సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా రెవెన్యూ సిబ్బందిని ఖరారు చేసింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాలకు సిబ్బంది సంఖ్యను నిర్దేశించిన ప్రభుత్వం.. డీఆర్‌ఓ మొదలు చైన్‌మెన్ వరకు ఉద్యోగుల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. 2016, ఆక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన (ఆర్డర్ టు సర్వ్) కొత్త జిల్లాలకు ఉద్యోగులను విభజించింది. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్న ఉద్యోగులకు గతేడాది బదిలీల ద్వారా కొంత వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ, జిల్లాల వారీగా సిబ్బంది సంఖ్యను నిర్ధారించకపోవడంతో రెవెన్యూ విభాగంలో గందరగోళం నెలకొంది. తాజాగా ఈ సంఖ్యపై స్పష్టత రావడంతో ఖాళీగా ఉన్న పోస్టులు తేల నున్నాయి.
రెవెన్యూలో..
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు కలెక్టరేట్ మొదలు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలతో కలుపుకొని 474 మంది అవసరమని రెవెన్యూశాఖ నిర్ధారించింది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ), డిప్యూటీ కలెక్టర్లు/ఆర్డీవో, పరిపాలనా అధికారులు/తహసీల్దార్లు, సీనియర్ స్టెనో గ్రాఫర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూని యర్ స్టెనోగ్రాఫర్లు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్, జమేదార్లు, ఆఫీస్ గుమస్తాలు, చౌకీదార్లు, డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు, మండల గణాంక అధికారులు, మండల సర్వేయర్లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, చైన్‌మెన్లు.. ఇలా మొత్తం 18 కేటగిరీల్లో సిబ్బందిని పంపిణీ చేశారు.
తద్వారా రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే సర్వే ల్యాండ్ రికార్డుల విభాగానికి కూడా ఉద్యోగులను ఖరారు చేశారు. పునర్విభజనకు ముందు జిల్లాలో పనిచేసిన రెవెన్యూ ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేశారు. రంగారెడ్డి జిల్లాతోపాటు మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు కూడా సిబ్బందిని సర్దుబాటు చేయాల్సిరావడంతో అన్ని చోట్ల ఉద్యోగుల కొరత ఏర్పడింది. తాజాగా నిర్ధారించిన కేడర్ స్ట్రెంత్‌లో వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో మన జిల్లాలోని ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోనూ ఇదే పరిస్థిత నెలకొంది.
ఆర్డీఓల్లో టాప్
తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా ఆర్డీఓలు కలిగి ఉన్న జిల్లా మనదే కావడం విశేషం. ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండడంతో దానికి అనుగుణంగా డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం కేటాయించింది. తహసీల్లార్ద విషయానికి వస్తే అత్యధిక మండలాలు ఉన్న నల్లగొండ తర్వాత మన జిల్లాకు 38 పోస్టులను ఖరారు చేసింది. జిల్లాకు అత్యధికంగా ఏడుగురు రికార్డు అసిస్టెంట్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment