వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్ల దాడి
పులివెందుల :
పులివెందులలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఉన్న ఫలంగా పులివెందుల నడిరోడ్డుపై ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ సంఘటనను చూడగానే ఉద్రిక్త పరిస్థితి. పులివెందులకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ గిరిజనులపై అధికార పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో వారు కూడా ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య అర్ధగంటపాటు రాళ్లు, సీసాలతో యథేచ్చగా పరస్పరం విసురుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేముల మండలం చింతలజూటూరుకు చెందిన యువకులు పులి వెందులలో బైకులో వెళుతూ క్రిష్టియన్‌లైన్ సమీపంలో రోడ్డుపై జారి కిందపడ్డారు. సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన గిరిజన యువకుడు సంఘటనను చూసి నవ్వినట్లు భావించిన ఆ యువకులు గిరిజన యువకుడు నిఖిల్‌పై దాడికి పూనుకున్నారు. సమీపంలో ఉన్న వారు సర్దిచెప్పారు. అయితే మళ్లీ కొద్దిసేపటికి యువకులతోపాటు మరో 40మంది టీడీపీ కార్యకర్తలు పుల్లారెడ్డి ఆసుపత్రి సమీపంలో దాడులకు సిద్ధమయ్యారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన గిరిజన కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు అంజన్నప్ప, బాబులకు గాయాలయ్యాయి.
సంఘటనా స్థలానికి ఆలస్యంగా పోలీసులు
సంఘటనా ప్రాంతం నుంచి పోలీస్‌స్టేషన్‌కు ఈల వేస్తే వినపడేంత దూరంలో ఉన్నా.. పోలీసులు మాత్రం చాలాసేపటి తర్వాత వచ్చారు. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే మధ్యలో వచ్చినా ఘర్షణ నివారించడం వారి వల్ల కాలేదు. ఇరువర్గాలు రాళ్లు వేసుకుం టున్న దాదాపు 15నిమిషాల తర్వాత ఒక్కసారిగా రూరల్, అర్బన్ సీఐలతోపాటు మిగతా సిబ్బం ది వచ్చి పరిస్థితి అదుపు చేశారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేయడంతోపాటు దొరికిన వాళ్లను దొరికనట్లు చితకబాది పరిస్థితి అదుపులోకి తెచ్చారు. పోలీసులు ముందే వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు.
10మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు
టీడీపీ నాయకులు, చింతల జూటూరు అంజితోపటు మరో 10మంది కులంపేరుతో దూషిస్తూ చితకబాదిన నేపథ్యంలో కావేటి అంజన్నప్ప ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. గాయపడిన ఇరువురిని పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు.