అయ్యా.. బాబూ అంటేనే పోస్టింగ్ | the rulling party Public representatives priority posts | Sakshi
Sakshi News home page

అయ్యా.. బాబూ అంటేనే పోస్టింగ్

Published Sat, Apr 25 2015 2:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

the rulling party Public representatives priority  posts

- లేదంటే వెయిటింగ్ !
- ఖాకీ వనంలో కొత్త పోకడలు
- లూప్ లైన్ పోస్టుల్లోనే దళిత వర్గాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
అధికార పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉంటేనే  ఒకింత ప్రాధాన్య పోస్టులు దక్కుతాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తితేనే కోరుకున్న చోట పోస్టింగ్‌లు పడతాయనేది తాజాగా పోలీసు వర్గాల్లో వినవస్తున్న కొత్త వాదన.

పోలీసు శాఖలో  ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియను పరిశీలిస్తే ప్రజాప్రతినిధుల జోక్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. జిల్లా పోలీస్ శాఖ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ప్రజాప్రతినిధులు తాము చెప్పిందే వేదంలా పాటించే పోలీసులను ఏరి కోరి నియమించుకున్నారు. ఇందుకుఉన్నతాధికారులూ వీలైనంత సహకరించారన్న వాదనలున్నాయి.

నోటిమాటతో మూడునెలలు ఉద్యోగం
ముందెన్నడూ లేనివిధంగా జిల్లాలో తొలిసారి ఓరల్ ఆర్డర్ (నోటిమాట)తోనే పలువురు సీఐలను జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలుగా నియమించారు. గతంలో అత్యవసర సందర్భాల్లో ఒకరిద్దరు సీఐలను ఓరల్ ఆర్డర్‌తో పంపించిన దాఖలాలు ఉన్నాయి గానీ ఎక్కువమందిని ఒకేసారి ఇలా పంపించడం ఇదే తొలిసారి. అటాచ్‌మెంట్, మెమో గానీ లేకుండా పలువురు సీఐలకు విధులు అప్పగించారు. ఇందులో కొంతమంది అలా వెళ్లిందే తడవుగా ఆయా సర్కిళ్ల పరిధిలోకి వచ్చే నియోజకవర్గ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే దృష్టిలో పడటమే లక్ష్యంగా పనిచేశారు.

చివరకు ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తీసుకోవడంతోపాటు మాకు ఈ సర్కిల్ ఇనస్పెక్టరే కావాలి అనే స్థాయిలో ఆయా ఎమ్మెల్యేల మన్ననలు పొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులను నేరుగా కలిసో, లేదంటే ఫోన్లలోనే మాకు ఇప్పుడున్న పోలీసు ఇనస్పెక్టర్‌నే కొనసాగించండి.. అతనికే పోస్టింగ్ ఇవ్వండి అని ఒత్తిళ్లు తీసుకువచ్చే స్థాయిలో పనితీరు కనబరిచారు. ఇక పోలీసు అధికారులు ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా ఆయా సీఐలకు పోస్టింగ్‌లు ఇచ్చేశారు. జిల్లాలో ఇటీవల జరిగిన పోస్టింగ్‌ల్లో చాలావరకు ఇదే బాపతు వ్యవహారాలు నడిచాయన్నది బహిరంగ రహస్యం.

ఆరోపణలున్నా పోస్టింగ్‌లు
ఇదే క్రమంలో ఆరోపణలు, శాఖాపరమైన విచారణ ఎదుర్కొంటూ వీఆర్‌లో ఉన్న ఇనస్పెక్టర్లకే  కీలకమైన పోలీస్ స్టేషన్లను అప్పగించారు. ఎన్ని  ఆరోపణలున్నాయనేది కాదు.. ప్రజాప్రతినిధి ఎంతగట్టిగా సిఫార్సు చేశాడా.. అనేదే ప్రామాణికంగా తీసుకుని బదిలీల పర్వం సాగించారని చెబుతున్నారు. కొంతమంది సీఐల పోస్టింగ్‌లు మాత్రం ఉన్నతాధికారుల ఆబ్లిగేషన్ మేరకు జరిగాయని అంటున్నారు. ఈ పోస్టింగ్‌లు కూడా వ్యూహాత్మకంగా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే సాగేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్లారని అంటున్నారు. ఇన్ని వ్యూహాలు, రాజకీయాలు చేయలేని సీఐలు మాత్రం ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నారని చెబుతున్నారు.

సిఫార్సుల ఖాకీలు జన సమస్యల పై ఏం స్పందిస్తారో
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తి పోస్టింగ్‌లు పొందిన పలువురు పోలీసులు సదరు ఎమ్మెల్యేను కాదని రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం ఎలా చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం పచ్చచొక్కాల సేవలోనే తరిస్తూ మిగిలిన పార్టీల నేతలను, ప్రజాసంఘాల వారిని, ప్రజాసమస్యలపై పోరాడే నాయకులను టార్గెట్ చేస్తారన్న వాదనలు బయలుదేరాయి.

దళిత పోలీసులకు పోస్టింగ్‌లు ఎక్కడ?
వ్యూహాత్మకమో, యాథృచ్ఛికమో తెలియదు కానీ పోలీసుల బదిలీ ప్రక్రియలో దళితవర్గానికి చెందిన  సీఐలకు ప్రాధాన్యం దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. దళితవర్గానికి చెందిన సీఐల్లో కేవలం ముగ్గురికే లా అండ్ ఆర్డర్ బాధ్యతలు దక్కాయి.  ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే కనీసం ఆ ముగ్గురికైనా పోస్టింగ్‌లు దక్కాయని చెబుతున్నారు. మిగిలిన వారందరినీ లూప్‌లైన్లకే పరిమితం చేశారు. పోలీసు శాఖలో మితిమీరిన అధికార పార్టీ నేతల పెత్తనం ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement