
క్లబ్‌లు తెరుద్దాం
ప్రజాప్రతినిధులపై తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు
పక్క జిల్లాలో లేని అభ్యంతరం ఇక్కడెందుకని ప్రశ్న
వారి ఆవేదనను అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన
రాజధాని నగరమంటే మంత్రులు, అధికారులు, కార్యాలయాలే ఉంటే ఎట్లా.. కాస్తంత రిక్రియేషన్, ఆపై సంపాదన కూడా ఉండాలనే ఆలోచన తెలుగు తమ్ముళ్లకు వచ్చింది. ఇంకేముంది తమకు అనుకూలురైన ప్రజాప్రతినిధుల ద్వారా పేకాట క్లబ్‌లు తెరిపిం చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
విజయవాడ సిటీ : రాజధాని ముఖద్వారం కృష్ణా జిల్లాలో పేకాటక్లబ్‌లు ఏర్పాటుచేయాలని తమ్ముళ్లు ఉబలాటపడుతున్నారు. వాటి ఆవశ్యకతను వివరించడంతో పాటు అందుకు సహకరిస్తే ఒనగూరే ఆర్థిక ప్రయోజనాల్ని ఎరగా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా ఊ..అనిపిస్తే చాలు, పోలీసుపరంగా తాము మేనేజ్ చేసుకుంటామనే భరోసా ఇస్తున్నారు. వీరి ప్రతిపాదనలపై కొందరు కేబినెట్ స్థాయి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వీరి ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే దసరా నాటికి జిల్లాలో ఐదారు పేకాటక్లబ్‌లు రావడం ఖాయమనిపిస్తోంది.
ప్రయత్నాల్లో తెలుగు తమ్ముళ్లు
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి కుమారుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మూతపడిన పేకాట క్లబ్‌ను నెల రోజుల కిందట తెరిపించి నిర్వహిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ క్లబ్‌లో పేకాడేందుకు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన జూదరులు ‘హ్యాపీ’గా వెళ్లొస్తున్నారు. ఇదే రీతిలో తాము కూడా ఏర్పాటు చేసుకుంటామంటూ పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. కంచికచర్ల మండలం, ఆగిరిపల్లి మండలంలో మూతపడిన క్లబ్‌లను తెరుస్తామంటూ ముందుకొస్తున్నారు. వీటిల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు భాగస్వాములుగా చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ నగరంలో ఓ సొసైటీ క్లబ్‌తోపాటు మరో కొత్త క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవికాక నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లోని మామిడి తోటలు, నందిగామ, గుడివాడ, కైకలూరు పరిసర ప్రాంతాల్లోని పొలాల అతిథి గృహాల్లో తాత్కాలిక క్లబ్‌ల ఏర్పాటుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
సొమ్ము చేసుకునేందుకే..
రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా పలువురు బలోపేతం అవుతున్నట్టు తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. భూములు అమ్మడం ద్వారా కొందరు ఆర్థిక స్థితిమంతులైతే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లాభాలు ఆర్జించేవారి సంఖ్య కూడా బాగానే ఉంది. దసరాకు రాజధానికి శంకుస్థాపన చేస్తే విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణాజిల్లాలో భూముల క్రయవిక్రయాలు పెరిగి ఆదాయ వనరులు మరింత పెరుగుతాయని వారి ఆశ. పైగా రాజధానికి చేరువ కావడంతో వ్యాపారాలన్నీ కూడా బాగానే పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇక్కడ క్లబ్‌లు లేకుంటే హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వెళ్లి పేకాడతారని, ఇక్కడి సంపద పొరుగు ప్రాంతాలకు తరలివెళుతుందని చెబుతున్నారు. ఇక్కడే క్లబ్‌లను అనుమతించిన పక్షంలో అందరికీ ‘ప్రయోజనం’ ఉంటుందనే ఫార్ములాను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకెళుతున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
పేకాట క్లబ్‌ల్లో నిబంధనలు అతిక్రమించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామంటూ ప్రతిపాదిస్తున్నారు. వీటిని సంబంధిత పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేస్తామని, ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలించుకోవచ్చంటున్నారు. పేకాట వ్యవహారాలు నిక్కచ్చిగా జరిగే విధంగా కొందరు పోలీసు సిబ్బందిని సీసీ కెమెరాల పర్యవేక్షణకు పెడితే బాగుంటుందని, అవసరమైతే వారికయ్యే జీతభత్యాలు కూడా తామే చెల్లిస్తామనే అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లుగా పార్టీని మోసిన తమకు ఈ మాత్రం మేలు చేయకుంటే ఎలాగంటూ ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. ఇప్పటికే వీరిపై సానుకూలంగా ఉన్న గాడ్‌ఫాదర్లు ఓ మంచి ముహుర్తం చూసుకుని అధినేత నుంచి గ్రీన్‌సిగ్నల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.