కలవరం.. కలకలం!
అధికార పార్టీలో మంత్రి పదవి రచ్చ
►కొత్తగా పార్టీలో చేరిన నేతలకు అధినేత హామీలు?
► పార్టీనే నమ్ముకున్నఎమ్మెల్యేల్లో అసంతృప్తి
►నిరాశలో ఓ యువ ఎమ్మెల్యే ఒక్క తాటిపైకి వస్తున్న పాత కాపులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆలూ లేదు చూలూ లేదు.. కొడుపు పేరు సోమలింగం అన్నట్టు తయారయింది జిల్లాలో మంత్రి పదవి కేటాయింపు వ్యవహారం. కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు తమకు మంత్రి పదవి పక్కా అని ప్రచారం చేసుకుంటుండగా.. ఆయన అయ్యే అవకాశమే లేదని మరో వర్గం వాదిస్తోంది. తాను యువజన, క్రీడా శాఖల మంత్రిని కాబోతున్నానంటూ ఊరు, వాడ ప్రచారం చేసుకున్న ఓ యువ ఎమ్మెల్యే ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఎక్కడ తనకు మంత్రి పదవి వరించకుండా పోతుందోనని మదన పడుతున్నట్టు సమాచారం.
పాత కాపులంతా ఒకే తాటిపైకి..
అధికార పార్టీలో నిన్నా మొన్నా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత కాపులంతా మండిపడుతున్నారు. మొదటి నుంచి తమతో ఉన్న పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో కూరుకుపోయే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలోని పాత కాపులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు. పార్టీలో ఎన్నికల ముందు నుంచి ఉన్న వారికే మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని.. వీరంతా కోరుతున్నారు. ఇదే అంశాన్ని అందరూ కలిసి వెళ్లి అధినేతకు వివరించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు పార్టీలో చేరిన తాజా మాజీ కాంగ్రెస్ నేతలు కూడా స్వరం కలుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు యువ ఎమ్మెల్యే ఆశలు మళ్లీ మొగ్గతొడిగాయి. ఈ నేతలతో సదరు యువ ఎమ్మెల్యే కూడా కలిసి మళ్లీ మంత్రి పదవి యత్నాల్లో పడినట్టు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
మంత్రి పదవి చర్చ లేదంటూనే..
వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ నుంచి పార్టీలోకి చేర్చుకునే సందర్భంగా భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే అంశం ఎక్కడా ప్రస్తావనకే రాలేదనేది జిల్లా పార్టీ నేతలు వాదన. మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి పార్టీలో చేర్చుకోలేదని స్వయంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. తద్వారా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదనే సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏదో ఒక మూలన.. మంత్రి పదవి వస్తుందనే భయంతోనే పాత కాపులంతా ఏకమవుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా అధికార పార్టీలో మంత్రి పదవి వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందనే విషయం.. బడ్జెట్ సమావేశాల తర్వాత వచ్చే నెలలో తేలే అవకాశం ఉంది.