నూతన చిట్ వేడుకల్లో అసభ్యకర నృత్యాలు
అడ్డుకున్న పోలీసులు ఒత్తిళ్లతో చర్యలకు వెనుకడుగు
నరసరావుపేట టౌన్ : కాల్‌మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి, అతని సోదరుడు నూతన చిట్ వేడుకల్లో భాగంగా మందుపార్టీ, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతో చర్యలకు వెనుకడుగు వేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే. పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్, అతని సోదరుడు నూతన చిట్స్‌ను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా వినుకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలతో అసభ్యకర డాన్స్‌లు చేయించారు. హాజరైన చీటీపాట సభ్యులు కార్యక్రమాలను ఫోన్‌లో చిత్రీకరించి ఇతరులకు వాట్స్‌ఆప్ ద్వారా పంపారు.
కొందరు ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. పోలీసుల రాకను గమనించిన వారు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసులు సూచించినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించడంతో నిర్వాహకులపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా పై అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో నిర్వాహకులను స్టేషన్‌కు రావాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి సోమవారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై డీఎస్పీ కె.నాగేశ్వరరావును వివరణ కోరగా పోలీసుశాఖ అనుమతి లేకుండా డాన్స్‌లు నిర్వహిస్తున్న కారణంగా కార్యక్రమాన్ని నిలిపివేశామన్నారు.
అధికార పార్టీ ‘చిట్స్’ లీలలు
Published Tue, Jan 12 2016 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM
Advertisement
Advertisement