కైకలూరు మండలంలోని గోనెపాడులో సంక్రాంతి సండిని పరిశీలించేందుకు ‘న్యూస్‌లైన్’ ఆదివారం సందర్శిం చిది. గ్రామం సంక్రాంతి కళ సంతరించుకుంది. బంధువులతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ఏ ఇంట చూసినా ఘుమఘుమలాడే పిండివంటలు తయారవుతూ కనిపించాయి. సరదాల కోడిపందాలు జరుగుతున్నాయి. పతంగులతో చిన్నారుల పరుగులు, పట్టుపరికిణీలతో పల్లెపడుచుల హొయలు, రంగు రంగుల రంగవల్లులు కనువిందుచేశాయి.
సూర్యోదయానికి ముందుగానే యువతులు, మహిళలు వాకిళ్లను ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తూ కనిపించారు. ముగ్గులకు రంగులు అద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. హరిదాసు కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటినీ సందర్శించాడు. గంగిరెద్దులోళ్లు డోలూ సన్నాయి వాయిద్యాలతో డూడూబసవన్నలను ఆడించారు. గ్రామంలోని చెరువులో పది మంది యువకులు కోడిపుంజులకు స్నానాలు చేయించారు. బద్దకంపోయి చలాకీగా పందేల్లో పాల్గొనాలంటే ఈ స్నానాలు తప్పవని వారు చెప్పారు.
‘సూరమ్మ.. పిన్నీ మీ అల్లుడు పండక్కి వస్తున్నాడా...’ అంటూ ఒకరు, కోడలా... మనవడు ఉదయమే బస్సు దిగాడంటగా ఏడీ ఇంక బయటకు రాలేదు..’ అంటూ మరొకరు.... ‘ఒరేయ్ అబ్బాయ్ కోడి పందేనికి వెళ్దామా’ అంటూ మరొకరు పలుకరించుకుంటూ కనిపిం చారు. ఉదయం ఆరు గంటల నుంచే అరుగులపైకి చేరిన గ్రామస్తులు లోకాభిరామాయణాన్ని చర్చించుకున్నారు. యువతులు పట్టు పరికిణీల్లో తమ వీధుల్లో ఇళ్ల ముందువేసిన ముగ్గులను పరిశీలించి వాటికి మార్కులు వేశారు.
అనంతరం ఒప్పులగుప్పు, తొక్కుడుబిళ్ల వంటి ఆటలాడారు. చిన్న పిల్లలు రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ వీధుల్లో అటూ ఇటూ పరుగులు తీశారు. ఇంటి పనులు పూర్తిచేసుకుని ఏడు గంటల నుంచి మహిళలు బృందాలుగా పిండివంటల తయారీకి సిద్ధమయ్యారు. రోటిపై కుందుచేర్చి రోకళ్లతో కొందరు బియ్యాన్ని పిండి కొట్టగా, మరి కొందరు ఆ పిండిని జల్లించారు. పిండి కొట్టడం పూర్తయ్యాక అరిసెలు, మిఠాయి, చెక్కలు, తదితర వంటలు వండే పనిలో నిమగ్నమయ్యారు.
బంధువుల రాకతో సంతోషం
ఏడాదిలో పెద్ద పండగ ఇది. బంధువులందరూ ఒక్కచోటకు చేరితే ఆ సంతోషమే వేరు. ఈ కలయికలే ప్రేమలు పెంచుతాయి. మా మనవడు మద్రాసులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వాడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. కాలం మారే కొద్ది సంప్రదాయలు కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడటం మన బాధ్యత.
- బొల్లా లక్ష్మీనృసింహమూర్తి, గోనెపాడు
చుట్టాలతో ఊరంతా కళకళ
సంక్రాంతి పండగ వచ్చిదంటే ఊరంతా చుట్టాలతో కళకళలాడుతుంది. కొత్త దంపతులు, పొరుగూరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు కచ్చితంగా ఊరొస్తారు. ఈ సంతోషం ఎప్పుడూ ఇలానే ఉండాలి. మా అబ్బాయి విశాఖపట్నంలో ఉంటున్నాడు. పండక్కి ఊరొస్తున్నాడు. వాడికి అరెసెలంటే ఎంతో ఇష్టం. వాడికి ఇష్టమైన పిండి వంటలు చేసిపెడతా.
- నంగెడ్డ సూరమ్మ, గోనెపాడు
సరదాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంటినిండా చుట్టాలు, చిన్నపిల్లలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చిన్నారులకు భోగిపళ్లు పోసి పండుగను సరదాగా జరుపుకుంటాం. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తాం.
- వత్తుమిల్లి అశ్వని, జుఝవరం, పామర్రు మండలం
కొట్టిన పిండితోనే అరిసెలు
మేము స్వయంగా రోకళ్లతోకొట్టిన పిండివంటలు చేస్తాం. మిల్లు పట్టించుకోం. మా చుట్టు పక్కల వాళ్లం అందరం కలసి రోటిలో పిండి కొట్టుకుని అరిసెలు, ఇతర వంటకాలు చేసుకుంటాం. ఏళ్ల తరబడి ఇలాగే వండుకుంటున్నాం. సంక్రాంతి, దీపావళి పండుగలకు ఒకరి పనులకు మరొకరం సాయపడుతూ సందడిగా పనులు చేసేస్తాం.
- మద్ది సామ్రాజ్యం, మర్రిపాలెం, నాగాయలంక మండలం
సంక్రాంతంటే ఆనందం
సంక్రాంతి అంటే మాకు ఎక్కడలేని ఆనందం. గృహాలకు శుభం చేకూరుస్తుందని ధనుర్మాసంలో పోటీపడి వాకిళ్లలో పేడకళ్లాపు చల్లి ముగ్గులు వేస్తాం. కాలం మారినా సంక్రాంతిని వదిలేది లేదు. పిండివంటలు వండుతాం, భోగిపళ్లు పోస్తాం. చెరకు గడలు, తేగలను సంక్రాంతి పండుగలో భాగస్వామ్యం చేస్తాం. ఈ కాలంలో అవి మహారుచిగా ఉంటాయి.
- కొట్ర రమాదేవి, రేమాలవారిపాలెం,నాగాయలంక మండలం
ఊరంతా సంక్రాంతి
Published Mon, Jan 13 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement