జన్మభూమిని.. మమ అనిపించారు
ఆందోళనలు, నిరసనల మధ్యముగిసిన జన్మభూమి
ప్రశ్నించిన వారిపై బెదిరింపులు
నిరాశపరచిన గ్రామసభలు
చిత్తూరు (కలెక్టరేట్):జిల్లాలో చేపట్టిన నాలుగో విడత జన్మభూమి – మా ఊరు గ్రామసభలు ప్రజల ఆందోళనలు, నిరసనల మధ్య తూతూమంత్రంగా ముగిశాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతంత మాత్రంగానే గ్రామ సభలకు హాజరవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలే తెలియక ప్రజలు నిరాశ చెందారు.జన్మభూమి – మా ఊరు గ్రామసభలను ఈ నెల 2వ తేదీ నుంచి 11వ వరకు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రధానంగా కుటుంబ, సామాజిక వికాసమే లక్ష్యంగా చేపట్టాలని, గ్రామ సభలన్నింటినీ పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలిరోజు నుంచే గ్రామ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు లబ్ధిదారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. గతంలో జరిగిన మూడు జన్మభూముల్లో ఇచ్చిన సమస్యలే పరష్కారం కాలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జన్మభూమితో కూడా ఒరిగేది ఏముందిలే అని సామాన్య ప్రజలతోపాటు, అధికార పార్టీ కార్యకర్తలు కూడా పెదవి విరిచారు. పలుచోట్ల జన్మభూమి గ్రామసభలను అడ్డుకోవడంతో అధికారులు సభలను నిర్వహించలేక, పోలీసుల సహకారాన్ని తీసుకుని, అర్ధాంతరంగా ముగించారు. గ్రామసభల్లో ఎలాంటి హామీలు ఇవ్వకపోగా అధికార పార్టీల నాయకుల ఊకదంపుడు ప్రసంగాలతోనే సమయం కరిగిపోయిందనే విమర్శలు వచ్చాయి.
టీడీపీ కార్యకర్తల నుంచే నిరసన
జన్మభూమి గ్రామసభల్లో అధికార పార్టీ కార్యకర్తల నుంచే పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తొలిరోజు టీడీపీ ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే సభలను ఏర్పాటు చేసినా.. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. దీంతో చాలాచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గ్రామసభలకు డుమ్మాకొట్టారు. కేవలం కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతోనే గ్రామసభలను నిర్వహించి చేతులు దులుపుకున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో అధికారులు సభలను నిర్వహించలేక ఇబ్బందు లు పడిన సంఘటనలు ఉన్నాయి.
రసీదులు లేవ్ ..
ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలకు ప్రతీకగా అధికారులు రశీదులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ దఫా జన్మభూమి గ్రామసభల్లో ఎక్కడా అర్జీలకు రశీదులు ఇచ్చిన దాఖలాలు లేవు.
లక్ష అర్జీలు..
జిల్లావ్యాప్తంగా నాలుగో విడత జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై లక్షకు పైగా అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను అధికారులు రోజువారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.