RDO offices
-
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పెండి శ్రీనివాస్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఉదయం ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూపాలపల్లి పట్టణంలోని జంగేడుకు చెందిన పాలిక సమ్మయ్య, మరో నలుగురు రైతులకు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగాగల 3.29 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారని కొద్ది రోజుల క్రితం జేసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆ ఆదేశాల జిరాక్స్ కాపీలను ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌ను పాలిక సమ్మయ్య తమ్ముడి కుమారుడైన రఘుణాచారి కోరాడు. ఇందుకు శ్రీనివాస్ రూ.లక్ష డిమాండ్ చేయగా.. రూ.50 వేలు ఇస్తానని బాధితుడు తెలిపాడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయాన్ని వెల్లడించాడు. బుధవారం ఉదయం 11 గంటలకు రఘుణాచారి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి రూ.50 వేలు ఇస్తుండగా శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
సూర్యాపేట : వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేయాలని కలెక్టర్ సురేంద్రమోహన్ ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున మార్చి 24న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన శాసనసభ ఎన్నికల జాబితాను తీసుకొని దాని ప్రకారం అసెంబ్లీ పరిధిలోని గ్రామ పంచాయతీలు వాటి వార్డుల వారీగా క్రమ సంఖ్య ప్రకారం ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ఏ పార్ట్‌లలో, ఏ సీరియల్ నెంబర్ ఉన్నది, ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నది అనే విషయాలను మాన్యువల్‌గా తయారు చేసుకొని అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు లెవల్1, లెవల్2 రూట్ అధికారులు, జోనల్ అధికారులు, ఎన్నికల అధికారులు ఉంటారని పేర్కొన్నారు. అదే విధంగా సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ లెవల్1, డివిజనల్ అధికారులు లెవెల్2 అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. రిజర్వేషన్లు గుర్తించే బాధ్యత ఆర్డీఓలదే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు గుర్తించే బాధ్యత ఆర్డీఓలపై ఉంటుందని పేర్కొన్నారు. జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తదుపరి మాత్రమే రిజర్వేషన్ ధ్రువీకరించి ప్రకటించాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహించే ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పొరపాటు జరిగినా ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, తగు జాగ్రత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కొత్త గ్రామ పంచాయతీల గుర్తింపు, పాత పంచాయతీల వివరాలతో జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనలు ఎలాంటి మార్పులు లేకుండా ప్రభుత్వం ఆమోదించిందని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక సమాచారం అందుతుందని అన్నారు. ముఖ్యంగా ఓటర్లు ఏ వార్డుకు సంబంధించిన వారు అదే వార్డుల్లో ఉండే విధంగా చూడాలని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు తయారు చేసిన జాబితాను ఎంపీడీఓలు పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి, డీఆర్ఓ యాదిరెడ్డి, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు మోహన్‌రావు, భిక్షునాయక్, డీపీఓ రామ్మోహన్‌రాజు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎండబ్ల్యూఓ శ్రీనివాస్, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూలో ప్రకంపనలు
సాక్షి, విశాఖపట్నం : అడ్డగోలు ఆర్డర్లు జారీ చేసి అడ్డంగా బుక్కయిన విశాఖ మాజీ ఆర్డీవో వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు నమోదుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలే ఓ వైపు ఏసీబీ దాడులు, మరో వైపు సిట్ దర్యాప్తుతో జిల్లా రెవెన్యూ శాఖ పరువు పాతాళానికి చేరుకోగా తాజాగా ఆర్డీవో వ్యవహారం రెవెన్యూ వర్గాలను మరింత కుంగదీస్తోంది. ఆర్డీవోను సరెండర్ చేయడంతోపాటు కలెక్టర్ సిఫార్సుతో సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా క్రిమినల్ కేసుకు అనుమతి ఇవ్వడాన్ని రెవెన్యూ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. క్వాసీ జ్యుడీషియల్ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం లేదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో న్యాయసలహాతో ముందుకు వెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుండగా, ఎలాగైనా క్రిమినల్ కేసు నమోదు కాకుండా అడ్డుకోవాలని రెవెన్యూ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విశాఖ బ్రాంచ్ అధ్యక్షుడు పీవీఎల్ఎన్ గంగాధరరావు, కార్యదర్శి పి.చంద్రశేఖరరావు నేతృత్వంలో రెవెన్యూ ప్రతినిధుల బృందం ఆదివారం జేసీ సృజన ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్చార్జి ఆర్డీవో గోవిందరాజులతోపాటు ఏపీ జేఏసీ (అమరావతి) జిల్లా చైర్మన్ ఎస్.నాగేశ్వరరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఎస్ ప్రకాశరావు తదితరులు జేసీని కలిసి మాజీ ఆర్డీవోపై క్రిమినల్ కేసు నమోదు విషయంలో తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తప్పుడు ఆర్డర్లుగా భావిస్తే హైకోర్టులో కొట్టేయాలే తప్ప క్రిమినల్ చర్యలకు దిగడం సరికాదని ఈ సందర్భంగా సంఘ నేతలు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎవరైనా రెవెన్యూ ఉద్యోగులు క్వాసీ జ్యుడీషియల్ అధికారంతో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏమైనా తప్పులున్నట్లయితే వాటిని పై కోర్టుల అపీల్ చేసుకోవాలని, అంతేగాని క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. ఇదే విషయాన్ని వేర్వేరు కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశాయని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే ఏ అధికారినైనా ప్రభుత్వానికి సరెండర్ చేయడం లేదా సస్పెన్షన్ వేయడాన్ని తాము తప్పుబట్టబోమని, డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఇచ్చిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తాము అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో తొందరుపాటు చర్యగా భావిస్తున్నామని, తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆర్డర్లుగా పేర్కొంటున్నవాటిపై అంకా పూర్తిస్థాయి విచారణనే మొదలు కాలేదని, సదరు ఆర్డర్లను పై కోర్టులో రద్దు పరచలేదని, అంతే కాకుండా ఈ వ్యవహారంపై విచారాణాధికారి నియామకం కూడా జరగలేదని ఈ దశలో క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆక్షేపణీయమన్నారు. దీనిపై స్పందించిన జేసీ సృజన న్యాయపరమైన సలహా తీసుకున్న తరువాతే క్రిమినల్ కేసు నమోదు విషయంలో తాము ముందుకు వెళ్తామని, ఎవరూ సందేహపడనవసరంలేదని చెప్పారు. జేసీని కలిసినవారిలో సంఘ నేతలు ఎస్.ఎ.త్రినాథరావు, డి.రాజేంద్రవర్మ, పి.శ్యామ్ ప్రసాద్, పి.వి.రత్నం, సీహెచ్ వెంకటరమేష్, బీఎస్ఎస్ ప్రసాద్, ఎస్డీసీ జవహర్లాల్ నెహ్రూ, తహశీల్దార్లు సుధాకర్ నాయుడు, నాగభూషణం తదితరులు ఉన్నారు. -
ఏపీలోనూ విస్తారంగా వర్షాలు
-
ఏపీలోనూ విస్తారంగా వర్షాలు
సాక్షి నెట్వర్క్: ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. విజయనగరంలోని పూసపాటిరేగ, భోగాపురంలో 4 నుంచి 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది. పార్వతీపురం డివిజన్లో సాలూరులో గంటపాటు భారీవర్షం పడింది. విశాఖపట్నంలోని కోట ఉరట్లలో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదుకాగా.. ఐదు మండలాల్లో ఎలాంటి వర్షపాతం కురవలేదు. భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమై కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బుధవారం కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. విజయవాడలో భారీ వర్షం పడింది. రెడ్డిగూడెంలో అత్యధికంగా 75.8 మిల్లీమీటర్లు కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 6.0 మిల్లీమీటర్లుగా నమోదైంది. గడచిన 24 గంటల్లో తునిలో 11 సెం.మీ., కొయ్యలగూడెంలో 9, పోలవరం, తెర్లాంలలో 7, పాలేరు, పగిడ్యాల, శ్రీశైలంలలో 6, ప్రత్తిపాడు, ఆత్మకూరులలో 5, నందిగామ, మార్కాపురంలలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది.