Chicken races
-
బరిలోకి దిగిన కోళ్లు
అధికారపార్టీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ భారీగా ఏర్పాట్లు తరలిస్తున్న పందెం రాయుళ్లు, ప్రజలు గ్రామాల్లో సంక్రాంతి సందడి వణుకూరు(పెనమలూరు) : సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహించరాదన్న హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వణుకూరు గ్రామంలో కోడి పందేలు నిర్వహించటానికి టీడీపీ నేతలు శిబిరం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడు రాష్ట్ర ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు కాసరనేని మురళీ ఆధ్వర్యంలో ఇక్కడ కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలు నిర్వహించటం చర్చనీయంగా మారిం ది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు ఈడుపుగల్లులో నిర్వహిస్తున్న కోడి పందేలకు ధీటుగా టీడీపీలో మరో గ్రూపు ఇక్కడ పందేల నిర్వహణకు ఏర్పాటుచేశారు. పందెంరాయుళ్లకు, పందేలు చూసేందుకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. కంకిపాడు : మండలంలోని ఈడుపుగల్లు గ్రామ శివారు పంట పొలాల్లో సంక్రాంతి కోడి పందేలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఓ వైపు కోర్టు ఆదేశాలు ఉన్నా పందేలు బహిరంగంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమక్షంలో కోడి పందేలు ఆరంభమయ్యాయి. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పందెంరాయుళ్లు, జూదరులతో ఈడుపుగల్లు పందేల బరి కిటకిటలాడింది. బాహాటంగానే కోత ముక్క, కాయ్‌రాజా కాయ్, నిర్వహించారు. బుధవారం ఒక్క రోజే లక్షలు చేతులు మారినట్లు అంచనా. పందేలను ఎంపీపీ దేవినేని రాజా పర్యవేక్షిస్తున్నారు. -
కసంక్రాంతి ‘బరి’లో కాక్ ఫైట్
పోలీసులు వర్సెస్ ప్రజాప్రతినిధులు కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు మంత్రులతో ప్రారంభించేందుకు సన్నాహాలు వీవీఐపీల రాకపోకలకు ప్రత్యేక రోడ్లు నిర్మాణం కఠిన చర్యలు తప్పవని ఎస్పీల హెచ్చరికలు గుంటూరు సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లాలో కోడి పందేలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అండతో హైకోర్టు, పోలీస్ అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లక్షల రూపాయల ఖర్చుతో బరులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో కోడి పందేల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు హైదరాబాద్ స్థాయి అధికారులతో పైరవీలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులతో కలసి ‘చినబాబు’ వద్ద ఆమోదముద్ర తీసుకున్న నేతలు పోలీసులను లెక్కచేయకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా కట్టడి చేసిన పోలీసులు రేపల్లెలో ఏర్పాటు చేసిన బరుల వైపు వెళ్ళలేకపోయారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అప్పట్లో కోడి పందేలను ఆపలేకపోయారనేది బహిరంగ రహస్యమే. ఈ సారి కూడా అలాగే జరుగుతుందని అధికారపార్టీ నేతలు ధీమాగా ఉండగా, పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకునేలా అన్ని జిల్లాల ఎస్పీలకూ స్పష్టమైన ఆదేశాలిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఇళ్ళల్లోకి చొరబడి మరీ పందెం కోళ్ళను ఎత్తుకెళుతున్న పోలీసులు రేపల్లె మండలంలోని ఓ మాజీ ఎమ్మెల్యే పొలంలో పందేల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాకీ, ఖద్దరు మధ్య వివాదం జరిగిన ప్రతిసారీ ఖద్దరుదే పైచేయిగా నిలుస్తోంది. డీఎస్పీ, సీఐల బదిలీల దగ్గర నుంచి, జిల్లాలో జరుగుతున్నఅక్రమాలను అడ్డుకుంటున్న ఎస్పీల బదిలీల వరకు అధికారపార్టీ నేతల పంతమే నెగ్గుతూ వస్తోంది. మంత్రులు, ఎంపీలతో ప్రారంభించేందుకు సన్నహాలు ... జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలను ఆహ్వానించి కోడి పందేలను ప్రారంభింపజేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పొలాల్లో బరులు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడకు నేరుగా వీవీఐపీల వాహనాలు వచ్చేలా రోడ్ల నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. లక్షల్లో పందేలు కాసే వారి కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పందేల వద్ద ఉంటే పోలీసులు అక్కడికి వచ్చినా నిలువరించలేరనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు సైతం వారికి ఆ మేరకు భరోసా ఇస్తున్నారు. అయితే అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు మాత్రం కోడి పందేలు నిర్వహిస్తే సహించేదిలేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంక్రాంతి కాక్ ఫైట్‌లో ఖద్దరు, ఖాకీల్లో ఎవరు నెగ్గుతారో వేచి చూడాల్సిందే. -
సిద్ధమవుతున్న ‘పందెం’ కోళ్లు
తెర వెనుక అధికార పార్టీ నాయకులు మిన్నకుంటున్న పోలీసులు ఉయ్యూరు/కంకిపాడు : కోడి పందేల నిర్వహణపై కోర్టు ఆదేశాలు ఉన్నా సంక్రాంతికి బరులు సిద్ధమవుతున్నాయి. పండుగ సంప్రదాయం పేరుతో కోట్లు దండుకునేందుకు తెలుగు తమ్ముళ్లు రెడీ అవుతున్నారు. ఓ వైపు బరులు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో లాంఛనంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అతిథి గృహంలో ఆదివారం పందేలు ప్రారంభమైనట్లు, పండుగ మూడు రోజులు వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పండుగ సమీపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కంకిపాడు మండలం ఈడుపుగల్లు, ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామాల్లో బరులు భారీ సెట్టింగులతో ముస్తాబవుతున్నాయి. ఈడుపుగల్లులోని పంట పొలాల్లోనూ, గండిగుంటలో రియల్ ఎస్టేట్ వెంచరులో కోడి పందేలు, కోసు ముక్క నిర్వహించేందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. గత ఏడాది మాదిరిగానే అన్ని హంగులతో పందేలు నిర్వహించేందుకు తమ్ముళ్లు తహతహ లాడుతున్నారు. ఈడుపుగల్లు బరికి మండలానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, గండిగుంట బరికి నామినేటెడ్ పోస్టులో ఉన్న ముఖ్య నేత కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి వెనుక అధికార పక్షానికి చెందిన ముఖ్య నేతలు వాటాలు కలిపి, బరులకు తెరతీసినట్లు వినికిడి. గతేడాది నిర్వహించిన బరుల్లో కాల్‌మనీ కేసుల్లో ఉన్న ప్రధాన సూత్రదారులు పెట్టుబడులు పెట్టినట్లు బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దఫా కూడా అంతే స్థాయిలో పందేల బరులు నిర్వహించి, లక్షల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తుంది. బరుల్లో స్టాళ్లకు డిమాండ్ ఓ వైపు బరులు ఏర్పాటు చేయటమే చట్ట విరుద్థంగా సాగుతున్న చర్య అనుకుంటే బరుల్లో స్టాళ్ల ఏర్పాటుకు కూడా భారీగా డిమాండ్ ఉంది. గండిగుంట కేంద్రంగా నిర్వహించే బరిలో పలావ్ స్టాళ్లు, మద్యం, కూల్ డ్రింక్స్, పార్కింగ్ స్టాళ్లకు బహిరంగ వేలం నిర్వహించి స్టాళ్లు కేటాయించే ఏర్పాట్లు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు రెచ్చిపోయి బహిరంగంగా, గ్రామ ప్రధాన కూడళ్లలో పందేలు నిర్వహిస్తున్నారు. ఆగిపోయిన పేకాట శిబిరాలు కూడా ధైర్యంగా తెరిచి లావాదేవీలు కొనసాగిస్తున్నారని వినికిడి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం సిద్ధమవుతున్న బరులు పైనా, గ్రామాల్లో యధేచ్చగా సాగుతున్న పందేల పైనా కన్నెత్తి చూడటం లేదనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. నామకే వాస్తేగా 8 మంది కత్తులు కట్టే వ్యక్తులను పోలీసులు బైండోవర్ చేశారు. తరలిపోతున్న పందెంపుంజులను తనిఖీల ద్వారా అదుపులోకి తీసుకుని పందేల నిర్వహణను కొంతమేరకైనా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయకపోవటం గమనార్హం. -
పొదిలిలో యువకుని హత్య
కోడి పందాలు ఓ యువకుడి నిండు ప్రాణాలు తీశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పొదిలి గ్రామంలోని శ్రీపతినగర్‌లో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని కత్తులతో పొడిచి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(27) కోడిపందేలు ఆడేవాడు. కాగా.. అక్కడ కొంత మంది తో ఘర్షణలు తలెత్తాయి. అక్కడ జరిగిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లుపై కత్తులతో దాడి చేశారు. అతడిని అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేదిక ఏదైనా జూదక్రీడే..
వాలీబాల్ పోటీలపైనా భారీ ఎత్తున బెట్టింగ్ కస్టమ్స్-కర్ణాటక మ్యాచ్‌లో చేతులు మారిన రూ.5 లక్షలు ఏకపక్షపు పోటీల్లో ‘కోసు’ ప్రాతిపదికన పందేలు అమలాపురం : ‘గుండాట.. పేకాట.. కోడి పందేలు’.. జూదగాళ్లు తమ వ్యసనాన్ని పోషించుకోవడానికి ఒకప్పుడు ఇవే ఆధారాలు. కొందరు ఎక్కడో పరిగెత్తే రేసుగుర్రాలపై ఇక్కడుండే పందేలు కాసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. జూదగాళ్లకు నిత్యం రకరకాల అవకాశాలున్నాయి.‘ కుక్కపిల్లా.. అగ్గిపుల్లా.. సబ్బుబిళ్లా.. కాదేదీ కవితకనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అంటే..‘ప్రతి బంతీ.. ప్రతి ఓవర్..ప్రతి మ్యాచ్..అవును అన్నీ బెట్టింగ్‌కు అనువే’ అంటూ క్రికెట్ చుట్టూ భారీ జూదం జరిగిపోతోంది. ప్రపంచకప్ పోటీల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఆ క్రమంలోనే జూదోత్సాహం ఇతర క్రీడలకూ విస్తరిస్తోంది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నాలుగురోజులు జరిగిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు సైతం బెట్టింగ్ జాఢ్యం పాకింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జూదగాళ్లు ప్రతి మ్యాచ్‌లో పందేలు కాశారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ కస్టమ్స్, కర్ణాటక జట్ల మధ్య జరిగిన పోరులో రూ.ఐదు లక్షలకు పైగా పందేలు జరిగాయంటే ఇక్కడ జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. హోరాహోరీగా తలపడే జట్ల మీదే కాకుండా పోరు ఏకపక్షంగా సాగుతుందనుకునే మ్యాచ్‌లలోనూ కోసు పందేలు (చేతులు మారే మొత్తంలో ఎక్కువ తక్కువలకు ఒప్పందం జరిగే పందేలు) కాస్తున్నారు. పురుషుల విభాగంలో పాండిచ్చేరి, హైదరాబాద్ కస్టమ్స్ జట్ల మధ్య జరిగిన పోరులో రూ.300కు రూ.1000 చొప్పున ఇచ్చేలా కోసు పందేలు జరిగాయి. హోం మంత్రి ఉన్నచోటే.. యథేచ్ఛగా బెట్టింగ్ మహిళా విభాగంలో పోటీలకు సైతం చిన్నచిన్న మొత్తాల్లో పందేలు జరుగుతుండడం విశేషం. తన తండ్రి పేరున ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రతి రోజూ పోటీలను తిలకించారు. ఆయనకు బందోబస్తుగా అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్యతో పాటు రూరల్ సీఐ దేవకుమార్, మరో నలుగురైదుగురు ఎస్సైలు, పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది వాలీబాల్ పోటీల వద్ద ఉన్నా జూదగాళ్ల బెట్టింగ్ బరి యథేచ్ఛగా జరిగిపోవడం గమనార్హం. -
కత్తి కట్టి.. పందెం పట్టి..
రేపల్లె :అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సాక్షిగా సంప్రదాయం మాటున కోడి పందేలు జోరుగా సాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసులు మౌనం దాల్చడంతో పందెంరాయుళ్లు బహిరంగంగా ‘బరి’లోకి దిగారు. సంక్రాంతి సందర్భంగా రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేలు మూడవ రోజు శుక్రవారం భారీ స్థాయిలో జరిగాయి. ఈ మూడురోజుల్లో సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు చేతులు మారగా, వందలాది పుంజులు నెత్తుటిధారలతో నేలకొరిగాయి. గుంటూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా తీరప్రాంత మండలాల నుంచి పందెంరాయుళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకోవడంతో గుడ్డికాయలంక గ్రామం కిక్కిరిసిపోయింది. జూదరులు అనూహ్యంగా తరలిరావడంతో పందేలు కూడా అదే స్థాయిలో జరిగాయి. అధికారపార్టీ ప్రజాప్రతినిధులే బరివద్ద నిలవడంతో పోలీసులు ఇటువైపు చూసే సాహసం చేయలేకపోయారు. బహిరంగంగానే కోడి పుంజులకు కత్తులుకట్టి ఒక్కొక్క జతపై లక్షలాది రూపాయల పందేలు కాస్తూ జూదరులు విజృంభించిన తీరు చట్టానికి తూట్లు పొడిచినట్టయింది. ఇదే సమయంలో పేకాటలో కోతముక్క, ఇతర డబ్బా, చక్రం వంటి జూదాలను యథేచ్ఛగా ఆడారు. అధికార పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోడి పందేలను తొలిరోజు బుధవారం ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, రెండవ రోజు గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు తొలిరోజు నుంచీ బరి వద్దనే ఉంటూ జూదరులను ప్రోత్సహించే యత్నం చేశారు. ప్రజాప్రతినిధులు, మంత్రి పందేల్లో పాల్గొనటంతో పందెంరాయుళ్లు మరింత చెలరేగిపోయారు. ఇదిలావుండగా, సంప్రదాయం మాటున నిర్వహించిన కోడి పందేల కారణంగా వందలాది మంది ఆర్థికంగా నష్టపోయారు. గ్రామీణ ప్రాంతంలో పంటలు పుష్కలంగా పండి పచ్చగా ఉన్న తరుణంలో కోడి పందేలు నిర్వహించడంవల్ల ఆర్థిక స్థితిగతులు తల్లకిందులవుతున్నాయని ఈ సందర్భంగా పలు మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. -
పందేనికి సై
సంక్రాంతి మూడు రోజులూ కోడిపందేలు జోరుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే బరులు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు కూడా స్వయంగా పాల్గొనేందుకు సమాయత్త మవుతున్నారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన స్వగ్రామం నిమ్మకూరుకు రానున్నట్లు తెలిసింది. సంక్రాంతి సంబరాల్లో కోడి పందేల జోరుకు తెరలేచింది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందెపు రాయుళ్లు కాలు దువ్వుతున్నారు. వారం రోజుల నుంచే కోడి పందేలు జరుగుతున్నా.. గుట్టుచప్పుడు కాకుండా కొందరు జాగ్రత్త పడ్డారు. పలువురు ఎమ్మెల్యేలూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పండుగ దగ్గర పడటంతో కొన్నిచోట్ల బరులు సిద్ధం చేశారు. వీక్షకుల కోసం బారికేడ్లు ఏర్పాటుచేశారు. - సాక్షి ప్రతినిధి, విజయవాడ జిల్లాలో పందేల జోరు జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో 22 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలోనూ కోడి పందేలు వేసేందుకు రంగం సిద్ధమైంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను మించి ఇక్కడ కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచే కోడి పందేలు ప్రారంభం కానున్నాయి. గుడ్లవల్లేరులోని పశువుల సంత వద్ద భారీస్థాయిలో నిర్వహించేందుకు బరి గీశారు. ట్రాక్టర్ బ్లేడ్ వేసి నీరు చల్లి చదును చేస్తున్నారు. కొన్నిచోట్ల బారికేడ్లు కూడా కడుతున్నారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, ఉయ్యూరు మండలం గండిగుంట, పెడన మండలం పుల్లపాడు, బల్లిపర్రు, బంటుమిల్లి మండలం అర్థముర్రు, పెదతుమిడి, గూడూరు మండలం చిట్టిగూడూరు, రామన్నపేట, కృత్తివెన్ను మండలం పోడు, చిన్నగొల్లపాలెం, ఇంటేరు, చెరుకుమిల్లి, చాట్రాయి మండలం పోలవరం, ఆగిరిపల్లి మండలం శోభనపురం, విజయవాడ రూరల్ మండలం నున్న, కొత్తూరు తాడేపల్లి గ్రామాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు జిల్లాకు బాలయ్య సంక్రాంతి సంబరాలు జరుపుకొనేందుకు సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తన స్వగ్రామానికి రానున్నారు. బుధవారం నిమ్మకూరులో, గురువారం కొమరవోలులో ఆయన ఉండే అవకాశం ఉంది. పామర్రు నియోజకవర్గంలోని అయ్యంకి గ్రామంలో పొట్లూరి కృష్ణబాబు బాలకృష్ణకు బంధువు. ఆయన ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో బాలకృష్ణ పాల్గొంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కోడి పందేలను బాలకృష్ణ ప్రారంభించే అవకాశం కూడా ఉంది. బరిలో రాజసం ఇప్పుడైతే కోడి పందేల్లో కత్తులు కడుతున్నారు గానీ పూర్వం ‘డింకీ గోల్డ్’ అనే కోళ్లకు కత్తులు కట్టకుండానే బరిలో దింపేవారు. ఎత్తుగా ఉండే ఈ కోళ్ల కాళ్ల వెనుక భాగంలో కాటాలు ఉంటారుు. ఇవి కత్తుల్లా సూదులను పోలి ఉంటారుు. వీటిని బ్లేడుతో చెక్కి కోళ్లను రంగంలోకి దింపేవారు. ఈ కాటాల వల్ల ఒక్కోసారి ఎదుటి కోడి తల కూడా తెగి పడేదని చెబుతారు. ప్రస్తుతం మాత్రం పందెం కోళ్లకు కత్తులు కడుతున్నారు. ఈ కత్తులు తయారు చేసేవారు ప్రతి మండలంలోనూ ఇద్దరు నుంచి ముగ్గురు వరకు ఉన్నారు. గుడివాడలోని గుడ్లవల్లేరు మండలంలో ఇలాంటి కత్తులు ఎక్కువగా తయూరుచేస్తారు. విమానం తయూరీలో ఉపయోగించే ఇనుముతో తయారయ్యే ఈ కత్తులు చాలా పదునుగా ఉంటారుు. కొన్ని పందేల్లో ఆ కత్తులకు విషం పూస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే, కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పందేలకు జాతకాలు కూడా చెబుతుంటారు. తోకలు, ఈకల రంగులను బట్టి పోటీల్లో గెలుస్తాయూ, లేదా అనే విషయం చెప్పే నిష్ణాతులు మన జిల్లాలోనూ ఉన్నారు. మేముసైతం కోడిపందేలకు ఎమ్మెల్యేలు కూడా పచ్చజెండా ఊపుతున్నారు. అభిమానులతో కలిసి సరదాగా గడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ‘బుధవారం పండుగ సందర్భంగా కోడి పందేలు వేద్దాం.. రండి..’ అంటూ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించడం విశేషం. పచ్చకాకి : ఇది పందెపు కోళ్ల జాతిలో రారాజు. దీని ధర గత ఏడాది రూ.10వేలు ఉంటే, ప్రస్తుతం రూ.13వేలు పలుకుతోంది. కాకి : దీని ధర గత ఏడాది రూ.5వేలు పలికింది. ఈసారి రూ.8వేలు. నల్ల నెమలి : దీని ధర గతంలో రూ.6వేలు ఉంటే ఇప్పుడు రూ.10వేలకు చేరింది. కోడి డేగ : దీని ధర గత ఏడాది రూ.7వేలు పలికింది. ప్రస్తుతం రూ.9వేలకు పెరిగింది. కాకి డేగ : ఇది గత ఏడాది రూ.7వేలు ఉండేది. ప్రస్తుతం రూ.10వేలు. సీతువా : దీని ధర గత ఏడాది రూ.5వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.8వేల పైమాటే. పర్లా : ఇది గతంలో రూ.10వేలు. ఇప్పుడు రూ.13వేలు. ఎర్ర నెమలి : దీని ధర గత ఏడాది రూ.7వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.10వేలు. కోడి కాకి : గతంలో రూ.8వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.12వేలకు చేరింది. కగర కాకి : దీని ధర గత ఏడాది రూ.5వేలు పలికింది. ప్రస్తుతం రూ.8వేలకు చేరింది. ఎర్ర మైలా : రూ.4వేలు పలికే ఈ రకం కోడిపుంజు ఈ ఏడాది రూ.6వేల పైమాటే. తెల్ల కక్కిరాయి : దీని ధర గత ఏడాది రూ.5వేలు ఉంది. ప్రస్తుతం రూ.7వేలు. ఎర్ర పింగళా : రూ.5వేలు పలికిన ఈ జాతి కోడి ప్రస్తుతం రూ.7వేలకు చేరింది. -
కోఢీ
కత్తి కట్టి బరికి సిద్ధమైన కోళ్లు గోదావరి జిల్లాలకు దీటుగా నిర్వహణకు సన్నద్ధం జిల్లాలో 15 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేతులు మారనున్న రూ.700 కోట్లు! జిల్లాలో తొలిసారి పందెంకోడి బహిరంగంగా కాలు దువ్వుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ‘సంప్రదాయం’ ముసుగు తొడిగి అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. కోడి పందేల నిర్వహణకు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తీర్పును ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో కోడి పందేల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్టేనంటూ ప్రజాప్రతినిధుల అనుయాయులు కోళ్లకు కత్తులు కట్టి సిద్ధం చేస్తుంటే.. పందెం రాయుళ్లు నోట్ల సంచులు భుజాన వేసుకొని జిల్లాకు చేరుతున్నారు. సంక్రాంతికి రెండు రోజుల ముందే జిల్లాలో కోడి పందేల జోరు ప్రారంభమైంది. విజయవాడ సిటీ : కోడి పందేల నిర్వహణకు జిల్లా సిద్ధమైంది. జిల్లాలో కోడిపందేలు తొలిసారి బహిరంగంగా జరగనున్నాయి. కోడి పందేలు అంటే గుర్తుకొచ్చే ‘గోదావరి జిల్లాల’కు దీటుగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాలూ సిద్ధమయ్యాయి. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సంక్రాంతి మూడు రోజులు నిర్వహించనున్న కోడి పందేలకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పందేల రూపంలో రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్లు చేతులు మారే అవకాశముంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కోడి పందేల నిర్వహణకు ఒప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా కోడి పందేలు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ముందుగానే సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్దుబాటు చేశారు. ఈలోగా వచ్చిన సుప్రీం ఆదేశాలు తమకు అనుకూలంగా అన్వయించుకొని బహిరంగ ఏర్పాట్లు చేస్తున్నారు. బరులు సిద్ధం...: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేశారు. ఏటా ఒకటి రెండు ప్రాంతాల్లో, నూజివీడు డివిజన్లో ఒకటి రెండుచోట్ల చాటుమాటుగా జరిగేవి. ఈసారి ఐదారు చోట్ల నిర్వహించేందుకు మామిడి తోటల్లో పొక్లెయిన్లతో చదును చేసి తగిన ఏర్పాట్లుచేశారు. తూర్పు కృష్ణాలోని గుడివాడ, మచిలీపట్నం డివిజన్లలోని పలు ప్రాంతాల్లో కూడా ఈసారి పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగనున్నాయి. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించి కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగినట్టు చెబుతున్నారు. సకల సౌకర్యాలు పందెగాళ్ల కోసం నిర్వహకులు అన్ని సౌకర్యాలూ ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే పందెగాళ్ల కోసం విజయవాడలోని పలు హోటళ్లలో రూమ్‌లు బుక్ చేస్తున్నారు. ఇదే సమయంలో పందేలు నిర్వహించే సమయంలో అవసరమైన వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారి స్థాయిని బట్టి అవసరమైతే ఏసీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మద్యం, భోజనం సహా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కొన్నిచోట్ల రాత్రివేళల్లో ఆటవిడుపు కోసం రికార్డింగ్ డ్యాన్స్‌ల నిర్వహణ ఏర్పాట్లు కూడా ఉన్నట్టు తెలిసింది. పేకాట శిబిరాలు కూడా కోడి పందేలు నిర్వహించే చోటుకు సమీపంలో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలు బోర్ కొట్టినవారు వెళ్లిపోకుండా పేకాట ఆడేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఉవ్విళ్లూరుతున్న జిల్లావాసులు పలు చోట్ల జరిగే కోడి పందేలు తిలకించేందుకు జిల్లా, నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో పోలీసులకు భయపడి వెళ్లేందుకు సాహసించనివారు సైతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వాటిని తిలకించాలని భావిస్తున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర ప్రభుత్వ పెద్దల సూచన మేరకు పోలీసులు ప్రేక్షక పాత్రకు సిద్ధమవుతున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ‘కాపలా’ మాత్రమే ఉండాలని ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. -
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా...
సంక్రాంతి.. ఇది అచ్చ తెలుగు పండుగ.. అన్నదాతల పండుగ.. పంట చేతికొచ్చాక వచ్చే పండుగ. ఈ పండుగ ఆంధ్రాప్రాంత ప్రజలు జరుపుకునే పండుగ అని అభిప్రాయం ఉన్నా వరంగల్ జిల్లాలో ఈ పర్వదినానికి మొదటి నుంచి ప్రత్యేకత ఉంది. నోములు నోచుకోవడం, సకినాలు చేసుకోవడం, పతంగులు ఎగురవేయడం వంటివి మన ప్రాంతానికే ప్రత్యేకం. కాకతీయుల కాలంలో సంక్రాంతి పండుగ సమయంలో ఓరుగల్లు కోటలో కోడిపందేలు కూడా జరిగేవ ని తెలుస్తోంది. ఆంధ్రాప్రాంతంలో పొంగల్లు చేసుకుంటే ఇక్కడ సంక్రాంతి పండుగ నుంచి మల్లన్నబోనాలు చేసుకోవడం ప్రాంభమవుతుంది. ఐనవోలు, కొమురవెల్లి, గట్టు మల్లన్న తదితర మల్లన్న క్షేత్రాల్లో, వీరభద్రుని క్షేత్రాలైన కొత్తకొండ, కురవి తదితర క్షేత్రాల్లో జాతరలు సంక్రాంతి నుంచే ప్రారంభం కావడం విశేషం. - హన్మకొండ కల్చరల్ సంక్రాంతితో జాతరలు మొదలు సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పలు జాతరలు ప్రారంభమవుతారుు. ఈ రోజు మహిళలు నోములు నోముకోవడం అనవాయితీ. సంక్రాంతి పండుగకు నోములు జరుపుకోవడం తెలంగాణలో ప్రత్యేకమైనది. 13 కుమ్మరి కుండలను 13 పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టి కంకణాలు కట్టి అలంకరించి దేవుడి గదిలో దేవుడి ముందు పెడుతారు. ఆలాగే ఏవైనా వస్తువులను 13 చొప్పున కొనుగోలు చేసి పెడుతారు. ఇందులో ఎన్నోరకాల నోములు కన్పిస్తాయి. భూలోక ముద్ద, కుమ్మరి వామి, సల్ల కవ్వాలు, రేపల్లేవాడ, గౌరమ్మ పల్లాలు, ముంగిట్లో ముత్యాలు, పందిట్లో పగడాలు, ముందుం బియ్యం, 13 చీరలు, ఆకాశానికి అట్లు, భూదేవికి చీరలు, పార్వతిపరమేశ్వరులు, గాంధారినోము నోముల్లోని రకాలు. భోగి.. భోగి అంటే మొదటి రోజు అని అర్థం. అంటే ఉత్సవం నిర్వహణకు ప్రారంభం. దీపావళి ముందు రోజు కూడా భోగి పండుగ నిర్వహిస్తారు. ఈ రోజు నువ్వుల నూనెతో శరీరాన్ని మర్థించి స్నానం చేస్తారు. నీళ్లలో రేగుపండ్లు వేసి కాగించి ఆ నీళ్లతో స్నానం చేయడం ప్రత్యేకం. ఇలా చేయడం వల్ల చలితో బిగుసుకుపోయిన కీళ్లు వదులవుతాయి. ప్రత్యేకించి చిన్నపిల్లలకు ఉదయమే స్నానం చేయించి, కొత్త దుస్తులు ధరింపజేసి, పీటలపై కూర్చుండపెడతారు. వారికి బొడబొడికెలు పూస్తారు. ఇలా చేస్తే దిష్టి పోయి,ఆయుర్వుద్ధి కలుగుతుందని నమ్మకం. కనుమ.. సంక్రాంతి మరుసటి రోజు పండుగ కనుమ. దీనినే కల్పపు పండుగా అని కూడా అంటారు. నోముకున్నవారు తమ చుట్టుపక్కల ముతైదులను పిలిచి నోము వస్తువులను వారికి వాయినంగా ఇస్తారు. ఈ రోజు గోపూజ చేస్తారు. పొలాలు దున్నే ఎద్దులకు కృతజ్ఞతలు తెలిపేవిధంగా చేస్తారు. ఈ రోజు పక్షి పూజ కూడా చేస్తారు. పక్షులు తినడానికి ఆహారం పెడతారు. లోగిళ్లలో రంగవల్లులు.. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి చంద్రుడి నెలవంకను చూసి ముగ్గు వేయడం ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ప్రతిరోజు ముగ్గులు వేస్తారు. ముగ్గులు కూడా కేవలం బియ్యం పిండితోనే వేస్తారు. గీతల ముగ్గులకు ప్రాధాన్యముంటుంది. భోగిరోజు బోగి కుండల ముగ్గులు, పాల కుండల ముగ్గులు, సంక్రాంతి రోజు రథం ఇంటిలోపలికి వచ్చినట్లు వేసే ముగ్గులు, కనుము రోజు రథం బయటికి వెళ్తున్నట్లు వేసే ముగ్గులు పిల్లలను, పెద్దలను అలరిస్తాయి. చివరిరోజున రథం ముగ్గు వేస్తారు. సంక్రాంతి పర్వదినాన వాకిళ్లన్ని రంగులమయమవుతారుు. సంక్రాంతి అన్ని పండుగల్లాగా తిథివారాలతో సంబంధమున్న పండుగ కాదు. కాలగమనంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి స్యూర్యుడు మారుతుంటాడు. అలా మారుతున్న క్రమాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించిన ఈ రోజును మకర సంక్రాంతి అంటారు. గొబ్బెమ్మలు.. ఆవుపేడతో గోపురం ఆకారంలో చేసి వాటి మధ్యలో పిండికూర, గరిక కొమ్మలు చెక్కి చుట్టూ పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముగ్గుల మధ్య, గడపకు రెండు వైపులా పెట్టి చుట్టూ రేగు పండ్లు, నవధాన్యాలు, బంతిపూలు పోస్తారు. శ్రవణానందాన్ని ఇచ్చే హరిదాసుల కీర్తనలు మెడలో మాలలు, నుదుట పుండరీకాలు, కాళ్లకు గజ్జెలు ధరించి , తలపై అక్షయ పాత్ర, ఒక చేతిలో చిరుతలు, మరో చేతిలో తంబూర మీటుతూ ధనుర్మాసం ప్రారంభమైనప్పుటి నుంచి హరిలో రంగహరి అంటూ హరికీర్తనలు పాడుతూ వాడవాడలా కన్పించేవారు. కొద్ది సంవత్సరాలుగా హరిదాసుల జాడే లేకుండా పోయింది. మాలదాసరులు మిత్తిలి కులానికి చెందిన వీరు ప్రస్తుతం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. బసవన్నల విన్యాసాలు.. సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువగా కన్పిస్తుంటారు. అలకరించిన ఎద్దులను వెంట తీసుకుని తిప్పుతూ వాటితో విన్యాసాలు చేయిస్తుంటారు. గంగిరెద్దుల మనిషి పడుకుని ఉండగా అతని చాతి మీద ఎద్దు ముందరి కాళ్లు పెట్టి డప్పుకు అనుగుణంగా నృత్యం చేయడం, తన యజమాని మెడను పట్టుకుని లేపడం ఒక చిన్న పీట మీద నాలుగు కాళ్లు పెట్టి నిలబడటం, మనిషితో పోటీపడి పరుగెత్తడం, కాళ్లు లేపి దండం పెట్టడం వంటి చిత్రమైన విన్యాసాలు చేస్తుంటుంది. డూడూ బసవన్న ఇలా చేస్తున్న సమయంలో సన్నాయి ఊదుతూ డోలు శబ్ధం చేస్తూ రక్తి కట్టిస్తారు. వీరు డబ్బులు ఇచ్చేవరకు కదలరు. వీరు ప్రధానంగా నివసించేది. తెలంగాణ ప్రాంతంలోనే. అయినా పండుగ సమయంలో ఆంధ్రా ప్రాంతానికి వెళ్తుంటారు.సంక్రాంతి రోజు పతంగులను ఎగురవేయడం పిల్లలకే కాదు పెద్దలకు సంతోషాన్నిస్తుంది. ఈ సీజన్లో గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో పతంగులను ఎగురవేస్తారు. సంక్రాంతి స్పెషల్ సకినాలు.. బియ్యం పిండితో సకినాలు చేయడం తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకత. ముందు రోజు రాత్రి బియ్యం కడిగి నానబె డతారు. ఉదయం నీళ్లు లేకుండా వార్చి ఆ బియ్యాన్ని రోట్లో వేసి దంచుతారు. ఈ పిండిలో నువ్వులు, వాము, ఉప్పు నీళ్లు కలుపుతారు. కొద్దిగా పిండిముద్దను చేతిలో తీసుకుని కాటన్ క్లాత్‌పై గుండ్రంగా మూడు, నాలుగు చుట్లు చుడుతారు. అలాగే మొదటి సకినాన్ని ముతైదువతో చుట్టించి మధ్యలో గౌరమ్మను పిండితో చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. తర్వాత ఇరుగుపొరుగు మహిళలు అందరూ కలిసి సకినాలు చుడుతారు. సకినాలు చేసుకునే తీరు మహిళల్లో ఐక్యతకు చిహ్నంగా కన్పిస్తుంది. సకినాలు ఒక తెలంగాణలో తప్ప మరెక్కడా కన్పించని ప్రత్యేక వంటకం. చలిలో వణికిపోతున్నప్పుడు సకినాలు తినడం వేడిని పుట్టించే విధంగా ఉంటుంది. -
గోదారి ‘బరి’లో పాతబస్తీ కోడి!
నగరం నుంచి గోదావరి జిల్లాలకు పందెంరాయుళ్లు పాతబస్తీ పుంజుల కోసం నగరానికి క్యూ... రూ.లక్షల్లో ధరలు సంక్రాంతి వరకు ఇక సందడే సందడి... సిటీబ్యూరో/చాంద్రాయణగుట్ట: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో వ్యవస్థీకృతంగా కోడి పందేలు, జూదం నిర్వహించడం ఆనవాయితీ కావడంతో పందెంరాయుళ్లు రేసుగుర్రాల అవతారమెత్తారు. వీరిలో బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు, బెట్టింగ్ రాయుళ్లతోపాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులు, అనధికారులుండడం విశేషం. కాగా గోదావరి జిల్లాల్లో ప్రధాన రహదారులకు దూరంగా, పంటపొలాల మధ్య దాదాపు రెండుమూడు ఎకరాల విస్తీర్ణంలో.. బంకిణీగా పిలిచే రహస్య ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తుండడంతో గుట్టు చప్పుడు కాకుండా పందెం కాసేందుకు సిటీ పందెం వీరులు అక్కడికి చేరుకుంటున్నారు. పలువురు ఇప్పటికే అక్కడికి చేరుకోగా మరికొందరు వచ్చే మూడు రోజుల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు నగరవాసులు తమ కుటుంబాలతో సహా పయనమయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. కోడి పందేలకు కేరాఫ్... గోదావరి జిల్లాల్లో పందేలకు ప్రసిద్ధిగాంచిన ఆకివీడు, ఐ భీమవరం, చెరుకుమిల్లి, గుడివాడ-భీమవరం,కాళ్ల, జువ్వలపాలెం, వెంప, భీమవరం, కొప్పాడ, పత్తేపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం వెళ్లేందుకు నగరానికి చెందిన పందెంరాయుళ్లు సిద్ధమయ్యారు. ఇక ఆయా ప్రాంతాలకు వచ్చే వారిని సురక్షితంగా బంకిణీలకు చేర్చేందుకు కొందరు యువకులు ‘పోర్టర్ల’ అవతారంలో సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఒక్కో పుంజుకు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తూ దొడ్డిదారిన వీరిని బంకిణీ వద్దకు చేర్చడమే ఈ పోర్టర్ల పని కావడం గమనార్హం. పాతబస్తీ పుంజులు గోదావరి జిల్లాలలో జరిగే కోడి పందేలలో పాతబస్తీ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తవంగా కోడి పందేలకు....పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్ల పంట పండించే కోడి పుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా రంగంలోకి దిగేవారు కదనరంగంలోకి దూకి విజేతలుగా నిలిచే పాతబస్తీ కోడిపుంజులకు లక్షలాది రూపాయల ధర పలుకుతుండడం విశేషం. పలువురు పందెంరాయుళ్లు ప్రస్తుతం బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతున్నారు. వీరి వద్ద కోడిపుంజు తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకంతో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఒక్కో పందెం కోడిపుంజు ధర లక్ష రూపాయల వరకు పలుకుతోంది. అలాగని బార్కాస్ పహిల్వాన్లు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు, ఏడాదికి పరిమిత సంఖ్యలో మాత్రమే వీరు కోడిపుంజులను విక్రయిస్తుంటారు. ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్డును ఏర్పాటు చేసి..అందులో ప్రత్యేక ఎన్క్లోజర్ల మధ్య వాటిని పెంచి పోషిస్తున్నారు. రెండేళ్ల వయసున్న కోడి పుంజులనే పందేనికి వినియోగిస్తారు. ప్రత్యేక మసాజ్, పసందైన ఆహారం... వీరు పెంచే పందెం కోడి పుంజులకు విటమిన్లతో కూడిన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, అక్రోట్, కీమా, ఉడికించిన గుడ్ల(తెలుపు భాగం)ను ఆహారంగా ఇస్తారు. ఈ కోడిపుంజులకు ప్రత్యేకంగా ఆహారాన్ని అందించడంతో పాటు వాటికి కదనరంగంలో దూకేలా అన్ని రకాల తర్ఫీదునిస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు నైపుణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటల మసాజ్‌లు చేయిస్తారు. అదేవిధంగా పరుగెత్తడం కూడా నేర్పిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంతమంది పహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. కోళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. -
కోడి పందేలకు అనుమతి లేదు
హైకోర్టుకు నివేదించిన ఏపీ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఏపీలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఈ వివరాలను నమోదు చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుపా నేతృత్వంలోని ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిల్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ గతవారం హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
బెట్టింగ్ రాయుళ్ల బెంబేలు
వనపర్తి: దీపావళి పండుగ సంబరాల పేరుతో వీపనగండ్ల సమీపంలో వారం రోజులుగా జరుగుతున్న కోడి పందేల నిర్వహణను ‘సాక్షి' బయటపెట్టడంతో జూదం నిర్వాహకులు, బెట్టింగ్ రాయుళ్లు ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. శనివారం ‘పందెం కాస్కో!’ శీర్షికన వచ్చిన కథనానికి వెంటనే పందేల నిర్వహణకు అనువుగా వీపనగండ్ల- తూంకుంట గ్రామాల మధ్య ఉన్న గుంతవంపులోని పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ విషయమై వనపర్తి డీఎస్పీ జోగుల చెన్నయ్య స్పందిస్తూ కోడి పందేల నిర్వహణపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. కోడిపందేల నిర్వహణ చట్టవిరుద్ధమని, నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పందేల విషయం తమకు ఏమాత్రం సమాచారం లేదని, ఇం దుకు తమశాఖ సిబ్బంది ఎవరైనా బాధ్యులని తేలితే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సంచలనం సృష్టించిన ‘సాక్షి’ కథనం వీపనగండ్లకు చెందిన కొందరు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించి జూదానికి పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం వనపర్తి పోలీస్ సబ్‌డివిజన్‌లో సంచలనం సృష్టించింది. కోడిపందేల్లో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పందేల్లో పాల్గొన్నారని సమాచారం. పందేల్లో పరోక్షంగా పాల్గొని రూ.వేలకు వేలు పొగొట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. మరో పక్క పందెంలో ఓడిన కోడిమాంసంతో కొందరు పోలీసు అధికారులు ఇన్నాళ్లు ఖుషీ చేశారని, డబ్బుకు డబ్బు, విందులకు విందులు అనుభవించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వర్ణం: గుర్రప్పందాలే కానీ కాదు !
సంక్రాంతి వస్తే కోడిపందాలు ఆడటమో, చూడటమో చాలా మందికి మోజు. మరి కోడిపందాలకు, గుర్రప్పందాలకు మీకు తేడా తెలుసా? ఎందుకు తెలియదు... అవి పోట్లాడి గెలుస్తాయి. ఇవి పరుగెత్తి గెలుస్తాయి. అయితే ఈ ఫొటోలో మీరు చూస్తున్నవి గుర్రప్పందాలే. కానీ మీరనుకునేవి కాదు. 500 సంవత్సరాలుగా చైనాలో ఉన్న ఓ సంప్రదాయం. అచ్చం కోడిపందాల్లాగే మగ గుర్రాలు ఒకదాంతో ఒకటి మల్లయుద్ధానికి దిగుతాయి. గెలుపోటములు కూడా కోడిపందాల్లాగే ఉంటాయి. పన్నెండు జంతువుల పేర్ల మీద సంవత్సరాలు లెక్కించే చైనీయులకు ఈసారి ‘గుర్రపు సంవత్సరం’. చైనాలోని ఓ మారుమూల గ్రామంలోని దృశ్యమిది. కాఫీ అరబికా ! చక్కటి ఫొటో ఒక బ్రెజిలియన్ కార్మికుడు కాఫీ గింజలను చెరుగుతుండగా తీసినది. ఇవి కాఫీ గింజలే గాని మనం వాడుతున్నవి కాదట. వీటిపేరు కాఫీ అరబికా. ఇథియోపియా లో వెయ్యేళ్ల క్రితం నుంచి సాగుచేస్తున్న ఈ కాఫీ గింజలు మిగతా వాటికంటే భిన్నమైన రుచిని ఇస్తాయి. ఎందుకంటే వీటిలో ఇతర కాఫీ గింజల్లో ఉండే కెఫైన్లో కేవలం సగమే ఉంటుందట. దానివల్ల వీటితో చేసే కాఫీ మరింత రుచిగా ఉంటుంది. ఇవి ఇపుడు పలుదేశాల్లో పండిస్తున్నారు. పొరబడ్డారా ! ఫొటోలో టవర్ నిజం కాదేమో అనుకున్నారా. నిజమే. కానీ ఇది ‘ఈఫిల్ టవర్’ అని అనుకుంటే మీరు పొరబడినట్టే. చైనాలోని ప్రాచీన సుజోవు నగరంలో ఏర్పాటుచేసిన టవర్ ఇది. దీనికి ఫ్రెంచి డిజైనర్ పాట్రిక్ విద్యుత్ వెలుగులతో అందం తెప్పించారు. దీనికోసం 2200 కోట్లు ఖర్చుపెట్టడం విశేషం. దీనిని డాంగ్ వు టవర్ అని పిలుస్తారు చైనీయులు. -
ఆంధ్రా ‘లాస్‌వేగాస్’.. ఐ.భీమవరం
-
‘కోడి’తే కోట్లే..!
* గోదావరి జిల్లాల్లో మొదలైన కోడి పందేల జాతర * ముహూర్తం చూసుకుని మరీ బరిలోకి * కిక్కిరిసిన భీమవరం ప్రాంతాలు * పోలీసుల ఆంక్షలను లెక్కచేయని వైనం * రూ.400 కోట్లు దాటనున్న పందేరం * 3 రోజులూ రేయింబవళ్లూ పందేల జాతరే ఏలూరు, సాక్షి ప్రతినిధి: ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంకుల సమరానికి బరులు సిద్ధమయ్యాయి. పందెం రాయుళ్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లలా తర్ఫీదు ఇప్పించిన కోడిపుంజులను గోదాల్లోకి దింపారు. పండగ రోజున వినోదం పేరుతో జరిగే ఈ పందేలకు సోమవారం ముహూర్తం చూసుకుని మరీ తెరలేపారు. ఈసారి పందేలను జరగనిచ్చేది లేదని పోలీసులు చేసిన హడావుడి పైస్థాయి నుంచి ఒత్తిడి ముందు దూదిపింజలా ఎగిరిపోయింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పందేలు నిరాటంకంగా జరిగీఖపోతున్నాయి. కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమగోదావరి జిల్లాలో అయితే ఎప్పటిమాదిరిగానే పందేల పందేరం జూద మహాసభలను తలపిస్తున్నాయి. పండుగ మూడు రోజులూ రేయింబవళ్లూ పందేలు నిరాటంకంగా జరగనున్నాయి. లక్షల్లో పందేలు.. కోట్లలో లావాదేవీలు.. * పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరం, భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, భీమవరం మండలంలోని వెంప రాష్ర్టంలోనే భారీగా పందేలు జరిగే ప్రాంతాలుగా గుర్తింపుపొందాయి. * వెంపలో సోమవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ముహూర్తం పెట్టి మరీ పందేలను ఆరంభించారు. * నిడమర్రు మండలం ఫత్తేపురంలో ఏకంగా 30 ఎకరాల చెరువును ఎండబెట్టి బరిని సిద్ధం చేశారు. * ఐ.భీమవరంలోనే ఈ 3 రోజుల్లో రూ.100 కోట్లకుపైగా సొమ్ములు చేతులు మారతాయని అంచనా. ప్రకృతి ఆశ్రమం, వెంపలో రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్య లావాదేవీలు జరుగుతాయని చెబుతున్నారు. వెంపలో సోమవారం సాయంత్రం ఒకే పందెం రూ.12 లక్షలకు జరిగింది. * నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంతోపాటు దాదాపు జిల్లాలోని ప్రతి మండలంలోనూ 10 నుంచి 15 చోట్ల పందేల బరులు ఏర్పాటయ్యాయి. ఉండి మండలం మహదేవపట్నం, జువ్వలపాలెంలోనూ భారీ పందేలు జరుగుతాయి. ఏలూరు సమీపంలోని కాళ్లచెరువు, కొప్పాక, దుగ్గిరాల ప్రాంతాల్లోనూ భారీ పందేలు వేస్తున్నారు. * తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి, ఐ.పోలవరం మండలం పెదమడి, కేశనకుర్రు, ఆత్రేయపురం, మెట్ట ప్రాంతంలోని జగ్గంపేట, కిర్లంపూడి ప్రాంతాల్లో కూడా పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు * మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో మూడు రోజులు కలిపి రూ.300 కోట్లకుపైగా పందేలు జరుగుతాయని అంచనా వేస్తున్నా, అదికాస్తా ఇప్పుడు రూ.400 కోట్లు దాటుతుందంటున్నారు. ఇవే పందెం కోళ్లు.. ఈక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలుంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఎక్కువగా కనిపిస్తాయి. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతారు. కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తున్నారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ క్రేజ్ ఉంటోంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే వందరెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుగు వారి ‘లాస్‌వేగాస్’.. ఐ.భీమవరం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఐ.భీమవరం కోడిపందేలకు సంబంధించి ‘తెలుగు వారి లాస్‌వేగాస్’ అన్న ఖ్యాతి పొం దింది. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు రూ.70 కోట్ల పందేలు జరుగుతాయని అంచనా. పందేలను చూడ్డానికి వచ్చే వారి తాకిడి ఎక్కువగా ఉం డడంతో భీమవరం పరిసర ప్రాంతాల్లో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ రూములన్నీ 4 నెలల క్రితమే బుక్ అయిపోయాయి. హోటళ్ల నిర్వాహకులు ఒక్కో రూమ్‌కు రూ. 12 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. భీమవరం చుట్టుపక్కల 200 అతిథిగృహాలు సైతం నిండిపోయాయి. రూములు దొరకని వారు రాజమండ్రి, ఏలూరు, తణుకు, విజయవాడ తదితర పట్టణాల్లో హోటళ్లు బుక్‌చేసుకుని అక్కడి నుంచి వస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాలతోపాటు కోస్తా జిల్లాల నుంచి సాధారణ వ్యక్తులతోపాటు ప్రజాప్రతినిధులు, రాజ కీయ, పారిశ్రామిక, సినీ రంగాల ప్రముఖులు కూడా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో సోమవారం ఉదయం నుంచి భీమవరం పట్టణం స్తంభించింది. ప్రకృతి ఆశ్రమానికి వెళ్లే రోడ్డు ఖరీదైన కార్లతో నిండిపోయి ముందుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కత్తి కడితే కనకవర్షమే... - కోడికి కత్తి కడితే పందేల నిర్వాహకులకు కనకవర్షమే. నిర్వాహకులు ఒక పందెం సొమ్ములో 10 శాతాన్ని కేవులు(తీతలు)గా వసూలు చేస్తారు. ఒక్కో బరిలో రోజుకు తీతలే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆ సొమ్ము నుంచే నాయకులకు, పోలీసులకు వాటాలు అందుతుంటాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేల బినామీలే స్వయంగా పందేలు నిర్వహిస్తుండడం గమనార్హం. పశ్చిమలో ఒక ఎమ్మెల్యే ఏటా ఈ సీజన్లో పందేల నిర్వాహకుని అవతారం ఎత్తుతున్నారంటే ఏ స్థాయిలో గిట్టుబాటు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ‘కత్తుల’ వెనక విషపు క్రీనీడ - సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం. అయితే, ఇప్పుడు త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, పెయిన్కిల్లర్లు ఇష్టానుసారం వినియోగిస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. పందేలు.. ప్రత్యక్ష ప్రసారం నిడదవోలు పాత పటిక ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటుచేసిన బరుల్లో భారీస్థాయిలో టెంట్లు, స్టేడియం తరహాలో గ్యాలరీలు, వీఐపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధానంగా పందేలను దగ్గరనుంచి వీక్షించే వీలులేని వారికోసం ఎల్సీడీలు ఏర్పాటుచేసి మరీ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. సుమారు 400 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ గార్డులతో వీఐపీ గ్యాలరీలకు భద్రత కల్పిస్తున్నారు. సినీనటులు తనీష్, వెన్నెల కిషోర్, ఆదర్శ్ తదితరులు పందేలను తిలకించేందుకు వచ్చారు. - న్యూస్‌లైన్, నిడదవోలు చేతులెత్తేసిన పోలీసులు.. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ పందేలు జరగనివ్వమని పోలీసులు జారీ చేసిన హెచ్చరికలు ఉత్తిదేనని మరోసారి తేటతెల్లమైంది. ఉన్నతాధికారులు పందేలను ఆపడానికి విశ్వప్రయత్నం చేసినా పైస్థాయిలో ఒత్తిడి రావడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఏలూరు రేంజి ఐజీ విక్రమ్‌సింగ్ మాన్ పందేలను ఆపేందుకు భారీ కసరత్తు చేశారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో పం దేలు జరిగే ప్రాంతాలను ముందే గుర్తించి బరులను స్వాధీనం చేసుకోవడం, అటువెళ్లే దారుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఈసారి పందేలు జరగవేమోనని సోమవారం ఉదయం వరకు జూదగాళ్లు ఆందోళన చెందారు. ఐతే మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఉదయం 11 గంటల నుంచి పోలీసులు బరుల నుంచి పక్కకు వెళ్లిపోవడంతో పందేల పందేరం మొదలైంది. బరిప్రియులకు ఒకరోజు ‘బోనస్’ ఈ ఏడాది కోడి పందేలను నిలిపివేయాలంటూ పలువురు లోకాయుక్తతోపాటు, హైకోర్టును ఆశ్రయించడంతో పందెంరాయుళ్లు తొలుత కొంత దిగాలుపడ్డారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ పండుగ తరువాతే ఆరంభించడంతో వారి ఉత్సాహం కట్టలు తెగిన గోదావరే అయింది. అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజులపై.. భోగి 13 తేదీయా, లేక 14నా అనే సందేహం నెలకొనడంతో పందెం ప్రియులకు బోనస్రోజూ వచ్చి చేరింది. -
ఊరంతా సంక్రాంతి
కైకలూరు మండలంలోని గోనెపాడులో సంక్రాంతి సండిని పరిశీలించేందుకు ‘న్యూస్‌లైన్’ ఆదివారం సందర్శిం చిది. గ్రామం సంక్రాంతి కళ సంతరించుకుంది. బంధువులతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ఏ ఇంట చూసినా ఘుమఘుమలాడే పిండివంటలు తయారవుతూ కనిపించాయి. సరదాల కోడిపందాలు జరుగుతున్నాయి. పతంగులతో చిన్నారుల పరుగులు, పట్టుపరికిణీలతో పల్లెపడుచుల హొయలు, రంగు రంగుల రంగవల్లులు కనువిందుచేశాయి. సూర్యోదయానికి ముందుగానే యువతులు, మహిళలు వాకిళ్లను ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తూ కనిపించారు. ముగ్గులకు రంగులు అద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. హరిదాసు కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటినీ సందర్శించాడు. గంగిరెద్దులోళ్లు డోలూ సన్నాయి వాయిద్యాలతో డూడూబసవన్నలను ఆడించారు. గ్రామంలోని చెరువులో పది మంది యువకులు కోడిపుంజులకు స్నానాలు చేయించారు. బద్దకంపోయి చలాకీగా పందేల్లో పాల్గొనాలంటే ఈ స్నానాలు తప్పవని వారు చెప్పారు. ‘సూరమ్మ.. పిన్నీ మీ అల్లుడు పండక్కి వస్తున్నాడా...’ అంటూ ఒకరు, కోడలా... మనవడు ఉదయమే బస్సు దిగాడంటగా ఏడీ ఇంక బయటకు రాలేదు..’ అంటూ మరొకరు.... ‘ఒరేయ్ అబ్బాయ్ కోడి పందేనికి వెళ్దామా’ అంటూ మరొకరు పలుకరించుకుంటూ కనిపిం చారు. ఉదయం ఆరు గంటల నుంచే అరుగులపైకి చేరిన గ్రామస్తులు లోకాభిరామాయణాన్ని చర్చించుకున్నారు. యువతులు పట్టు పరికిణీల్లో తమ వీధుల్లో ఇళ్ల ముందువేసిన ముగ్గులను పరిశీలించి వాటికి మార్కులు వేశారు. అనంతరం ఒప్పులగుప్పు, తొక్కుడుబిళ్ల వంటి ఆటలాడారు. చిన్న పిల్లలు రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ వీధుల్లో అటూ ఇటూ పరుగులు తీశారు. ఇంటి పనులు పూర్తిచేసుకుని ఏడు గంటల నుంచి మహిళలు బృందాలుగా పిండివంటల తయారీకి సిద్ధమయ్యారు. రోటిపై కుందుచేర్చి రోకళ్లతో కొందరు బియ్యాన్ని పిండి కొట్టగా, మరి కొందరు ఆ పిండిని జల్లించారు. పిండి కొట్టడం పూర్తయ్యాక అరిసెలు, మిఠాయి, చెక్కలు, తదితర వంటలు వండే పనిలో నిమగ్నమయ్యారు. బంధువుల రాకతో సంతోషం ఏడాదిలో పెద్ద పండగ ఇది. బంధువులందరూ ఒక్కచోటకు చేరితే ఆ సంతోషమే వేరు. ఈ కలయికలే ప్రేమలు పెంచుతాయి. మా మనవడు మద్రాసులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వాడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. కాలం మారే కొద్ది సంప్రదాయలు కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడటం మన బాధ్యత. - బొల్లా లక్ష్మీనృసింహమూర్తి, గోనెపాడు చుట్టాలతో ఊరంతా కళకళ సంక్రాంతి పండగ వచ్చిదంటే ఊరంతా చుట్టాలతో కళకళలాడుతుంది. కొత్త దంపతులు, పొరుగూరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు కచ్చితంగా ఊరొస్తారు. ఈ సంతోషం ఎప్పుడూ ఇలానే ఉండాలి. మా అబ్బాయి విశాఖపట్నంలో ఉంటున్నాడు. పండక్కి ఊరొస్తున్నాడు. వాడికి అరెసెలంటే ఎంతో ఇష్టం. వాడికి ఇష్టమైన పిండి వంటలు చేసిపెడతా. - నంగెడ్డ సూరమ్మ, గోనెపాడు సరదాల సంక్రాంతి సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంటినిండా చుట్టాలు, చిన్నపిల్లలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చిన్నారులకు భోగిపళ్లు పోసి పండుగను సరదాగా జరుపుకుంటాం. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తాం. - వత్తుమిల్లి అశ్వని, జుఝవరం, పామర్రు మండలం కొట్టిన పిండితోనే అరిసెలు మేము స్వయంగా రోకళ్లతోకొట్టిన పిండివంటలు చేస్తాం. మిల్లు పట్టించుకోం. మా చుట్టు పక్కల వాళ్లం అందరం కలసి రోటిలో పిండి కొట్టుకుని అరిసెలు, ఇతర వంటకాలు చేసుకుంటాం. ఏళ్ల తరబడి ఇలాగే వండుకుంటున్నాం. సంక్రాంతి, దీపావళి పండుగలకు ఒకరి పనులకు మరొకరం సాయపడుతూ సందడిగా పనులు చేసేస్తాం. - మద్ది సామ్రాజ్యం, మర్రిపాలెం, నాగాయలంక మండలం సంక్రాంతంటే ఆనందం సంక్రాంతి అంటే మాకు ఎక్కడలేని ఆనందం. గృహాలకు శుభం చేకూరుస్తుందని ధనుర్మాసంలో పోటీపడి వాకిళ్లలో పేడకళ్లాపు చల్లి ముగ్గులు వేస్తాం. కాలం మారినా సంక్రాంతిని వదిలేది లేదు. పిండివంటలు వండుతాం, భోగిపళ్లు పోస్తాం. చెరకు గడలు, తేగలను సంక్రాంతి పండుగలో భాగస్వామ్యం చేస్తాం. ఈ కాలంలో అవి మహారుచిగా ఉంటాయి. - కొట్ర రమాదేవి, రేమాలవారిపాలెం,నాగాయలంక మండలం