బడ్జెట్టు రూపకల్పన దశలోనే ఉంది. వివిధ పథకాలు.. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. కానీ, తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలంటూ స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా అధికారులకు లేఖలు రాస్తున్నారు. తమ నియోజకవర్గంలో అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తున్నారు. అసలు నిధులేవీ లేకుండా.. ఈ పనులెలా మంజూరు చేయాలో తెలియక అధికారులు
తలపట్టుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి (సీడీపీ) ఒక్కో ఎమ్మెల్యేకు ఏటేటా కోటి రూపాయల నిధులు విడుదల చేయగా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అనేది స్పష్టత లేదు. ఇదేమీ పట్టనట్లుగా.. ఇటీవలే ఓ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జిల్లా అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. సీసీ రోడ్లు, ప్రహరీలు, కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన 95 పనుల ప్రతిపాదనలను జత చేసి.. వాటికయ్యే అంచనా వ్యయం రూ.6 కోట్లు మంజూరు చేయాలని అందులో ప్రస్తావించినట్లు సమాచారం. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తే.. వీటికి నిధుల కేటాయించటం సాధ్యం కాదంటూ ఈ ప్రతిపాదనలను తిప్పి పంపిన విషయాన్ని రాస్తూనే.. జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులు మంజూరు చేయాలని లేఖలో ప్రస్తావించారు. సీఎం తోసిపుచ్చిన ప్రతిపాదనలను తమకు పంపిస్తే.. నిధులు తమ దగ్గరెలా ఉంటాయో అర్థం కాక అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తనవంతు సలహాగా సదరు ఎమ్మెల్యే స్పెషల్ డెవలప్‌మెంట్(ఎస్డీసీ) ఫండ్ నుంచి ఆ నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో ఎటూ పాలుపోక అధికారులు తల పట్టుకుంటున్నారు.
అధికారులపై ఒత్తిడి:
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధుల పేరిట నిధులు విడుదలయ్యాయి. అప్పటి కాంగ్రెస్ నేతలు శ్రీధర్‌బాబు, ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి ముఖ్యమంత్రిని అభ్యర్థించి.. తమ తమ నియోజకవర్గాలకు వీటిని రాబట్టుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో జిల్లాకు రూ.31.32 కోట్లు విడుదలయ్యాయి. తమ నేతలు సూచించిన పనులను ప్రభుత్వం ఈ నిధుల ద్వారా చేపట్టింది. దీంతో ఈ స్పెషల్ ఫండ్ రాజకీయ ప్రయోజనాల కోసమేననే విమర్శలు వెల్లువెత్తాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ పనులకు చెక్ పెట్టింది. ఎస్‌డీసీ కింద మంజూరైన పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి? ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి? అసలు ప్రారంభం కాని పనులెన్ని? అనే వివరాలను ఆరా తీసింది. ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్నవాటిని యథాతథంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు రూ.15 కోట్ల పనులు ఆగిపోయాయి. అసంపూర్తిగా ఉన్న పనులకు వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. ప్లానింగ్ విభాగం ఖాతాలో మిగులు నిధులు ఉన్నప్పటికీ.. వీటిని వేరే పథకాలకు మళ్లించే పరిస్థితి లేదు. కానీ.. ఈలోగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎస్‌డీసీ నిధులతో పనులు మంజూరు చేయాలని లేఖలు రాస్తుండటంతో అధికారులు బిత్తరపోతున్నారు. తమ దగ్గర నిధులేమీ లేకపోవటంతో ఏంబదులివ్వాలో తేల్చి చెప్పలేకపోతున్నారు. డబ్బుల్లేని విషయం.. సీడీపీ ఇంకా అమలు కాలేదనే విషయం తెలియనిది కాకపోయినా... గతంలో మంజూరైన ప్రత్యేక నిధిని తమ నియోజకవర్గాలకు దక్కించుకునేందుకు అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచినట్లు స్పష్టమవుతోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక అభివృద్ధి నిధులకు ఎసరు పెట్టేందుకు ఈ లేఖాస్త్రం విసిరినట్లు చర్చ జరుగుతోంది.
ప్రత్యేక నిధికి ఎసరు!
Published Sat, Sep 20 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM
Advertisement
Advertisement