డైట్ బిల్లుల స్వాహా | Diet bills Swaha | Sakshi
Sakshi News home page

డైట్ బిల్లుల స్వాహా

Published Wed, Jun 29 2016 1:03 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Diet bills Swaha

ఫోర్జరీ సంతకాలతో లక్షలు కాజేసిన కాంట్రాక్టర్
ఏరియా ఆసుపత్రిలో వెలుగుచూసిన వైనం
మల్లగుల్లాలు పడుతున్న వైద్య సిబ్బంది

 

ప్రజా సంక్షేమం కోసం తలపెట్టిన ఉపాధి హామీ.. సీసీరోడ్లు, నీరు-చెట్టు పనుల్లో అధికార పార్టీకి చెందిన అనుయాయులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆఖరికి  పేద రోగుల పౌష్టికాహారం  కోసం ప్రభుత్వం  ఇస్తున్న డైట్  నిధులను సైతం వదలటం లేదు. ఏరియా ఆసుపత్రిలో లక్షల్లో  డైట్ నిధుల స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇలాకాలోనే రోగుల సొమ్ము కాజేయటంపై  విస్మయం వ్యక్తమవుతోంది.

 

నర్సీపట్నం:  అధికారుల ఫోర్జరీ సంతకాలతో స్థానిక ఏరియా ఆస్పత్రి కాంట్రాక్టర్ సుమారు 10 లక్షల రూపాయలు కాజేసిన వైనం వెలుగుచూసింది. గత ఎన్నికల్లో టీడీపీకి విధేయులుగా పనిచేసిన వారిలో కొంత మందికి  ఆసుపత్రిలో ఏఎన్‌ఎంలు, సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పించారు. అప్పటి డైట్ కాంట్రాక్టర్‌ను అర్ధంతరంగా తొలగించి పార్టీకి విధేయుడుగా ఉన్న ఒక  వ్యక్తికి బినామీ  కాంట్రాక్టర్‌గా అవకాశం కల్పించా రు.   వైద్య సిబ్బందిని ప్రలోభ పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో  ఫోర్జరీ సంతకాలు చేసేందుకు కూడా వెనకాడలేదు. డైట్ పర్యవేక్షకురాలిగా ఆసుపత్రి  హెడ్‌నర్సు పద్మ వ్యవహరిస్తున్నారు. ఆమె ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు భోజనం తయారు చేసి వడ్డించాలి. బిల్లుల చెల్లింపునకు వచ్చేసరికి హెడ్‌నర్సుతో పాటు ఆర్‌ఎంవో సుధా శారద, గుమస్తా ధ్రువీకరించిన అనంతరం  ఆసుపత్రి సూపరింటెండెంట్  డైట్ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే  పర్యవేక్షకురాలు  పద్మ సంతకం ఫోర్జరీ చేసి, మిగిలిన ఇద్దరు చేత సంతకాలు పెట్టించి సూపరింటెండెంట్‌కు బిల్లులు సమర్పిస్తున్నారు.  పర్యవేక్షకురాలు ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు  కాంట్రాక్టర్ భోజనం పెడుతున్నాడు.  ఉన్నవారి కంటే ఆదనంగా రోగుల సంఖ్యను చూపించి అధిక మొత్తంలో డైట్ బిల్లులు మారుస్తుండటంపై అనుమానం వచ్చి హెడ్‌నర్సు పద్మ డైట్ షీట్లను పరిశీలించారు. ఈ షీట్లలో  సంతకాలు తనవి కావని, తన దగ్గర ఉన్న రోగుల హాజరుకు, ఫోర్జరీ సంతకాలతో ఉన్న హాజరుకు చాలా వ్యత్యాసం ఉందని సూపరింటెం డెంట్ హెచ్.వి.దొర దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రోగులకు సంబంధించిన డైట్ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్య కంటే ఆదనంగా బిల్లు మార్చినట్టు సూపరింటెండెంట్ నిర్ధారణకు వచ్చారు. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ స్వాహా పర్వంలో సుమారు రూ.10 లక్షల వరకు  కాంట్రాక్టర్ కాజేసినట్లు  ఆసుపత్రి అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది.

 
సంతకాల ఫోర్జరీ వాస్తవమే

డైట్ బిల్లుల్లో ఫోర్జరీ సంతకాలు జరిగిన సంగతి వాస్తవమేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ దొర స్పష్టంచేశారు. సంబంధిత కాంట్రాక్టర్ నుండి స్వాహా చేసిన నిధులు రికవరీ చేస్తామని  చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. 

 
చర్యలకు  వైఎస్సార్‌సీపీ డిమాండ్

రోగుల పేరిట నిధులు  స్వాహా చేసిన సంబంధిత కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, పార్టీ నాయకులు పెదిరెడ్ల నాగేశ్వరరావు, గుడబండి నాగేశ్వరరావు తదితరులు  సూపరింటెండెంట్ దొరకు మెమొరాండం అందజేశారు. రోగుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించటం దారుణమని   పేర్కొన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల అండతోనే ఇష్టారాజ్యంగా బిల్లులు చేసుకుని స్వాహా చేశారని ఆరోపించారు.  నిధుల స్వాహాపై జిల్లా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధులు రాబట్టడమే కాకుండా ఫోర్జరీ సంతకాలకు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement