
విచ్చలవిడిగా ఇసుక డంప్‌లు
సుండుపల్లి:
మండలంలో ఇసుక డంప్‌లు భారీగా ఉన్నాయి. ఈ డంప్‌లు అధికార పార్టీ నాయకులవి కాబట్టే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మడితాడు పంచాయతీ సానిపాయి రోడ్డు మార్గంలో ఉన్న ఉప్పరపల్లి వెనుక వైపున మామిడి తోటల్లో ఇసుక డంప్‌లు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. అదే మార్గంలో గల చండ్రాయుడు ఆలయం వద్ద కూడా డంప్‌లున్నాయి.
ఒక్కో డంప్‌లో వందల ట్రాక్టర్ల ఇసుక నిల్వ చేసి పెట్టారు. ఒక పక్క పోలీసులు, మరో పక్క రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మండల కేంద్రానికి కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలో సానిపాయి రోడ్డుకు కూత వేటులోనే డంప్‌లు ఉన్నప్పటికీ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యం. మండలంలోని పేదలు గృహ నిర్మాణాలకు ఇసుక లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇసుకాసురులు మాత్రం డంప్‌లను ఏర్పాటు చేసుకొని దర్జాగా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఐదు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సానిపాయి మార్గంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద ఉన్న ఇసుక డంప్‌ను సీజ్ చేశారు. అయితే అక్కడికి దగ్గరగా ఉన్న మామిడి తోటలోని ఇసుక డంప్‌ల విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.