సాక్షి, అమరావతి బ్యూరో: కాల్‌మనీ పాపాల పుట్ట బద్ధలవుతోంది. తవ్వేకొద్దీ అనేక అక్రమాలూ బయటపడుతున్నా యి. అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వడమే కాకుండా.. తీసు కున్న అప్పు చెల్లించిన తర్వాత కూడా బాకీ ఉన్నారంటూ వీఎంసీ విశ్రాంత, ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోన్న ఉదంతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోర్జరీ సంతకాలు, ప్రామిసరీ నోట్లతో ఇతరుల పేరిట దావాలు వేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా సభ్యుల ఆగడాలకు పోలీసులు బ్రేక్ వేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కాల్‌మనీ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా కాల్‌మనీ వ్యాపారులు ఇతరుల పేరిట కోర్టులో దావాలు వేసిన వైనంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టులో దాఖలైన ప్రామిసరీ నోట్లను ఎవరు ఇచ్చారు? వారికి బాధితులకు ఉన్న సంబంధం ఏమిటి? అన్న వివరాలపై కూపీ లాగనున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోన్న కాల్‌మనీ ముఠా సభ్యుల ఆగడాలపై నగర పోలీసు కమిషనర్ దృష్టి సారించారు. రంగంలోకి దిగిన నగర పోలీసులు కాల్‌మనీ ముఠా సభ్యులైన పాపారావు, శీరం వెంకటేశ్వరావు(పెదబాబు)లను అదుపులోకి తీసుకు ని విచారిస్తున్నారు. అదే సమయంలో బాధితుల నుంచి వాగ్మూలం సేకరించారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి.. అప్పు ఉన్నట్లు కోర్టుల్లో దావాలు వేశారని బాధితులు పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీంతో అప్పు చెల్లించినా మళ్లీ డబ్బులు బాకీ ఉన్నారంటూ కోర్టు నుంచి దావాలు వేసిన వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కాల్‌మనీ వ్యాపారి పాపారావు, కోర్టులో దావా వేసిన వారు చెబుతున్న అంశాల్లో పొంతన లేదని సమాచారం. అమాయకుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు రాబట్టే యత్నంలోనే ఈ కుట్రకు కాల్‌మనీ వ్యాపారులు తెరలేపారని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు సెలవులు ముగియగానే ప్రామిసరీ నోట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నారు.
కేసు నుంచి తప్పించుకునేందుకు బేరాలు?
వీఎంసీ విశ్రాంత ఉద్యోగులను వేధింపులకు గురిచేయడమే కాకుండా.. వారి అకౌంట్లను అక్రమంగా సీజ్ చేయించిన కాల్‌మనీ వ్యాపారి పాపారావు గత ఏడేళ్లలోనే కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. ఇదే కాల్‌మనీ వ్యాపార నేరం కింద గతంలో ఇతనిపై పోలీసులు 8 కేసులు నమోదు చేశారు. అప్పట్లో కొంత కాలం వ్యాపారాలు మానేసినట్లు నటించిన పాపారావు ఆ తర్వాత మళ్లీ పాతబాటే పట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పట్లో రాజధానిపై పలు ఊహాగానాలు వెల్లడైన సమయంలో ఇతను నూజివీడు, అమరావతి పరిధిలో సుమారు 50 ఎకరాల వరకు భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం.అలాగే వడ్లమానులో 3.5 ఎకరాలను ల్యాండ్‌పూలింగ్‌లో తీసుకోగా.. అందుకు గాను వారికి 3,500 గజాల స్థలం రాగా.. అందులో 500 గజాల స్థలాన్ని ఇస్తానంటూ ఓ పోలీసు అధికారితో బేరసారాలు అడుతున్నట్లు సన్నిహితులు పేర్కొనడం చర్చనీయాంశమైంది.
డాక్యుమెంట్లపై విచారణ చేస్తున్నాం..
కాల్‌మనీ ముఠా ఆగడాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాం. ఇప్పటికే బాధితుల నుంచి వివరాలు సేకరించాం. బాధితుల ప్రమేయం లేకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసి కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లపై విచారణ చేస్తున్నాం. అప్పు ఇచ్చిన వారు కాకుండా ఇతరులు ఎలా కోర్టులను ఆశ్రయించారనే దానిపైనా దర్యాప్తు చేస్తున్నాం.
–విక్రాంత్ పాటిల్, డీసీపీ–2, విజయవాడ నగరం
Comments
Please login to add a commentAdd a comment