![Gunadala Mary mata Festival begins in vijayawada](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/gunadala%20marymata.jpg.webp?itok=OaTR1DxO)
దేశంలోని క్రైౖస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అతిపెద్ద ఆలయంగా విజయవాడలోని గుణదల మేరీమాత క్షేత్రం ప్రఖ్యాతి చెందింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మరియమాతను దర్శించుకుంటారు. తమ మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రతియేటా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచీ లక్షలాది యాత్రికులు తరలి వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
నూరేళ్ల క్రితమే ప్రతిష్ట..
కతోలిక క్రైస్తవులు భారతదేశంలో సేవనారంభించిన తొలినాళ్లలో అనగా 1925లో గుణదల ప్రాంతంలో విద్యాబోధన ప్రారంభించారు. గుణదల కొండ సమీపంలో సెయింట్ జోసెఫ్ ఇన్‌స్టిట్యూట్‌కి అప్పటి రెక్టర్ ఫాదర్ గా పనిచేస్తున్న అర్లాటి స్వామి కొండ పైభాగంలో సహజసిద్దం గా ఉన్న కొండ గుహను గుర్తించారు. భక్తులలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే సంకల్పంతో ఆ గుహలో మరియమాత స్వరూపాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచీ కతోలిక క్రైస్తవులు, ఇన్‌స్టిట్యూట్ విద్యార్ధులు కొండపై ఉన్న మరియమాత స్వరూపాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో యేడాదికి ఒకసారి ఫిబ్రవరి 11వ తేదీన మరియమాత ఉత్సవాలను జరుపుకోవడం సంప్రదాయమైంది.
అర్లాటి స్వామి మేరీమాత స్వరూపాన్ని ప్రతిష్ట చేసిన నాటి నుంచీ మేరీమాత పుణ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. కొండ శిఖరాగ్రాన యేసుక్రీస్తు శిలువను ప్రతిష్టించారు.1937లో కొండగుహలో మేరీమాత విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేశారు. అటుపై ప్రత్యేక్ర ప్రార్థనలు, సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని నిర్మించారు. కొండగుహను తొలిచి మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. 1948లో కొండ శిఖరాగ్రానికి చేరుకునే దారిలో దేవ రహస్యములు తెలియపరిచే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుణదల పుణ్యక్షేత్రంలో పనిచేసే గురువులు భక్తులకోసం మౌలిక సదు΄ాయాలు, మెట్లమార్గాలు ఏర్పాటు చేశారు. రానురాను ప్రాచుర్యం పెరిగి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మేరీమాత ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టారు.
ఆచారాలు
కులమతాలకు అతీతంగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. తొలుత మరియమ్మ తల్లిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. మైనపువత్తులు వెలిగించటం, కొబ్బరికాయ లు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, దివ్యపూజలు చేయించడం, యాత్రికులు నిద్ర చేయటం వంటి ఆచారాలను అనుసరిస్తుంటారు.
ఉత్సవాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సమష్టి దివ్యబలిపూజ ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. అంతేకాకుండా నిరంతరం క్రై స్తవ భక్తి గీతాలాపనలు, ప్రత్యేక ప్రసంగాలు, క్రై స్తవ నాటికలు ప్రదర్శిస్తున్నారు.
మహోత్సవాలు ప్రారంభం
ప్రస్తుతం 101వ తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 10 లక్షలమందికి పైగా విచ్చేస్తారని అంచనా. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రార్థనల్లో కర్నూలు పీఠాధిపతి గోరంట్ల జ్వాన్నేస్, ఖమ్మం పీఠాధిపతి సగతి ప్రసాద్ తదితరులు పాల్గొంటున్నారు.
ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభం
ఆదివారం ఉదయం విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, గుణదల పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ యేలేటి విజయం జయరాజులు ప్రత్యేక ప్రార్థనలు, సమష్టి దివ్యబలి పూజ సమర్పించి తిరునాళ్ల మహోత్సవాలను ప్రారంభించారు.
అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ గురువులుసందేశాలిచ్చారు
– చక్రాల శరత్ రాజు
సాక్షి, గుణదల
(విజయవాడ తూర్పు)
Comments
Please login to add a commentAdd a comment