హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ ప్రారంభం
ఆకట్టుకున్న వర్క్‌షాపులు, కళాప్రదర్శనలు
టీ–హబ్, సత్వ నాలెడ్జ్ సిటీ వేదికగా ఏర్పాట్లు
హాజరైన ప్రముఖులు, రచయితలు, సినీ స్టార్స్
ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా సాహితీ పరిమళాలను అద్దుకుంది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన సాహితీ ప్రముఖులు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో వాలిపోయారు. నగరంలోని టీ–హబ్, సత్వ నాలెడ్జ్ సిటీ వేదికలుగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.
శని, ఆదివారాల్లోనూ కొనసాగనున్న ఈ సాహితీ పండుగలో సాహిత్యం, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరించిపోతున్న భారతీయ భాషలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాప్స్, కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రముఖులతో ప్రత్యక్ష చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ప్రారంభ ప్లీనరీలో ఏ లైఫ్ ఆఫ్ సినిమా పై సినీ ప్రముఖులు షభానా అజ్మీ, సాహితీవేత్త అమితా దేశాయ్‌తో చర్చించారు.
అనంతరకార్యక్రమంలో అంతరించిపోతున్న సింధీ భాషపై ప్రముఖులు నందితా భవానీ, రితా కొఠారీ, సోనీ వాధ్వా చర్చించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కావ్యధార, స్టేజ్ టాక్స్, ఆర్ట్ వర్క్ షాప్స్, నన్హా నుక్కడ్ కార్యక్రమాలు, పరిశోధనా రంగ ప్రముఖులతో సైన్స్ అండ్ ది సిటీ సెషన్స్, రచయితలకు సంబంధించిన మీట్‌మై చర్చ నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న కళా ప్రదర్శనలు, నగరంలోని కొండరాళ్ల సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
కార్టూన్ స్పెషల్..
ఈ ఫెస్ట్‌లో భాగంగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఆధ్వర్యంలోని అబ్ట్యూస్ యాంగిల్ కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. ఇది నగర ఖ్యాతిని మరింత పెంచుతుందని, ఈ తరం ఆలోచనా విధానానికి స్ఫూర్తి నింపే వ్యక్తులు హాజరుకావడం సంతోషమన్నారు. తన కార్టూన్ పుస్తకంలో బ్యూరోకాట్ల ప్రయాణాన్ని, ఆలోచనా విధానాన్ని కార్టూన్ల రూపంలో తెలిపానన్నారు. ఫొటోలతో ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఏరాప్టు చేశారు. పుస్తకావిష్కరణలో ప్రముఖ రచయిత డా.దినేష్ శర్మ, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి డా.ఎస్‌ఎన్ మోహంతి పాల్గొన్నారు.
యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో 2లోనే క్లైమాక్స్..
అనంతరం ప్రముఖ సినీతార హుమా ఖురేషి ముఖ్య అతిథిగా సాహితీవేత్త కిన్నెర మూర్తితో చర్చించారు. ఈ సందర్భంగా హుమా ఖురేషి రాసిన యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో పుస్తకంలోని కొన్ని అంశాలను చదివి వివరించారు. ఈ పుస్తకం క్లైమాక్స్ త్వరలో రానున్న రెండో పుస్తకంలో ఉంటుందన్నారు. సినిమా ఎంపికలో కథే ప్రామాణికంగా చేస్తానని, యాక్షన్ కామెడీ వంటి చిత్రం చేయడం ఇష్టమని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment