వరుసగా జరిగిన ఎన్నికలు.. వాటి ఫలితాలు సైతం రూఢీ చేశాయి. గుట్టలు కనుమరుగవుతున్నాయని.. కొత్తగా క్వారీలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. ఎన్నికల తర్వాత ఈ సంస్థలు పెదవి విప్పకముందే.. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగటం.. అందులోనూ అధికార పార్టీ నేతలే విరుచుకుపడుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement