కసంక్రాంతి ‘బరి’లో కాక్ ఫైట్ | Police vs. populists | Sakshi
Sakshi News home page

కసంక్రాంతి ‘బరి’లో కాక్ ఫైట్

Published Wed, Jan 13 2016 1:54 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

కసంక్రాంతి ‘బరి’లో కాక్ ఫైట్ - Sakshi

కసంక్రాంతి ‘బరి’లో కాక్ ఫైట్

పోలీసులు వర్సెస్ ప్రజాప్రతినిధులు
కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు
మంత్రులతో ప్రారంభించేందుకు సన్నాహాలు
వీవీఐపీల రాకపోకలకు ప్రత్యేక రోడ్లు నిర్మాణం
కఠిన చర్యలు తప్పవని ఎస్పీల హెచ్చరికలు

 
గుంటూరు సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లాలో కోడి పందేలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అండతో హైకోర్టు, పోలీస్ అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లక్షల రూపాయల ఖర్చుతో బరులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా  డెల్టా ప్రాంతంలో కోడి పందేల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు హైదరాబాద్ స్థాయి అధికారులతో పైరవీలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులతో కలసి ‘చినబాబు’ వద్ద ఆమోదముద్ర తీసుకున్న నేతలు పోలీసులను లెక్కచేయకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గత ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా కట్టడి చేసిన పోలీసులు రేపల్లెలో ఏర్పాటు చేసిన బరుల వైపు వెళ్ళలేకపోయారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అప్పట్లో కోడి పందేలను ఆపలేకపోయారనేది బహిరంగ రహస్యమే. ఈ సారి కూడా అలాగే జరుగుతుందని అధికారపార్టీ నేతలు ధీమాగా ఉండగా, పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకునేలా అన్ని జిల్లాల ఎస్పీలకూ స్పష్టమైన ఆదేశాలిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

ఇళ్ళల్లోకి చొరబడి మరీ పందెం కోళ్ళను ఎత్తుకెళుతున్న పోలీసులు రేపల్లె మండలంలోని ఓ మాజీ ఎమ్మెల్యే పొలంలో పందేల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాకీ, ఖద్దరు మధ్య వివాదం జరిగిన ప్రతిసారీ ఖద్దరుదే పైచేయిగా నిలుస్తోంది. డీఎస్పీ, సీఐల బదిలీల దగ్గర నుంచి,  జిల్లాలో జరుగుతున్నఅక్రమాలను అడ్డుకుంటున్న ఎస్పీల బదిలీల వరకు అధికారపార్టీ నేతల పంతమే నెగ్గుతూ వస్తోంది.
 
మంత్రులు, ఎంపీలతో ప్రారంభించేందుకు సన్నహాలు ...
జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలను ఆహ్వానించి కోడి పందేలను ప్రారంభింపజేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పొలాల్లో బరులు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడకు నేరుగా వీవీఐపీల వాహనాలు వచ్చేలా రోడ్ల నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. లక్షల్లో పందేలు కాసే వారి కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పందేల వద్ద ఉంటే పోలీసులు అక్కడికి వచ్చినా నిలువరించలేరనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు సైతం వారికి ఆ మేరకు భరోసా ఇస్తున్నారు. అయితే అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు మాత్రం కోడి పందేలు నిర్వహిస్తే సహించేదిలేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంక్రాంతి కాక్ ఫైట్‌లో ఖద్దరు, ఖాకీల్లో ఎవరు నెగ్గుతారో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement