
మామూళ్ల మత్తు.. మస్త్
ఇద్దరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మద్యం సిండికేట్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మద్యం వ్యాపారులు జిల్లాలో మందుబాబులను గుల్ల చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. సరిగ్గా రెండేళ్ల కిందట మద్యం సిండికేట్ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో 2012 జూలై నుంచి కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుండి లక్కీడిప్ ద్వారా లెసైన్స్‌లు కేటాయించడం, ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయించడం లాంటి నిబంధనలు అమలు చేశారు.
అయితే అవి ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది జూలై నుంచి కొత్త లెసైన్స్‌దారులు మద్యం దుకాణాలు నడుపుతున్నారు. దుకాణాన్ని బట్టి ఒక్కో లెసైన్స్‌కు 32.52 నుంచి 50 లక్షల రూపాయలు చెల్లించారు. ‘సిట్టింగ్ రూం’ కోసం మరో 2 లక్షల రూపాయలు అదనంగా చెల్లించారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం రాదని భావించిన వ్యాపారులు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓ మాజీ ఎమ్మెల్యేను కలిశారు.
వారి అండతో సిండికేట్ అయ్యారు. ఒక్కో బాటిల్‌పై 10-15 రూపాయలు పెంచి విక్రయాలు జరుపుకునేందుకు నిర్ణయించారు. ఆబ్కారీ అధికారులు కూడా ఇందుకు ‘ఓకే’ చెప్పారు. ఇంకేముంది.. నెలన్నరగా జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. దీనివల్ల మందుబాబుల జేబులు గుల్లవుతోంటే.. మద్యం వ్యాపారుల గల్లా పెట్టె మాత్రం కళకళలాడుతోంది.
నెలకు రూ.6.39 కోట్ల అదనపు ఆదాయం
జిల్లాలో 233 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణంలో రోజుకు సగటున 610 బాటిళ్లు విక్రయిస్తున్నారు. ప్రతీ బాటిల్‌పై 10-15 రూపాయలు అదనంగా పెంచి విక్రయిస్తున్నారు. అంటే ఒక్కో దుకాణానికి రోజుకు 6,100 నుంచి 9,150 రూపాయలు వస్తుంది. ఈ లెక్కన నెలకు 1.83 లక్షల నుంచి 2.74 లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. అంటే 233 దుకాణాలకు నెలకు 4.26 కోట్ల నుంచి 6.39 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తోంది.
నెలవారీ మామూళ్లు
రూ.81.55 లక్షలు
ఓ మద్యం వ్యాపారి వివరాల ప్రకారం.. అనంతపురం నగరంతో పాటు మునిసిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాల నుంచి అధికారులకు నెలకు 41 వేల రూపాయలు
మామూళ్లు ఇస్తున్నారు. రూరల్ పరిధిలో 35 వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. సగటున ఒక్కో దుకాణం నుంచి 35 వేల రూపాయలు ఇస్తున్నారని అనుకున్నా నెలకు 81.55 లక్షల రూపాయలు మామూళ్లు అధికారులకు అందుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఎక్సైజ్ స్టేషన్‌కు 27-30 వేల రూపాయలు, ఎక్సైజ్ ఏసీ, సూపరింటెండెంట్ కార్యాయాలకు కలిపి 6 వేలు, డీపీ ఆఫీసుకు రూ.5 వేలు ఇస్తారని తెలుస్తోంది. ఇది కాకుండా ఆయా మద్యం దుకాణాల పరిధిలోని కొన్ని స్టేషన్లు మినహా తక్కిన స్టేషన్లకు మామూళ్లు అందుతున్నాయి. సిండికేట్ ద్వారా నెలకు 6.39 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే ఈ మాత్రం చెల్లించడం వీరికి పెద్ద లెక్కేం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిండికేట్ విషయంపై వివరణ కోరేందుకు ఎక్సైజ్ డీసీ జీవన్‌సింగ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.