
బెట్టింగ్ రాయుళ్ల బెంబేలు
వనపర్తి: దీపావళి పండుగ సంబరాల పేరుతో వీపనగండ్ల సమీపంలో వారం రోజులుగా జరుగుతున్న కోడి పందేల నిర్వహణను ‘సాక్షి' బయటపెట్టడంతో జూదం నిర్వాహకులు, బెట్టింగ్ రాయుళ్లు ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. శనివారం ‘పందెం కాస్కో!’ శీర్షికన వచ్చిన కథనానికి వెంటనే పందేల నిర్వహణకు అనువుగా వీపనగండ్ల- తూంకుంట గ్రామాల మధ్య ఉన్న గుంతవంపులోని పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించి ఆనవాళ్లు లేకుండా చేశారు.
ఈ విషయమై వనపర్తి డీఎస్పీ జోగుల చెన్నయ్య స్పందిస్తూ కోడి పందేల నిర్వహణపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. కోడిపందేల నిర్వహణ చట్టవిరుద్ధమని, నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పందేల విషయం తమకు ఏమాత్రం సమాచారం లేదని, ఇం దుకు తమశాఖ సిబ్బంది ఎవరైనా బాధ్యులని తేలితే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
సంచలనం సృష్టించిన ‘సాక్షి’ కథనం
వీపనగండ్లకు చెందిన కొందరు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించి జూదానికి పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం వనపర్తి పోలీస్ సబ్‌డివిజన్‌లో సంచలనం సృష్టించింది. కోడిపందేల్లో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పందేల్లో పాల్గొన్నారని సమాచారం. పందేల్లో పరోక్షంగా పాల్గొని రూ.వేలకు వేలు పొగొట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. మరో పక్క పందెంలో ఓడిన కోడిమాంసంతో కొందరు పోలీసు అధికారులు ఇన్నాళ్లు ఖుషీ చేశారని, డబ్బుకు డబ్బు, విందులకు విందులు అనుభవించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.