సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా... | sankranthi holidays | Sakshi
Sakshi News home page

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా...

Published Tue, Jan 13 2015 1:26 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

sankranthi holidays

సంక్రాంతి.. ఇది అచ్చ తెలుగు పండుగ.. అన్నదాతల పండుగ.. పంట చేతికొచ్చాక వచ్చే పండుగ. ఈ పండుగ ఆంధ్రాప్రాంత ప్రజలు జరుపుకునే పండుగ అని అభిప్రాయం ఉన్నా వరంగల్ జిల్లాలో ఈ పర్వదినానికి మొదటి నుంచి ప్రత్యేకత ఉంది. నోములు నోచుకోవడం, సకినాలు చేసుకోవడం, పతంగులు ఎగురవేయడం వంటివి మన ప్రాంతానికే ప్రత్యేకం. కాకతీయుల కాలంలో సంక్రాంతి పండుగ సమయంలో ఓరుగల్లు కోటలో కోడిపందేలు కూడా జరిగేవ ని తెలుస్తోంది. ఆంధ్రాప్రాంతంలో పొంగల్లు చేసుకుంటే ఇక్కడ సంక్రాంతి పండుగ నుంచి మల్లన్నబోనాలు చేసుకోవడం ప్రాంభమవుతుంది. ఐనవోలు, కొమురవెల్లి, గట్టు మల్లన్న తదితర మల్లన్న క్షేత్రాల్లో, వీరభద్రుని క్షేత్రాలైన కొత్తకొండ, కురవి  తదితర క్షేత్రాల్లో జాతరలు సంక్రాంతి నుంచే  ప్రారంభం కావడం విశేషం.
  - హన్మకొండ కల్చరల్
 
సంక్రాంతితో జాతరలు మొదలు
 
సంక్రాంతి పండుగ  సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పలు జాతరలు ప్రారంభమవుతారుు. ఈ రోజు మహిళలు నోములు నోముకోవడం అనవాయితీ. సంక్రాంతి పండుగకు నోములు జరుపుకోవడం తెలంగాణలో ప్రత్యేకమైనది. 13 కుమ్మరి కుండలను 13 పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టి కంకణాలు కట్టి అలంకరించి దేవుడి గదిలో దేవుడి ముందు పెడుతారు. ఆలాగే ఏవైనా వస్తువులను 13 చొప్పున కొనుగోలు చేసి పెడుతారు. ఇందులో ఎన్నోరకాల నోములు కన్పిస్తాయి. భూలోక ముద్ద, కుమ్మరి వామి, సల్ల కవ్వాలు, రేపల్లేవాడ, గౌరమ్మ పల్లాలు, ముంగిట్లో ముత్యాలు, పందిట్లో పగడాలు, ముందుం బియ్యం, 13 చీరలు, ఆకాశానికి అట్లు, భూదేవికి చీరలు, పార్వతిపరమేశ్వరులు, గాంధారినోము నోముల్లోని రకాలు.  

 భోగి..
 
 భోగి అంటే మొదటి రోజు అని అర్థం. అంటే ఉత్సవం నిర్వహణకు ప్రారంభం. దీపావళి ముందు రోజు కూడా భోగి పండుగ నిర్వహిస్తారు. ఈ రోజు నువ్వుల నూనెతో శరీరాన్ని మర్థించి స్నానం చేస్తారు. నీళ్లలో రేగుపండ్లు వేసి కాగించి ఆ నీళ్లతో స్నానం చేయడం ప్రత్యేకం. ఇలా చేయడం వల్ల చలితో బిగుసుకుపోయిన కీళ్లు వదులవుతాయి. ప్రత్యేకించి చిన్నపిల్లలకు ఉదయమే స్నానం చేయించి, కొత్త దుస్తులు ధరింపజేసి, పీటలపై కూర్చుండపెడతారు. వారికి బొడబొడికెలు పూస్తారు. ఇలా చేస్తే దిష్టి పోయి,ఆయుర్వుద్ధి కలుగుతుందని నమ్మకం.
 
 కనుమ..
 
 సంక్రాంతి మరుసటి రోజు పండుగ కనుమ. దీనినే కల్పపు పండుగా అని కూడా అంటారు. నోముకున్నవారు తమ చుట్టుపక్కల ముతైదులను పిలిచి నోము వస్తువులను వారికి వాయినంగా ఇస్తారు. ఈ రోజు గోపూజ చేస్తారు. పొలాలు దున్నే ఎద్దులకు కృతజ్ఞతలు తెలిపేవిధంగా చేస్తారు. ఈ రోజు పక్షి పూజ కూడా చేస్తారు. పక్షులు తినడానికి ఆహారం పెడతారు.
 
లోగిళ్లలో రంగవల్లులు..
 

సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి చంద్రుడి నెలవంకను చూసి ముగ్గు వేయడం ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ప్రతిరోజు ముగ్గులు వేస్తారు. ముగ్గులు కూడా కేవలం బియ్యం పిండితోనే వేస్తారు. గీతల ముగ్గులకు ప్రాధాన్యముంటుంది. భోగిరోజు బోగి కుండల ముగ్గులు, పాల కుండల ముగ్గులు, సంక్రాంతి రోజు రథం ఇంటిలోపలికి వచ్చినట్లు వేసే ముగ్గులు, కనుము రోజు రథం బయటికి వెళ్తున్నట్లు వేసే ముగ్గులు పిల్లలను, పెద్దలను అలరిస్తాయి. చివరిరోజున రథం ముగ్గు వేస్తారు. సంక్రాంతి పర్వదినాన వాకిళ్లన్ని
 రంగులమయమవుతారుు.
 
 
సంక్రాంతి అన్ని పండుగల్లాగా తిథివారాలతో సంబంధమున్న పండుగ కాదు. కాలగమనంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి స్యూర్యుడు మారుతుంటాడు. అలా మారుతున్న క్రమాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించిన ఈ రోజును మకర సంక్రాంతి అంటారు.
 
 గొబ్బెమ్మలు..

ఆవుపేడతో గోపురం ఆకారంలో చేసి వాటి మధ్యలో పిండికూర, గరిక కొమ్మలు చెక్కి చుట్టూ పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముగ్గుల మధ్య, గడపకు రెండు వైపులా పెట్టి చుట్టూ రేగు పండ్లు, నవధాన్యాలు, బంతిపూలు పోస్తారు.
 
శ్రవణానందాన్ని ఇచ్చే హరిదాసుల కీర్తనలు
 
మెడలో మాలలు, నుదుట పుండరీకాలు, కాళ్లకు గజ్జెలు ధరించి , తలపై అక్షయ పాత్ర, ఒక చేతిలో చిరుతలు, మరో చేతిలో తంబూర మీటుతూ ధనుర్మాసం ప్రారంభమైనప్పుటి నుంచి హరిలో రంగహరి అంటూ  హరికీర్తనలు పాడుతూ వాడవాడలా కన్పించేవారు. కొద్ది సంవత్సరాలుగా హరిదాసుల జాడే లేకుండా పోయింది. మాలదాసరులు మిత్తిలి కులానికి చెందిన వీరు ప్రస్తుతం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు.
 
బసవన్నల విన్యాసాలు..
 
సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువగా కన్పిస్తుంటారు. అలకరించిన ఎద్దులను వెంట తీసుకుని తిప్పుతూ వాటితో విన్యాసాలు చేయిస్తుంటారు. గంగిరెద్దుల మనిషి పడుకుని ఉండగా అతని చాతి మీద ఎద్దు ముందరి కాళ్లు పెట్టి డప్పుకు అనుగుణంగా నృత్యం చేయడం,  తన యజమాని మెడను పట్టుకుని లేపడం ఒక చిన్న పీట మీద నాలుగు కాళ్లు పెట్టి నిలబడటం, మనిషితో పోటీపడి పరుగెత్తడం, కాళ్లు లేపి దండం పెట్టడం వంటి చిత్రమైన విన్యాసాలు చేస్తుంటుంది. డూడూ బసవన్న ఇలా చేస్తున్న సమయంలో సన్నాయి ఊదుతూ డోలు శబ్ధం చేస్తూ రక్తి కట్టిస్తారు. వీరు డబ్బులు ఇచ్చేవరకు కదలరు. వీరు ప్రధానంగా నివసించేది. తెలంగాణ ప్రాంతంలోనే. అయినా పండుగ సమయంలో ఆంధ్రా ప్రాంతానికి వెళ్తుంటారు.సంక్రాంతి రోజు పతంగులను ఎగురవేయడం పిల్లలకే కాదు పెద్దలకు సంతోషాన్నిస్తుంది.  ఈ సీజన్‌లో గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో పతంగులను  ఎగురవేస్తారు.
 
సంక్రాంతి స్పెషల్ సకినాలు..
 
బియ్యం పిండితో సకినాలు చేయడం తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకత. ముందు రోజు రాత్రి బియ్యం కడిగి నానబె డతారు. ఉదయం నీళ్లు లేకుండా వార్చి ఆ  బియ్యాన్ని రోట్లో వేసి దంచుతారు. ఈ పిండిలో నువ్వులు, వాము, ఉప్పు నీళ్లు కలుపుతారు. కొద్దిగా పిండిముద్దను  చేతిలో తీసుకుని కాటన్ క్లాత్‌పై గుండ్రంగా మూడు, నాలుగు చుట్లు చుడుతారు. అలాగే మొదటి సకినాన్ని ముతైదువతో చుట్టించి మధ్యలో గౌరమ్మను పిండితో చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. తర్వాత ఇరుగుపొరుగు మహిళలు అందరూ కలిసి సకినాలు చుడుతారు. సకినాలు చేసుకునే తీరు మహిళల్లో ఐక్యతకు చిహ్నంగా కన్పిస్తుంది. సకినాలు ఒక తెలంగాణలో తప్ప మరెక్కడా కన్పించని ప్రత్యేక వంటకం. చలిలో వణికిపోతున్నప్పుడు సకినాలు తినడం వేడిని పుట్టించే విధంగా ఉంటుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement