సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రతిపాదిత నిందితులకు నోటీసులను, ఈ కేసుకు సంబంధించిన ప్రతులను అందజేసేలా చూడాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ), ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు దాఖలు చేసిన మెమోను తిరస్కరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(ఏ–4), బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి(ఏ–5), కేరళకు చెందిన జగ్గుస్వామి(ఏ–6), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్(ఏ–7)ను నిందితులుగా చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవని.. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టుల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవన్న ఏసీబీ కోర్టు మెమోను తిరస్కరించింది. లంచ్ మోషన్ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ బుధవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్, పీపీ ప్రతాప్‌రెడ్డి, భూసారపు శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది రామచందర్‌రావు వాదనలు వినిపించారు.
‘ఈ కేసుకు సంబంధించి పలు విచారణలు ఇదే హైకోర్టు సాగుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా దీనిపై విచారణ జరిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ కోర్టు మెమోను ఎలా తిరస్కరిస్తుంది. అసలు మెమోను తిరస్కరించే అధికారం ఏసీబీ కోర్టుకు లేదు. వెంటనే ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. ఒక్క రోజు ఆలస్యమైనా అది సిట్ విచారణపై ప్రభావం చూపుతుంది’అని ఏజీ చెప్పారు.
‘పిటిషన్‌కు సంబంధించిన వివరాల ప్రతులను నాకు ఇవ్వకపోవడం సరికాదు. దీంతో పిటిషన్‌లో అసలు ఏముందో చూడలేకపోయాను. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. శ్రీనివాస్‌కు కనీసం నోటీసులైనా జారీ చేయకుండా విచారణ ఎలా చేస్తారు’అని రామచందర్‌రావు ప్రశ్నించారు. ఈయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. నోటీసుల జాబితాలో శ్రీనివాస్ పేరును కూడా చేర్చాలని సిట్ ఆదేశించారు. నిందితులుగా చేర్చబోయే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. అలాగే వారికి కేసు వివరాలను కూడా అందజేయాలని ఏజీకి స్పష్టం చేశారు. విచారణను నేటికి (గురువారం) వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment