వాలీబాల్ పోటీలపైనా భారీ ఎత్తున బెట్టింగ్
కస్టమ్స్-కర్ణాటక మ్యాచ్‌లో చేతులు మారిన రూ.5 లక్షలు
ఏకపక్షపు పోటీల్లో ‘కోసు’ ప్రాతిపదికన పందేలు
అమలాపురం : ‘గుండాట.. పేకాట.. కోడి పందేలు’.. జూదగాళ్లు తమ వ్యసనాన్ని పోషించుకోవడానికి ఒకప్పుడు ఇవే ఆధారాలు. కొందరు ఎక్కడో పరిగెత్తే రేసుగుర్రాలపై ఇక్కడుండే పందేలు కాసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. జూదగాళ్లకు నిత్యం రకరకాల అవకాశాలున్నాయి.‘ కుక్కపిల్లా.. అగ్గిపుల్లా.. సబ్బుబిళ్లా.. కాదేదీ కవితకనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అంటే..‘ప్రతి బంతీ.. ప్రతి ఓవర్..ప్రతి మ్యాచ్..అవును అన్నీ బెట్టింగ్‌కు అనువే’ అంటూ క్రికెట్ చుట్టూ భారీ జూదం జరిగిపోతోంది. ప్రపంచకప్ పోటీల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఆ క్రమంలోనే జూదోత్సాహం ఇతర క్రీడలకూ విస్తరిస్తోంది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నాలుగురోజులు జరిగిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు సైతం బెట్టింగ్ జాఢ్యం పాకింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జూదగాళ్లు ప్రతి మ్యాచ్‌లో పందేలు కాశారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ కస్టమ్స్, కర్ణాటక జట్ల మధ్య జరిగిన పోరులో రూ.ఐదు లక్షలకు పైగా పందేలు జరిగాయంటే ఇక్కడ జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. హోరాహోరీగా తలపడే జట్ల మీదే కాకుండా పోరు ఏకపక్షంగా సాగుతుందనుకునే మ్యాచ్‌లలోనూ కోసు పందేలు (చేతులు మారే మొత్తంలో ఎక్కువ తక్కువలకు ఒప్పందం జరిగే పందేలు) కాస్తున్నారు. పురుషుల విభాగంలో పాండిచ్చేరి, హైదరాబాద్ కస్టమ్స్ జట్ల మధ్య జరిగిన పోరులో రూ.300కు రూ.1000 చొప్పున ఇచ్చేలా కోసు పందేలు జరిగాయి.
హోం మంత్రి ఉన్నచోటే.. యథేచ్ఛగా బెట్టింగ్
మహిళా విభాగంలో పోటీలకు సైతం చిన్నచిన్న మొత్తాల్లో పందేలు జరుగుతుండడం విశేషం. తన తండ్రి పేరున ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రతి రోజూ పోటీలను తిలకించారు. ఆయనకు బందోబస్తుగా అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్యతో పాటు రూరల్ సీఐ దేవకుమార్, మరో నలుగురైదుగురు ఎస్సైలు, పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది వాలీబాల్ పోటీల వద్ద ఉన్నా జూదగాళ్ల బెట్టింగ్ బరి యథేచ్ఛగా జరిగిపోవడం గమనార్హం.
వేదిక ఏదైనా జూదక్రీడే..
Published Sat, Feb 21 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement