సంక్రాంతి వస్తే కోడిపందాలు ఆడటమో, చూడటమో చాలా మందికి మోజు. మరి కోడిపందాలకు, గుర్రప్పందాలకు మీకు తేడా తెలుసా? ఎందుకు తెలియదు... అవి పోట్లాడి గెలుస్తాయి. ఇవి పరుగెత్తి గెలుస్తాయి. అయితే ఈ ఫొటోలో మీరు చూస్తున్నవి గుర్రప్పందాలే. కానీ మీరనుకునేవి కాదు. 500 సంవత్సరాలుగా చైనాలో ఉన్న ఓ సంప్రదాయం. అచ్చం కోడిపందాల్లాగే మగ గుర్రాలు ఒకదాంతో ఒకటి మల్లయుద్ధానికి దిగుతాయి. గెలుపోటములు కూడా కోడిపందాల్లాగే ఉంటాయి. పన్నెండు జంతువుల పేర్ల మీద సంవత్సరాలు లెక్కించే చైనీయులకు ఈసారి ‘గుర్రపు సంవత్సరం’. చైనాలోని ఓ మారుమూల గ్రామంలోని దృశ్యమిది.
కాఫీ అరబికా !
చక్కటి ఫొటో ఒక బ్రెజిలియన్ కార్మికుడు కాఫీ గింజలను చెరుగుతుండగా తీసినది. ఇవి కాఫీ గింజలే గాని మనం వాడుతున్నవి కాదట. వీటిపేరు కాఫీ అరబికా. ఇథియోపియా లో వెయ్యేళ్ల క్రితం నుంచి సాగుచేస్తున్న ఈ కాఫీ గింజలు మిగతా వాటికంటే భిన్నమైన రుచిని ఇస్తాయి. ఎందుకంటే వీటిలో ఇతర కాఫీ గింజల్లో ఉండే కెఫైన్‌లో కేవలం సగమే ఉంటుందట. దానివల్ల వీటితో చేసే కాఫీ మరింత రుచిగా ఉంటుంది. ఇవి ఇపుడు పలుదేశాల్లో పండిస్తున్నారు.
పొరబడ్డారా !
ఫొటోలో టవర్ నిజం కాదేమో అనుకున్నారా. నిజమే. కానీ ఇది ‘ఈఫిల్ టవర్’ అని అనుకుంటే మీరు పొరబడినట్టే. చైనాలోని ప్రాచీన సుజోవు నగరంలో ఏర్పాటుచేసిన టవర్ ఇది. దీనికి ఫ్రెంచి డిజైనర్ పాట్రిక్ విద్యుత్ వెలుగులతో అందం తెప్పించారు. దీనికోసం 2200 కోట్లు ఖర్చుపెట్టడం విశేషం. దీనిని డాంగ్ వు టవర్ అని పిలుస్తారు చైనీయులు.