
గోదారి ‘బరి’లో పాతబస్తీ కోడి!
నగరం నుంచి గోదావరి జిల్లాలకు పందెంరాయుళ్లు
పాతబస్తీ పుంజుల కోసం నగరానికి క్యూ... రూ.లక్షల్లో ధరలు
సంక్రాంతి వరకు ఇక సందడే సందడి...
సిటీబ్యూరో/చాంద్రాయణగుట్ట: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో వ్యవస్థీకృతంగా కోడి పందేలు, జూదం నిర్వహించడం ఆనవాయితీ కావడంతో పందెంరాయుళ్లు రేసుగుర్రాల అవతారమెత్తారు. వీరిలో బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు, బెట్టింగ్ రాయుళ్లతోపాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులు, అనధికారులుండడం విశేషం. కాగా గోదావరి జిల్లాల్లో ప్రధాన రహదారులకు దూరంగా, పంటపొలాల మధ్య దాదాపు రెండుమూడు ఎకరాల విస్తీర్ణంలో.. బంకిణీగా పిలిచే రహస్య ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తుండడంతో గుట్టు చప్పుడు కాకుండా పందెం కాసేందుకు సిటీ పందెం వీరులు అక్కడికి చేరుకుంటున్నారు. పలువురు ఇప్పటికే అక్కడికి చేరుకోగా మరికొందరు వచ్చే మూడు రోజుల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు నగరవాసులు తమ కుటుంబాలతో సహా పయనమయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
కోడి పందేలకు కేరాఫ్...
గోదావరి జిల్లాల్లో పందేలకు ప్రసిద్ధిగాంచిన ఆకివీడు, ఐ భీమవరం, చెరుకుమిల్లి, గుడివాడ-భీమవరం,కాళ్ల, జువ్వలపాలెం, వెంప, భీమవరం, కొప్పాడ, పత్తేపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం వెళ్లేందుకు నగరానికి చెందిన పందెంరాయుళ్లు సిద్ధమయ్యారు. ఇక ఆయా ప్రాంతాలకు వచ్చే వారిని సురక్షితంగా బంకిణీలకు చేర్చేందుకు కొందరు యువకులు ‘పోర్టర్ల’ అవతారంలో సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఒక్కో పుంజుకు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తూ దొడ్డిదారిన వీరిని బంకిణీ వద్దకు చేర్చడమే ఈ పోర్టర్ల పని కావడం గమనార్హం.
పాతబస్తీ పుంజులు
గోదావరి జిల్లాలలో జరిగే కోడి పందేలలో పాతబస్తీ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తవంగా కోడి పందేలకు....పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్ల పంట పండించే కోడి పుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా రంగంలోకి దిగేవారు కదనరంగంలోకి దూకి విజేతలుగా నిలిచే పాతబస్తీ కోడిపుంజులకు లక్షలాది రూపాయల ధర పలుకుతుండడం విశేషం.
పలువురు పందెంరాయుళ్లు ప్రస్తుతం బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతున్నారు. వీరి వద్ద కోడిపుంజు తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకంతో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఒక్కో పందెం కోడిపుంజు ధర లక్ష రూపాయల వరకు పలుకుతోంది. అలాగని బార్కాస్ పహిల్వాన్లు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు, ఏడాదికి పరిమిత సంఖ్యలో మాత్రమే వీరు కోడిపుంజులను విక్రయిస్తుంటారు. ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్డును ఏర్పాటు చేసి..అందులో ప్రత్యేక ఎన్‌క్లోజర్ల మధ్య వాటిని పెంచి పోషిస్తున్నారు. రెండేళ్ల వయసున్న కోడి పుంజులనే పందేనికి వినియోగిస్తారు.
ప్రత్యేక మసాజ్, పసందైన ఆహారం...
వీరు పెంచే పందెం కోడి పుంజులకు విటమిన్‌లతో కూడిన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, అక్రోట్, కీమా, ఉడికించిన గుడ్ల(తెలుపు భాగం)ను ఆహారంగా ఇస్తారు. ఈ కోడిపుంజులకు ప్రత్యేకంగా ఆహారాన్ని అందించడంతో పాటు వాటికి కదనరంగంలో దూకేలా అన్ని రకాల తర్ఫీదునిస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు నైపుణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటల మసాజ్‌లు చేయిస్తారు. అదేవిధంగా పరుగెత్తడం కూడా నేర్పిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంతమంది పహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. కోళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.