ఇంకుడు గుంతలనూ వదలని తెలుగు తమ్ముళ్లు
90 శాతం గుంతలు టీడీపీ కార్యకర్తలకే
రూ.18 కోట్లు అధికారపార్టీ నేతల జేబుల్లోకి?
చిత్తూరు: జిల్లాలో భూగర్భజలాల పెంపు కోసం కేంద్రప్రభుత్వం చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమం టీడీపీ నేతల జేబులు నింపుతోంది. లబ్ధిదారుడికి గుంత తవ్వుకునే అవకాశం మాత్రమే ఇచ్చి.. గుంతకు కావాల్సిన సామాగ్రి మొత్తం టీడీపీ నాయకులే సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియతో గుంతలకు కేటాయిస్తున్న నిధుల్లో 90 శాతం అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలకే వెళ్తోంది.
నీరుగారుతున్న లక్ష్యం..
కరువు పరిస్థితుల్లో కూడా ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడకుండా ఉండటమే ఇంకుడుగుంతల ఏర్పాటు ముఖ్య లక్ష్యం. అయితే జిల్లాలో అధికారపార్టీ నాయకుల ఆధిపత్యంతో ఈ పథకం ఉద్దేశ్యం పూర్తిగా నీరుగారుతోంది. టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ శాతం ఇంకుడు గుంతలను కేటాయించడంతో నిర్దేశిం చిన లక్ష్యం కూడా చేరలేదు. ఈ ఇంకుడుగుంత లు నింపడంలో కూడా పచ్చ కార్యకర్తలు కనీస ప్రమాణాలను పాటించడం లేదు.
నిబంధనలు తుంగలో..
ప్రభుత్వం ఒక్క ఇంకుడు గుంత తవ్వుకుంటే లబ్ధిదారుడికి రూ.1670 చెల్లిస్తుంది. గుంత తవ్వుకున్నందుకు రూ.314, కంకర, ఇసుక, సిమెంట్‌రింగుల కోసం రూ.1,356లు చెల్లిస్తుంది. వీటిని లబ్ధిదారుడే తనకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు. అలా కానిపక్షంలో స్థానిక సర్పంచ్‌ను లబ్ధిదారుడు కోరితే ఆయన సరఫరా చేయవచ్చు. లేకపోతే భూగర్భ గనుల శాఖను కోరినా ఇసుక, కంకరను సరఫరా చేస్తారు. ఈ నిబంధనలు టీడీపీ నాయకులు తుంగలో తొక్కుతున్నారు. లబ్ధిదారులకు ఇష్టం లేకపోయినా తమ దగ్గరే ఇసుక, కంకర కొనుగోలు చేయాల్సిందేనని నిబంధనలు పెడుతున్నారు. కొనుగోలు చేయకుంటే ఇంకుడు గుంత మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారు.
దోచుకుంటున్నారు
ఇసుక, కంకర, స్టీల్ కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1,356 తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకే వెళుతున్నాయి. స్థానికంగా ఉండే టీడీపీ నే తలే వీటిని సరఫరా చేస్తున్నారు. కంకరను 20 ఎంఎం, 40 ఎంఎం అనే రెండు రకాలు వాడాలి. అయితే వీటిబదులు ఇటుక ముక్కలు, రాళ్లు సరఫరా చేస్తున్నారు. నాసిరకం సిమెంట్ రింగులను లబ్ధిదారులకు అంటగడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.36 లక్షల ఇంకుడు గుంతలను తవ్వారు. దాదాపు వీటన్నింటికీ టీడీపీ నాయకులే మెటీరియల్ సరఫరా చేశారు.
ఇంకా అందని బిల్లులు..
ఇంకుడు గుంతలు నిర్మించుకున్న లబ్ధిదారుల కు ఇప్పటివరకు బిల్లులు అందలేదు. జిల్లా వ్యా ప్తంగా తవ్విన 1.36 లక్షల ఇంకుడు గుంతలకు సుమారు రూ.22.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో లబ్ధిదారులకు సుమారు రూ.4.27 కోట్లు చేరుతుంది. మిగతా రూ.18.45 కోట్లు పచ్చ బాబుల జేబుల్లోకి చేరనుంది.