Coffee seeds
-
కప్పు కాఫీ@ 5,000
ఇది పునుగు పిల్లి. దీని చర్మం నుంచి వెలువడే తైలాన్ని శ్రీవారి అభిషేకానికి ఉపయోగిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ తయారీలో కూడా దీని పాత్ర ఉందన్న సంగతి మనకు తెలుసా? కోపీ లువాక్ అని పిలిచే ఆ కాఫీ గింజలు ధర కిలో రూ.35 వేలకు పైమాటే. ఖరీదైన రెస్టారెంట్లలో అయితే.. కప్పు కాఫీ ధర రూ.5 వేలు! ఇంతకీ ఈ కాఫీ ఎలా త యారుచేస్తారంటే.. ముందుగా వీటితో కాఫీ పళ్లను తినిపిస్తారు. పునుగు పిల్లులు వాటిని తిని.. జీర్ణం చేసుకోగా.. మిగిలిపోయిన గింజలను విసర్జిస్తాయి. వాటిని ఎండబెట్టి.. అమ్ముతారు. పునుగు పిల్లి విసర్జించిన గింజలతో చేసిన కాఫీ రుచి మృదుమధురంగా ఉంటుందట. ఎందుకిలా అంటే.. పునుగు పిల్లులకు ఎన్ని కాఫీ పళ్లు పెట్టినా.. నాణ్యమైన వాటినే తింటాయట. పైగా.. వాటి జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్‌ల వల్ల గింజలకు ఆ ప్రత్యేకమైన రుచి వస్తుందట. ముఖ్యంగా ఇండోనేసియాలో ఈ తరహా కాఫీ తయారీ ఎక్కువ. ఈ కాఫీకి బాగా డిమాండ్ ఉండటంతో ఇందుకోసం అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే పునుగు పిల్లులను పట్టి.. చిన్నచిన్న పంజరాల్లో బంధించి.. హింసిస్తున్నారంటూ వన్యప్రాణి హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
గోధుమ పిండి.. మైదాపిండి.. కాఫీ కాయ పిండి!
కాఫీ గింజల పొడి తెలుసు. కానీ, ఈ కాఫీ కాయ పిండి ఏంటీ... అని అనుకుంటున్నారా? కమ్మటి కాఫీ గింజలను ఇచ్చేవే కాఫీ కాయలు. ఇంతకాలం వృథాగా పారబోస్తున్న ఈ కాయలనే... ఆరోగ్యకరమైన పిండిగా మార్చే పద్ధతిని సియాటెల్‌కు చెందిన సీఎఫ్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ఆవిష్కరించింది. ఈ పిండి అత్యంత పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని, అదే సమయంలో కాఫీ తోటల యజమానులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుందని సీఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు డాన్, కెన్పోప్ అంటున్నారు. ‘‘ముడి గోధుమ పిండి కంటేఅయిదు రెట్లు ఎక్కువ ఫైబర్, కాఫీ కాయ పిండిలో ఉంటుంది. అదే సమయంలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. పాలకూర కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇనుము, అరటిపండ్ల కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం, కేల్ (ఒక రకమైన ఆకుకూర) కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రొటీన్లు కాఫీ కాయ పిండిలో ఉంటాయి’’ అని వివరించారు డాన్. గోధుమ పిండి మాదిరిగా దీంతో బ్రెడ్ చేసుకోవచ్చు. పాస్తాలు, జీడిపప్పు, బాదం పప్పులతో కలిపి తీపి తినుబండారాలూ తయారు చేసుకోవచ్చు. సీఎఫ్ గ్లోబల్ ఇప్పటికే హవాయి, నికరాగ్వా, గ్వాటెమాలాతోపాటు, మెక్సికో, వియత్నాంలో కాఫీ కాయ పిండిని తయారు చేసి అమ్ముతోంది. త్వరలో భారత్‌లోనూ ప్రవేశిస్తామని కంపెనీ చెబుతోంది. అయితే, ఇంతకీ దీని రుచి కూడా కాఫీ మాదిరిగానే ఉంటుందని అనుకుంటున్నారా? కాదు. కొంచెం పుల్లగా ఉంటుందట. -
వర్ణం: గుర్రప్పందాలే కానీ కాదు !
సంక్రాంతి వస్తే కోడిపందాలు ఆడటమో, చూడటమో చాలా మందికి మోజు. మరి కోడిపందాలకు, గుర్రప్పందాలకు మీకు తేడా తెలుసా? ఎందుకు తెలియదు... అవి పోట్లాడి గెలుస్తాయి. ఇవి పరుగెత్తి గెలుస్తాయి. అయితే ఈ ఫొటోలో మీరు చూస్తున్నవి గుర్రప్పందాలే. కానీ మీరనుకునేవి కాదు. 500 సంవత్సరాలుగా చైనాలో ఉన్న ఓ సంప్రదాయం. అచ్చం కోడిపందాల్లాగే మగ గుర్రాలు ఒకదాంతో ఒకటి మల్లయుద్ధానికి దిగుతాయి. గెలుపోటములు కూడా కోడిపందాల్లాగే ఉంటాయి. పన్నెండు జంతువుల పేర్ల మీద సంవత్సరాలు లెక్కించే చైనీయులకు ఈసారి ‘గుర్రపు సంవత్సరం’. చైనాలోని ఓ మారుమూల గ్రామంలోని దృశ్యమిది. కాఫీ అరబికా ! చక్కటి ఫొటో ఒక బ్రెజిలియన్ కార్మికుడు కాఫీ గింజలను చెరుగుతుండగా తీసినది. ఇవి కాఫీ గింజలే గాని మనం వాడుతున్నవి కాదట. వీటిపేరు కాఫీ అరబికా. ఇథియోపియా లో వెయ్యేళ్ల క్రితం నుంచి సాగుచేస్తున్న ఈ కాఫీ గింజలు మిగతా వాటికంటే భిన్నమైన రుచిని ఇస్తాయి. ఎందుకంటే వీటిలో ఇతర కాఫీ గింజల్లో ఉండే కెఫైన్లో కేవలం సగమే ఉంటుందట. దానివల్ల వీటితో చేసే కాఫీ మరింత రుచిగా ఉంటుంది. ఇవి ఇపుడు పలుదేశాల్లో పండిస్తున్నారు. పొరబడ్డారా ! ఫొటోలో టవర్ నిజం కాదేమో అనుకున్నారా. నిజమే. కానీ ఇది ‘ఈఫిల్ టవర్’ అని అనుకుంటే మీరు పొరబడినట్టే. చైనాలోని ప్రాచీన సుజోవు నగరంలో ఏర్పాటుచేసిన టవర్ ఇది. దీనికి ఫ్రెంచి డిజైనర్ పాట్రిక్ విద్యుత్ వెలుగులతో అందం తెప్పించారు. దీనికోసం 2200 కోట్లు ఖర్చుపెట్టడం విశేషం. దీనిని డాంగ్ వు టవర్ అని పిలుస్తారు చైనీయులు.