తెర వెనుక అధికార పార్టీ నాయకులు
మిన్నకుంటున్న పోలీసులు
ఉయ్యూరు/కంకిపాడు : కోడి పందేల నిర్వహణపై కోర్టు ఆదేశాలు ఉన్నా సంక్రాంతికి బరులు సిద్ధమవుతున్నాయి. పండుగ సంప్రదాయం పేరుతో కోట్లు దండుకునేందుకు తెలుగు తమ్ముళ్లు రెడీ అవుతున్నారు. ఓ వైపు బరులు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో లాంఛనంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అతిథి గృహంలో ఆదివారం పందేలు ప్రారంభమైనట్లు, పండుగ మూడు రోజులు వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పండుగ సమీపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కంకిపాడు మండలం ఈడుపుగల్లు, ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామాల్లో బరులు భారీ సెట్టింగులతో ముస్తాబవుతున్నాయి. ఈడుపుగల్లులోని పంట పొలాల్లోనూ, గండిగుంటలో రియల్ ఎస్టేట్ వెంచరులో కోడి పందేలు, కోసు ముక్క నిర్వహించేందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి.
గత ఏడాది మాదిరిగానే అన్ని హంగులతో పందేలు నిర్వహించేందుకు తమ్ముళ్లు తహతహ లాడుతున్నారు. ఈడుపుగల్లు బరికి మండలానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, గండిగుంట బరికి నామినేటెడ్ పోస్టులో ఉన్న ముఖ్య నేత కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి వెనుక అధికార పక్షానికి చెందిన ముఖ్య నేతలు వాటాలు కలిపి, బరులకు తెరతీసినట్లు వినికిడి. గతేడాది నిర్వహించిన బరుల్లో కాల్‌మనీ కేసుల్లో ఉన్న ప్రధాన సూత్రదారులు పెట్టుబడులు పెట్టినట్లు బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దఫా కూడా అంతే స్థాయిలో పందేల బరులు నిర్వహించి, లక్షల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తుంది.
బరుల్లో స్టాళ్లకు డిమాండ్
ఓ వైపు బరులు ఏర్పాటు చేయటమే చట్ట విరుద్థంగా సాగుతున్న చర్య అనుకుంటే బరుల్లో స్టాళ్ల ఏర్పాటుకు కూడా భారీగా డిమాండ్ ఉంది. గండిగుంట కేంద్రంగా నిర్వహించే బరిలో పలావ్ స్టాళ్లు, మద్యం, కూల్ డ్రింక్స్, పార్కింగ్ స్టాళ్లకు బహిరంగ వేలం నిర్వహించి స్టాళ్లు కేటాయించే ఏర్పాట్లు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు రెచ్చిపోయి బహిరంగంగా, గ్రామ ప్రధాన కూడళ్లలో పందేలు నిర్వహిస్తున్నారు. ఆగిపోయిన పేకాట శిబిరాలు కూడా ధైర్యంగా తెరిచి లావాదేవీలు కొనసాగిస్తున్నారని వినికిడి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం సిద్ధమవుతున్న బరులు పైనా, గ్రామాల్లో యధేచ్చగా సాగుతున్న పందేల పైనా కన్నెత్తి చూడటం లేదనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. నామకే వాస్తేగా 8 మంది కత్తులు కట్టే వ్యక్తులను పోలీసులు బైండోవర్ చేశారు. తరలిపోతున్న పందెంపుంజులను తనిఖీల ద్వారా అదుపులోకి తీసుకుని పందేల నిర్వహణను కొంతమేరకైనా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయకపోవటం గమనార్హం.
సిద్ధమవుతున్న ‘పందెం’ కోళ్లు
Published Tue, Jan 12 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM
Advertisement
Advertisement