హైకోర్టు ఆదేశాలు బేఖాతర్! | High Court orders bekhatar! | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్!

Published Wed, Jan 21 2015 2:10 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్! - Sakshi

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్!

పులివెందుల/సింహాద్రిపురం: పైడిపాలెం ప్రాజెక్టు వద్ద మరోమారు ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ, బిసీ వర్గాలకు చెందిన రైతుల కడుపు కొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు ఏమాత్రం ఆటంకం కల్గించమని పేర్కొంటున్నా, భూనిర్వాసితులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం చర్యలు కన్పిస్తున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్కచేయకుండా ఏకపక్ష చర్యలకు సిద్ధమయ్యారు. రైతన్నల ఆవేదనకు చలించిపోయినా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వారికి అండగా నిలవడంతో యంత్రాంగం వెనుదిరగాల్సి వచ్చింది.
 
అధికార పార్టీ నేతల ఒత్తిడి ఫలితంగా మరోమారు ట్రాన్సుకో ఏకపక్ష చర్యలకు సిద్ధమైంది. పైడిపాలెం ప్రాజెక్టు వద్ద ఉన్న ఎస్టీ రైతు పొలాలకు చెందిన విద్యుత్ కనె క్షన్లు తొలగించడానికి మంగళవారం అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సింహాద్రిపురం మండల పరిధిలోని పైడిపాలెం ప్రాజెక్టు కింద ముంపు గ్రామమైనకుమ్మరాంపల్లెపై అధికారులు కక్ష కట్టారు. సోమవారం మధ్యాహ్నం గ్రామానికి విద్యుత్ అధికారులు విద్యుత్‌ను కట్ చేశారు.

ఇది ఇలా ఉంటే మంగళవారం విద్యుత్ ఎస్‌ఈ సుబ్బరాజుతోపాటు డీఈఈ ఓబుళకొండారెడ్డితోపాటు భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని మళ్లీ విద్యుత్‌లైన్లతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు తొలగించేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు ఆందోళనకు దిగారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వారికి మద్దతుగా నిలిచి కోర్టు స్టే ఇస్తే ఎలా ధిక్కరిస్తారని ఎస్‌ఈ సుబ్బరాజును ప్రశ్నించారు. డినోటిఫికేషన్ ఇంకా ప్రకటించలేదన్నారు. ప్రాజెక్టు పనులకు తాము ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదని.. నీరు వస్తే తామే వెళ్లిపోతామని.. కడుపులు కొట్టకండని అధికారులను వేడుకున్నారు.

కరెంటు సర్వీసులు తొలగిస్తే మూకుమ్మడిగా పురుగుల మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని.. పచ్చని తమ పొలాల్లో చిచ్చు పెట్టవద్దని అధికారులను వేడుకున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్నారు. కొండాపురం మండ లంలోని 14 గ్రామాల రైతులు ఇలాగే లబ్ది పొందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం తమ గ్రామంలో ఉన్న 30కుటుంబాలపైనే అధికారులు ఎందుకు ఇంత కక్ష కడుతున్నారో అర్థం కావడంలేదని వాపోయారు.

ఒకదశలో అధికారుల దౌర్జన్యం నశించాలంటూ రైతులు నినాదాలు చేశారు. సీఎం రమేష్‌నాయుడు ఆదేశించారని కోర్డు ఆర్డర్‌ను ధిక్కరిస్తారా అని ఎస్‌ఈని రైతులు ప్రశ్నించారు. విద్యుత్‌లేక చీకట్లో మగ్గుతున్నామని ఎస్టీ, బీసీ రైతులు వాపోయారు. ఎస్టీ కుటుంబాలపైన ఇంత కక్ష సాధింపా అని  వారు ప్రశ్నించారు. పైడిపాలెం ప్రాజెక్టుకు నీరు వచ్చేవరకు తామే యజమానులం అంటూ రైతులు స్పష్టంచేశారు.
 
పగబట్టిన కలెక్టర్...
 భూ నిర్వాసితులమన్న కనీస స్పృహ లేకుండా జిల్లా కలెక్టర్ తమ గ్రామంపై పగబట్టారని రైతులు వాపోయారు. టీడీపీ వారు ఆదేశిస్తే హైకోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్కచేయరా అని వారు ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వుల్ని ఖాతరు చేయకపోవడం నేరమన్న విషయాన్ని గ్రహించాలని వారు అధికారులకు తెలిపారు. దీంతో ఎస్‌ఈ సుబ్బరాజు కలెక్టర్‌తో మాట్లాడారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో చర్చల వివరాలు వెల్లడించారు. ఎట్టకేలకు అధికారులు వెనుతిరిగి వెళ్లారు. జిల్లా కలెక్టర్‌తో కూడా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.

రైతులపట్ల కనికరం లేకుండా ఇలా ప్రవర్థించడం మంచిదికాదని ఆయన హితవు పలికారు. ఆయన వెంట వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగపు కార్యదర్శి అరవిందనాథరెడ్డి, ఎంపీపీ భర్త కొమ్మా పరమేశ్వరరెడ్డి, బలపనూరు శేఖరరెడ్డి, లోమడ జనార్థన్‌రెడ్డి, కొత్తపల్లె భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పవన్, సర్పంచ్‌లు శివారెడ్డి, కిశోర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బయ్యనాయుడు, ఏడీ శ్రీకాంత్, ఏఈలు రమేష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 పంటలు కోల్పోతే బజారున పడాల్సిందే :
 4ఎకరాల పొలంలో వేరుసెనగ, కూరగాయల పంట సాగు చేశా. నెలరోజుల్లో పంట చేతికి రానుంది. అధికారులు కక్ష కట్టి  ప్రతాపం చూపిస్తున్నారు. ఎస్టీలమైన మాకు ఏ ఆధారంలేదు. విద్యుత్ సరఫరాలేక పంటలు కోల్పోతే బజారున పడాల్సి వస్తుంది.
 - పుష్పాంజలి(మహిళా రైతు), పైడిపాలెం
 
 అధికారులవి కక్ష సాధింపు చర్యలు :
 రాజకీయ దురుద్దేశంతోనే మా గ్రామానికి విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. వారికి ఏమి అపకారం చేశాం. అధికారులు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.
 - లక్ష్మిదేవి (మహిళా రైతు),
 పైడిపాలెం
 కోర్టు ఆర్డర్‌ను గౌరవించాల్సిందే :ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
 
 కోర్డు ఆర్డర్‌ను సామాన్య వ్యక్తి నుంచి అత్యున్నతస్థాయి వ్యక్తుల వరకు అందరూ గౌరవించాల్సిందేనని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పైడిపాలెం ప్రాజెక్టు వద్ద ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు వారాల క్రితం విద్యుత్ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా కలెక్టర్ ఆదేశించారని పైడిపాలెం పొలాల కరెంటు సర్వీసులను తొలగించడానికి వచ్చారన్నారు.

రాజకీయ దురుద్దేశంతోనే కలెక్టర్ అధికారులను పంపారన్నారు. ఆ రోజు రైతులు అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారని.. తర్వాత హైకోర్టును ఆశ్రయించిన రైతులు 6వారాల పాటు స్టేటస్ కో ఆర్డర్ పొందారన్నారు. ఈ ఆర్డర్‌ను కలెక్టర్, అధికారులకు చూపించినా కూడా మళ్లీ ఇప్పుడు పొలాల సర్వీసులను తొలగించడానికి వచ్చారన్నారు. హైకోర్టు ఆర్డర్‌ను అధికారులు పాటించాల్సిందిపోయి వ్యతిరేకంగా నడుచుకోవడం శోచనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement