ఆస్తిపన్ను వసూళ్లలో అధికారుల ఇష్టారాజ్యం
అధికారపార్టీ నేతలవైపు కన్నెత్తి చూడని వైనం
చివరి రోజున రూ.24 కోట్ల వసూళ్లు స్తంభన
‘ జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి భర్త చంద్రప్రకాష్ పేరిట ఉన్న ఈ భవనం చిత్తూరు కార్పొరేషన్‌కు రూ.7.17లక్షల ఆస్తిపన్ను చెల్లించాలి. పన్ను బకాయిలు ఉంటే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదనే నిబంధన ఉండటంతో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్‌కు పన్ను చెల్లించారు. అప్పటి నుంచి రెండేళ్లుగా కార్పొరేషన్‌కు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. అత్యధిక బకాయిల జాబితాలో ఈ పెద్ద మనిషి పేరున్నా అధికారపార్టీ నాయకుడు కావడంతో ఏ అధికారీ ఆయనచేత పన్నుకట్టించే దైర్యం చేయలేకపోయారు.’
..ఇలా పేదలకో న్యాయం.. పెద్దలకో ధర్మం ఎలా ఉంటుందో చిత్తూరు కార్పొరేషన్ అధికారులు స్పష్టంగా చూపించారంతే. మిగిలిన మునిసిపాలిటీల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. జిల్లాలో ఆస్తిపన్ను వసూళ్లలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉదాసీనంగా వ్యవహరించాయి. మార్చి దగ్గరపడుతుందని ఊదరగొడుతూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తూ పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టిన మునిసిపల్ అధికారులు రూ.లక్షల్లో బకాయిలు పడ్డ పెద్దల జోలికి వెళ్లలేదు. అందులోనూ టీడీపీకి చెందిన నాయకులు రూ.లక్షల్లో అప్పులున్నా వాళ్ల వద్దకువెళ్లి అడగలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో గురువారంతో 2015-16 ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియ పూర్తయింది. అయితే కేవలం మధ్య తరగతి కుటుంబాలు, నిరుపేదలు, సమాజంలో గౌర వం కోసం బతికేవాళ్లనే లక్ష్యంగా చేసుకుని పన్నులు వసూలు చేశారే తప్ప పెద్దమనుషులుగా, అధికారపార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్లు రూ.లక్షల్లో బకాయిలు పడ్డా పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో మొత్తం రూ.24 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాకుండా స్తంభించిపోయింది.
పుత్తూరు టాప్..
ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలో పుత్తూరు మునిసిపాలిటీ ముందజంలో నిలిచింది. ఇక్కడ గత గురువారం నాటికి మొత్తం రూ.1.39 కోట్లు (99 శాతం)వసూలయిం ది. తరువాతి స్థానాల్లో పుంగనూరు రూ.3.15 కోట్లు(83 శాతం), పలమనేరు రూ.1.25 కోట్లు(82 శాతం), తిరుపతి కార్పొరేషన్ రూ. 31.66 కోట్లు(80 శాతం), శ్రీకాళహస్తి రూ.3.58 కోట్లు (73 శాతం), మదనపల్లె రూ.6.62 కోట్లు (63 శాతం) చిత్తూరు రూ.10.10 కోట్లు (60 శాతం) వసూలు చేసింది. అన్నింటికంటే అట్టడుగులో నగరి మునిసిపాలిటీ రూ.63 లక్షలు వసూలుచేసి 19 శాతం వసూళ్లతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది.