Reorganization districts
-
474 మంది ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా రెవెన్యూ సిబ్బందిని ఖరారు చేసింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాలకు సిబ్బంది సంఖ్యను నిర్దేశించిన ప్రభుత్వం.. డీఆర్ఓ మొదలు చైన్‌మెన్ వరకు ఉద్యోగుల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. 2016, ఆక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన (ఆర్డర్ టు సర్వ్) కొత్త జిల్లాలకు ఉద్యోగులను విభజించింది. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్న ఉద్యోగులకు గతేడాది బదిలీల ద్వారా కొంత వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ, జిల్లాల వారీగా సిబ్బంది సంఖ్యను నిర్ధారించకపోవడంతో రెవెన్యూ విభాగంలో గందరగోళం నెలకొంది. తాజాగా ఈ సంఖ్యపై స్పష్టత రావడంతో ఖాళీగా ఉన్న పోస్టులు తేల నున్నాయి. రెవెన్యూలో.. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు కలెక్టరేట్ మొదలు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలతో కలుపుకొని 474 మంది అవసరమని రెవెన్యూశాఖ నిర్ధారించింది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ), డిప్యూటీ కలెక్టర్లు/ఆర్డీవో, పరిపాలనా అధికారులు/తహసీల్దార్లు, సీనియర్ స్టెనో గ్రాఫర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూని యర్ స్టెనోగ్రాఫర్లు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్, జమేదార్లు, ఆఫీస్ గుమస్తాలు, చౌకీదార్లు, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, మండల గణాంక అధికారులు, మండల సర్వేయర్లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, చైన్మెన్లు.. ఇలా మొత్తం 18 కేటగిరీల్లో సిబ్బందిని పంపిణీ చేశారు. తద్వారా రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే సర్వే ల్యాండ్ రికార్డుల విభాగానికి కూడా ఉద్యోగులను ఖరారు చేశారు. పునర్విభజనకు ముందు జిల్లాలో పనిచేసిన రెవెన్యూ ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేశారు. రంగారెడ్డి జిల్లాతోపాటు మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు కూడా సిబ్బందిని సర్దుబాటు చేయాల్సిరావడంతో అన్ని చోట్ల ఉద్యోగుల కొరత ఏర్పడింది. తాజాగా నిర్ధారించిన కేడర్ స్ట్రెంత్‌లో వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో మన జిల్లాలోని ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోనూ ఇదే పరిస్థిత నెలకొంది. ఆర్డీఓల్లో టాప్ తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా ఆర్డీఓలు కలిగి ఉన్న జిల్లా మనదే కావడం విశేషం. ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండడంతో దానికి అనుగుణంగా డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం కేటాయించింది. తహసీల్లార్ద విషయానికి వస్తే అత్యధిక మండలాలు ఉన్న నల్లగొండ తర్వాత మన జిల్లాకు 38 పోస్టులను ఖరారు చేసింది. జిల్లాకు అత్యధికంగా ఏడుగురు రికార్డు అసిస్టెంట్లను కేటాయించారు. -
మారిన జిల్లాల పేర్లపై ఉత్తర్వులు
తప్పుగా పేర్కొన్న మండలాలు, గ్రామాల పేర్ల సవరణ సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన అనంతరం జారీ చేసిన తుది నోటిఫికేషన్లో గల్లంతైన మండలాలు, వాటి పరిధిలోని గ్రామాల వివరాలను జత చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తుది ప్రకటనలో పేర్కొన్న కొన్ని జిల్లాల పేర్లను ప్రభుత్వం తర్వాత సవరించింది. ఈ పేర్లను మరోసారి వెల్లడిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. దీంతోపాటు అప్పట్లో తప్పుగా పేర్కొన్న మండలాలు, గ్రామాల పేర్లను సవరించింది. తొలుత కొమురం భీం జిల్లాగా పేర్కొంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ... కుమురంభీం జిల్లాగా మార్చారు. జోగులాంబ జిల్లాను జోగులాంబ గద్వాల జిల్లాగా సవరించారు. యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరిగా మార్చారు. భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా మార్చారు. రాజన్న జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి తుది నోటిఫికేషన్లో కొండపాక, మిర్దొడ్డి, తొగుట మండలాల పేర్లను విస్మరించారు. ఇప్పుడా మూడు మండలాలను, వాటి గ్రామాల్లోని పేర్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొండపాక మండలంలో అంకిరెడ్డిపల్లి, కొండ పాక, కోనాయపల్లి, కుకునూరుపల్లి, గిరాయిపల్లి, జప్తి నాచారం, తిప్పారం, తిమ్మారెడ్డిపల్లి, దుద్దెడ, బందారం, మంగోల్, మత్పల్లి, మేదినీపూర్, మర్పడగ, ముద్దాపూర్, ఎర్రవల్లి, లకుడారం, వెలికట్ట, విశ్వనాధపల్లి, సింగారం, సిరిసినగండ్ల గ్రామాలను సిద్దిపేట జిల్లాలో చేర్చారు. మిర్దొడ్డి మండలానికి సంబంధించి ధర్మారం, కొండాపూర్, మిర్దొడ్డి, కాసులాబాద్, మోతె, అల్వాల్, మల్లుపల్లి, చేప్యాల్, అందె, లింగుపల్లి, రుద్రారం, ఖాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాస్పూర్, భూంపల్లి, కూడవెల్లి తదితర గ్రామాలను చేర్చారు. తొగుట మండలంలో ఘనాపూర్, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసాన్‌పల్లి, తుక్కాపురం, కనగల్, గుడికందుల, లింగంపేట, తొగుట, చందాపూర్, వెంకట్రావుపేట, లింగాపూర్, జప్తి లింగారెడ్డిపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలను చేర్చారు. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాలను మండలాల పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటిదాకా గట్టు మండల పరిధిలో ఉన్న అప్కొండనహళ్లిని కె.టి.దొడ్డి మండలంలోకి, ముస్లింపల్లిని గట్టు మండలంలో చేర్చారు. శాలీపూర్, ఖానాపూర్ గ్రామాలను ఉండవెల్లి మండలంలోకి, మంగంపేట, రాయిమాకులకుంట, పోసాలపాడు గ్రామాలను మనోపాడు మండలంలోకి మార్చారు. వనపర్తి జిల్లాకు సంబంధించి ఘర్కాస, అనపహాడు గ్రామాలను ఘన్పూర్ మండలంలోకి, లింగసానిపల్లి గ్రామాన్ని చిన్నంబావి మండలంలోకి మార్చారు. గుంపనపల్లి గ్రామాన్ని శ్రీరంగాపూర్ మండలంలోకి మార్చారు. రామేశ్వరపురం గ్రామాన్ని పెబ్బేరులోకి, అమరావతినగర్‌ను మదనపూర్ మండలంలోకి, రంగాపూర్ గ్రామా న్ని అమరచింత, ఏదుల గ్రామాన్ని గోపాలపేట గ్రామంలోకి మార్చారు. -
సిటీతో పీటముడి
♦ వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి కొనసాగింపు ♦ ఈ జిల్లా పరిధిలోకి కొడంగల్ నియోజకవర్గం ♦ శివార్లను జంటనగరాల్లో కలిపే అంశంపై సందిగ్ధత ♦ ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని సూచన ♦ జంట జిల్లాలపై మరోసారి చర్చించాలని నిర్ణయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దసరా నాటికి కొత్త జిల్లాలు మనుగడలోకి తేవాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రోడ్‌మ్యాప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాప్రతినిధులు, అఖిలపక్షం అభిప్రాయాలను కూడా గమనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేసింది. అంతకుమునుపు ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాలను భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు పంపాలని కలెక్టర్లకు నిర్దేశించింది. మండలాల విభజనపై కూడా శాస్త్రీయత పాటించాలని, గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించింది. తర్వాత మాట్లాడుదాం! వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం.. శివారు ప్రాంతాలను కలుపుతూ ఏ జిల్లాను ఏర్పాటు చేయాలనే అంశంపై మాత్రం ఏ నిర్ణయానికి రాలేదు. కాగా, వికారాబాద్ పరిధిలోకి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని విలీనం చేయాలనే ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. ఇక శివార్లలోని నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో కలపాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ప్రతి జిల్లా పరిధిలో 4 లేదా 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండాలనే మార్గదర్శకాలు ఇక్కడ ప్రామాణికం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినందున.. హైదరాబాద్ పరిధిలోకి ఇబ్రహీంపట్నం, ఎల్బీన గర్, మహేశ్వరం నియోజకవర్గాలను చేర్చింది. అలాగే సికింద్రాబాద్ జిల్లా పరిధిలోకి రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలను తేవాలని ప్రతిపాదించింది. అయితే, ప్రతిపాదిత సికింద్రాబాద్ జిల్లా జనాభా 42,51,614, హైదరాబాద్ జిల్లా జనాభా 39,01,928 ఉండడం పరిపాలనాపరంగా శ్రేయస్కరం కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే శివారు ప్రాంతాలను హైదరాబాద్‌తో కలిపి ఎన్ని జిల్లాలను చేయాలనే అంశంపై పీటముడి నెలకొంది. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా(శివారు)ను ఎన్ని జిల్లాలుగా ప్రకటించాలనే అంశంపై తర్వాత చర్చిద్దామని చర్చను వాయిదా వేశారు. కాగా, ఈ నెల 20న జరగనున్న కలెక్టర్ల సమావేశంలోపు సమగ్ర నివేదికను సీసీఎల్ఏకు అందజేయాలని నిర్దేశించిన నేపథ్యంలో ఆలోగా శివారు ప్రాంతాల భవితవ్యం తేలిపోనుంది. కాగా, జంట జిల్లాల్లో కొత్తగా ఎన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనేదానిపై సీఎం దగ్గర బ్లూప్రింట్ ఉందని, దానికి అనుగుణంగానే జిల్లాల ప్రకటన ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోపు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చే యనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినందున.. ఇక కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతమైనట్లుగానే భావించవచ్చు. కొత్తగా కోట్‌పల్లి మండలాల పునర్విభజనలో కోట్‌పల్లికి చోటు దక్కింది. పెద్దేముల్ మండలంలోని కోట్‌పల్లిని కొత్త మండలంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇక వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు ఉండనున్నాయి. వీటికి అదనంగా కొడంగల్ సెగ్మెంట్ కలవనున్నాయి. -
కొత్త జిల్లా వికారాబాద్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా రెండుగా విడిపోనుంది. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకానుంది. జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... తొలిదశలో వికారాబాద్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పంపాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)ను ఆదేశించింది. దీంతో జిల్లాగా మార్చాలనే వికారాబాద్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌కు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, ఆచరణలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన సర్కారు.. అధికారంలోకి వస్తే వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తామనే హామీని మొదట నెరవేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి పేరిట 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. అప్పట్లో కేవలం 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా గణన ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాలు కాస్త 14 సెగ్మెంట్లుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం పేర జిల్లాను విభజించాలనే చ ర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా ఈప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో... వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. ఐదు నియోజకవర్గాలు.. సగటున ఐదు నియోజకవర్గాలకు ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ పరిధిలోకి ఐదు నియోజకవర్గాలు వచ్చే అవకాశముంది. జిల్లా సరిహద్దులోని కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా వికారాబాద్ జిల్లాలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇదిలావుండగా, త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా ఉండడంతో సరిహద్దులు, భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకోవాలని యంత్రాంగం భావిస్తోంది. జిల్లా ఏర్పడిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగి... ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళితే ఎలా అనే అంశంపై చర్చిస్తోంది. డీలిమిటేషన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాల ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అప్పటివ రకు జిల్లాల జోలికి పోకపోవడమే మంచిదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గమే ప్రాతిపదికగా జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టత వస్తే జిల్లాల ప్రతిపాదనలు ముందుకెళ్తాయని, లేనిపక్షంలో గందరగోళానికి తావిచ్చే అవకాశంలేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.