జేసీ సృజనను కలిసి వినతి పత్రం అందజేస్తున్నఏపీ రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు
సాక్షి, విశాఖపట్నం : అడ్డగోలు ఆర్డర్లు జారీ చేసి అడ్డంగా బుక్కయిన విశాఖ మాజీ ఆర్డీవో వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు నమోదుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలే ఓ వైపు ఏసీబీ దాడులు, మరో వైపు సిట్ దర్యాప్తుతో జిల్లా రెవెన్యూ శాఖ పరువు పాతాళానికి చేరుకోగా తాజాగా ఆర్డీవో వ్యవహారం రెవెన్యూ వర్గాలను మరింత కుంగదీస్తోంది. ఆర్డీవోను సరెండర్ చేయడంతోపాటు కలెక్టర్ సిఫార్సుతో సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా క్రిమినల్ కేసుకు అనుమతి ఇవ్వడాన్ని రెవెన్యూ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. క్వాసీ జ్యుడీషియల్ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం లేదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో న్యాయసలహాతో ముందుకు వెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుండగా, ఎలాగైనా క్రిమినల్ కేసు నమోదు కాకుండా అడ్డుకోవాలని రెవెన్యూ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విశాఖ బ్రాంచ్ అధ్యక్షుడు పీవీఎల్‌ఎన్ గంగాధరరావు, కార్యదర్శి పి.చంద్రశేఖరరావు నేతృత్వంలో రెవెన్యూ ప్రతినిధుల బృందం ఆదివారం జేసీ సృజన ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఆర్డీవో గోవిందరాజులతోపాటు ఏపీ జేఏసీ (అమరావతి) జిల్లా చైర్మన్ ఎస్.నాగేశ్వరరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఎస్ ప్రకాశరావు తదితరులు జేసీని కలిసి మాజీ ఆర్డీవోపై క్రిమినల్ కేసు నమోదు విషయంలో తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తప్పుడు ఆర్డర్లుగా భావిస్తే హైకోర్టులో కొట్టేయాలే తప్ప క్రిమినల్ చర్యలకు దిగడం సరికాదని ఈ సందర్భంగా సంఘ నేతలు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎవరైనా రెవెన్యూ ఉద్యోగులు క్వాసీ జ్యుడీషియల్ అధికారంతో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏమైనా తప్పులున్నట్లయితే వాటిని పై కోర్టుల అపీల్ చేసుకోవాలని, అంతేగాని క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. ఇదే విషయాన్ని వేర్వేరు కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశాయని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే ఏ అధికారినైనా ప్రభుత్వానికి సరెండర్ చేయడం లేదా సస్పెన్షన్ వేయడాన్ని తాము తప్పుబట్టబోమని, డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఇచ్చిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తాము అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో తొందరుపాటు చర్యగా భావిస్తున్నామని, తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తప్పుడు ఆర్డర్లుగా పేర్కొంటున్నవాటిపై అంకా పూర్తిస్థాయి విచారణనే మొదలు కాలేదని, సదరు ఆర్డర్లను పై కోర్టులో రద్దు పరచలేదని, అంతే కాకుండా ఈ వ్యవహారంపై విచారాణాధికారి నియామకం కూడా జరగలేదని ఈ దశలో క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆక్షేపణీయమన్నారు. దీనిపై స్పందించిన జేసీ సృజన న్యాయపరమైన సలహా తీసుకున్న తరువాతే క్రిమినల్ కేసు నమోదు విషయంలో తాము ముందుకు వెళ్తామని, ఎవరూ సందేహపడనవసరంలేదని చెప్పారు. జేసీని కలిసినవారిలో సంఘ నేతలు ఎస్.ఎ.త్రినాథరావు, డి.రాజేంద్రవర్మ, పి.శ్యామ్ ప్రసాద్, పి.వి.రత్నం, సీహెచ్ వెంకటరమేష్, బీఎస్‌ఎస్ ప్రసాద్, ఎస్‌డీసీ జవహర్‌లాల్ నెహ్రూ, తహశీల్దార్లు సుధాకర్ నాయుడు, నాగభూషణం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment