కోఢీ | Hen racing management | Sakshi
Sakshi News home page

కోఢీ

Published Tue, Jan 13 2015 1:42 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

కోఢీ - Sakshi

కోఢీ

కత్తి కట్టి బరికి సిద్ధమైన కోళ్లు
గోదావరి జిల్లాలకు దీటుగా నిర్వహణకు సన్నద్ధం
జిల్లాలో 15 ప్రాంతాల్లో ఏర్పాట్లు
 చేతులు మారనున్న రూ.700 కోట్లు!

 
జిల్లాలో తొలిసారి పందెంకోడి బహిరంగంగా కాలు దువ్వుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ‘సంప్రదాయం’ ముసుగు తొడిగి అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. కోడి పందేల నిర్వహణకు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తీర్పును ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో కోడి పందేల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్టేనంటూ ప్రజాప్రతినిధుల అనుయాయులు కోళ్లకు కత్తులు కట్టి సిద్ధం చేస్తుంటే.. పందెం రాయుళ్లు నోట్ల సంచులు భుజాన వేసుకొని జిల్లాకు చేరుతున్నారు.  సంక్రాంతికి రెండు రోజుల ముందే జిల్లాలో కోడి పందేల జోరు ప్రారంభమైంది.
 
విజయవాడ సిటీ : కోడి పందేల నిర్వహణకు జిల్లా సిద్ధమైంది. జిల్లాలో కోడిపందేలు తొలిసారి బహిరంగంగా జరగనున్నాయి. కోడి పందేలు అంటే గుర్తుకొచ్చే ‘గోదావరి జిల్లాల’కు దీటుగా నిర్వహించేందుకు    అన్ని ప్రాంతాలూ సిద్ధమయ్యాయి. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సంక్రాంతి మూడు రోజులు నిర్వహించనున్న కోడి పందేలకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పందేల రూపంలో రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్లు చేతులు మారే అవకాశముంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కోడి పందేల నిర్వహణకు ఒప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా కోడి పందేలు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ముందుగానే సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్దుబాటు చేశారు. ఈలోగా వచ్చిన సుప్రీం ఆదేశాలు తమకు అనుకూలంగా అన్వయించుకొని బహిరంగ ఏర్పాట్లు చేస్తున్నారు.

బరులు సిద్ధం...: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేశారు. ఏటా ఒకటి రెండు ప్రాంతాల్లో, నూజివీడు డివిజన్‌లో ఒకటి రెండుచోట్ల చాటుమాటుగా జరిగేవి. ఈసారి ఐదారు చోట్ల నిర్వహించేందుకు మామిడి తోటల్లో పొక్లెయిన్లతో చదును చేసి తగిన ఏర్పాట్లుచేశారు. తూర్పు కృష్ణాలోని గుడివాడ, మచిలీపట్నం డివిజన్లలోని పలు ప్రాంతాల్లో కూడా ఈసారి పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగనున్నాయి. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించి కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగినట్టు చెబుతున్నారు.

సకల సౌకర్యాలు

పందెగాళ్ల కోసం నిర్వహకులు అన్ని సౌకర్యాలూ ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే పందెగాళ్ల కోసం విజయవాడలోని పలు హోటళ్లలో రూమ్‌లు బుక్ చేస్తున్నారు. ఇదే సమయంలో పందేలు నిర్వహించే సమయంలో అవసరమైన వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారి స్థాయిని బట్టి అవసరమైతే ఏసీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మద్యం, భోజనం సహా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కొన్నిచోట్ల రాత్రివేళల్లో ఆటవిడుపు కోసం రికార్డింగ్ డ్యాన్స్‌ల నిర్వహణ ఏర్పాట్లు కూడా ఉన్నట్టు తెలిసింది.
 
పేకాట శిబిరాలు కూడా


కోడి పందేలు నిర్వహించే చోటుకు సమీపంలో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలు బోర్ కొట్టినవారు వెళ్లిపోకుండా పేకాట ఆడేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి.
 
ఉవ్విళ్లూరుతున్న జిల్లావాసులు

పలు చోట్ల జరిగే కోడి పందేలు తిలకించేందుకు జిల్లా, నగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో పోలీసులకు భయపడి వెళ్లేందుకు సాహసించనివారు సైతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వాటిని తిలకించాలని భావిస్తున్నారు.
 
పోలీసుల ప్రేక్షక పాత్ర

ప్రభుత్వ పెద్దల సూచన మేరకు పోలీసులు ప్రేక్షక పాత్రకు సిద్ధమవుతున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ‘కాపలా’ మాత్రమే ఉండాలని ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement