పందేనికి సై | District racing rally | Sakshi
Sakshi News home page

పందేనికి సై

Published Wed, Jan 14 2015 3:48 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

పందేనికి సై - Sakshi

పందేనికి సై

సంక్రాంతి మూడు రోజులూ కోడిపందేలు జోరుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే బరులు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు కూడా స్వయంగా  పాల్గొనేందుకు సమాయత్త మవుతున్నారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన స్వగ్రామం నిమ్మకూరుకు రానున్నట్లు తెలిసింది.
 
 
సంక్రాంతి సంబరాల్లో కోడి పందేల జోరుకు తెరలేచింది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందెపు రాయుళ్లు కాలు దువ్వుతున్నారు. వారం రోజుల నుంచే కోడి పందేలు జరుగుతున్నా.. గుట్టుచప్పుడు కాకుండా కొందరు జాగ్రత్త పడ్డారు. పలువురు ఎమ్మెల్యేలూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పండుగ దగ్గర పడటంతో కొన్నిచోట్ల బరులు సిద్ధం చేశారు. వీక్షకుల కోసం బారికేడ్లు ఏర్పాటుచేశారు.
 - సాక్షి ప్రతినిధి, విజయవాడ
 
 
జిల్లాలో పందేల జోరు

జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో 22 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలోనూ కోడి పందేలు వేసేందుకు రంగం సిద్ధమైంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను మించి ఇక్కడ కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచే కోడి పందేలు ప్రారంభం కానున్నాయి. గుడ్లవల్లేరులోని పశువుల సంత వద్ద భారీస్థాయిలో నిర్వహించేందుకు బరి గీశారు. ట్రాక్టర్ బ్లేడ్ వేసి నీరు చల్లి చదును చేస్తున్నారు. కొన్నిచోట్ల బారికేడ్లు కూడా కడుతున్నారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, ఉయ్యూరు మండలం గండిగుంట, పెడన మండలం పుల్లపాడు, బల్లిపర్రు, బంటుమిల్లి మండలం అర్థముర్రు, పెదతుమిడి, గూడూరు మండలం చిట్టిగూడూరు, రామన్నపేట, కృత్తివెన్ను మండలం పోడు, చిన్నగొల్లపాలెం, ఇంటేరు, చెరుకుమిల్లి, చాట్రాయి మండలం పోలవరం, ఆగిరిపల్లి మండలం శోభనపురం, విజయవాడ రూరల్ మండలం నున్న, కొత్తూరు తాడేపల్లి గ్రామాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
 
 నేడు జిల్లాకు బాలయ్య

సంక్రాంతి సంబరాలు జరుపుకొనేందుకు సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తన స్వగ్రామానికి రానున్నారు.  బుధవారం నిమ్మకూరులో, గురువారం కొమరవోలులో ఆయన ఉండే అవకాశం ఉంది. పామర్రు నియోజకవర్గంలోని అయ్యంకి గ్రామంలో పొట్లూరి కృష్ణబాబు బాలకృష్ణకు బంధువు. ఆయన ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో బాలకృష్ణ పాల్గొంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కోడి పందేలను బాలకృష్ణ ప్రారంభించే అవకాశం కూడా ఉంది.
 
బరిలో రాజసం

ఇప్పుడైతే కోడి పందేల్లో కత్తులు కడుతున్నారు గానీ పూర్వం ‘డింకీ గోల్డ్’ అనే కోళ్లకు కత్తులు కట్టకుండానే బరిలో దింపేవారు. ఎత్తుగా ఉండే ఈ కోళ్ల కాళ్ల వెనుక భాగంలో కాటాలు ఉంటారుు. ఇవి కత్తుల్లా సూదులను పోలి ఉంటారుు. వీటిని బ్లేడుతో చెక్కి కోళ్లను రంగంలోకి దింపేవారు. ఈ కాటాల వల్ల ఒక్కోసారి ఎదుటి కోడి తల కూడా తెగి పడేదని చెబుతారు. ప్రస్తుతం మాత్రం పందెం కోళ్లకు కత్తులు కడుతున్నారు. ఈ కత్తులు తయారు చేసేవారు ప్రతి మండలంలోనూ ఇద్దరు నుంచి ముగ్గురు వరకు ఉన్నారు. గుడివాడలోని గుడ్లవల్లేరు మండలంలో ఇలాంటి కత్తులు ఎక్కువగా తయూరుచేస్తారు. విమానం తయూరీలో ఉపయోగించే ఇనుముతో తయారయ్యే ఈ కత్తులు చాలా పదునుగా ఉంటారుు. కొన్ని పందేల్లో ఆ కత్తులకు విషం పూస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే, కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పందేలకు జాతకాలు కూడా చెబుతుంటారు. తోకలు, ఈకల రంగులను బట్టి పోటీల్లో గెలుస్తాయూ, లేదా అనే విషయం చెప్పే నిష్ణాతులు మన జిల్లాలోనూ ఉన్నారు.
 
మేముసైతం

కోడిపందేలకు ఎమ్మెల్యేలు కూడా పచ్చజెండా ఊపుతున్నారు. అభిమానులతో కలిసి సరదాగా గడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ‘బుధవారం పండుగ సందర్భంగా కోడి పందేలు వేద్దాం.. రండి..’ అంటూ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించడం విశేషం.
 
పచ్చకాకి : ఇది పందెపు కోళ్ల జాతిలో రారాజు.  దీని ధర గత ఏడాది రూ.10వేలు ఉంటే, ప్రస్తుతం రూ.13వేలు పలుకుతోంది.
కాకి : దీని ధర గత ఏడాది రూ.5వేలు పలికింది. ఈసారి రూ.8వేలు.
నల్ల నెమలి : దీని ధర గతంలో రూ.6వేలు ఉంటే ఇప్పుడు రూ.10వేలకు చేరింది.
కోడి డేగ : దీని ధర గత ఏడాది రూ.7వేలు పలికింది. ప్రస్తుతం రూ.9వేలకు పెరిగింది.
కాకి డేగ : ఇది గత ఏడాది రూ.7వేలు ఉండేది. ప్రస్తుతం రూ.10వేలు.
సీతువా : దీని ధర గత ఏడాది రూ.5వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.8వేల పైమాటే.
పర్లా : ఇది గతంలో రూ.10వేలు. ఇప్పుడు రూ.13వేలు.
ఎర్ర నెమలి : దీని ధర గత ఏడాది రూ.7వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.10వేలు.
కోడి కాకి : గతంలో రూ.8వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.12వేలకు చేరింది.
కగర కాకి : దీని ధర గత ఏడాది రూ.5వేలు పలికింది. ప్రస్తుతం రూ.8వేలకు చేరింది.
ఎర్ర మైలా : రూ.4వేలు పలికే ఈ రకం కోడిపుంజు ఈ ఏడాది రూ.6వేల పైమాటే.
తెల్ల కక్కిరాయి : దీని ధర గత ఏడాది రూ.5వేలు ఉంది. ప్రస్తుతం రూ.7వేలు.
ఎర్ర పింగళా : రూ.5వేలు పలికిన ఈ జాతి కోడి ప్రస్తుతం రూ.7వేలకు చేరింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement