సిటీతో పీటముడి
♦ వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి కొనసాగింపు
♦ ఈ జిల్లా పరిధిలోకి కొడంగల్ నియోజకవర్గం
♦ శివార్లను జంటనగరాల్లో కలిపే అంశంపై సందిగ్ధత
♦ ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని సూచన
♦ జంట జిల్లాలపై మరోసారి చర్చించాలని నిర్ణయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దసరా నాటికి కొత్త జిల్లాలు మనుగడలోకి తేవాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రోడ్‌మ్యాప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై ప్రజాప్రతినిధులు, అఖిలపక్షం అభిప్రాయాలను కూడా గమనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేసింది. అంతకుమునుపు ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాలను భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు పంపాలని కలెక్టర్లకు నిర్దేశించింది. మండలాల విభజనపై కూడా శాస్త్రీయత పాటించాలని, గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించింది.
తర్వాత మాట్లాడుదాం!
వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం.. శివారు ప్రాంతాలను కలుపుతూ ఏ జిల్లాను ఏర్పాటు చేయాలనే అంశంపై మాత్రం ఏ నిర్ణయానికి రాలేదు. కాగా, వికారాబాద్ పరిధిలోకి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని విలీనం చేయాలనే ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. ఇక శివార్లలోని నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో కలపాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ప్రతి జిల్లా పరిధిలో 4 లేదా 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండాలనే మార్గదర్శకాలు ఇక్కడ ప్రామాణికం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినందున.. హైదరాబాద్ పరిధిలోకి ఇబ్రహీంపట్నం, ఎల్‌బీన గర్, మహేశ్వరం నియోజకవర్గాలను చేర్చింది.
అలాగే సికింద్రాబాద్ జిల్లా పరిధిలోకి రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాలను తేవాలని ప్రతిపాదించింది. అయితే, ప్రతిపాదిత సికింద్రాబాద్ జిల్లా జనాభా 42,51,614, హైదరాబాద్ జిల్లా జనాభా 39,01,928 ఉండడం పరిపాలనాపరంగా శ్రేయస్కరం కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే శివారు ప్రాంతాలను హైదరాబాద్‌తో కలిపి ఎన్ని జిల్లాలను చేయాలనే అంశంపై పీటముడి నెలకొంది. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా(శివారు)ను ఎన్ని జిల్లాలుగా ప్రకటించాలనే అంశంపై తర్వాత చర్చిద్దామని చర్చను వాయిదా వేశారు.
కాగా, ఈ నెల 20న జరగనున్న కలెక్టర్ల సమావేశంలోపు సమగ్ర నివేదికను సీసీఎల్‌ఏకు అందజేయాలని నిర్దేశించిన నేపథ్యంలో ఆలోగా శివారు ప్రాంతాల భవితవ్యం తేలిపోనుంది. కాగా, జంట జిల్లాల్లో కొత్తగా ఎన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనేదానిపై సీఎం దగ్గర బ్లూప్రింట్ ఉందని, దానికి అనుగుణంగానే జిల్లాల ప్రకటన ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోపు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చే యనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినందున.. ఇక కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతమైనట్లుగానే భావించవచ్చు.
కొత్తగా కోట్‌పల్లి
మండలాల పునర్విభజనలో కోట్‌పల్లికి చోటు దక్కింది. పెద్దేముల్ మండలంలోని కోట్‌పల్లిని కొత్త మండలంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇక వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు ఉండనున్నాయి. వీటికి అదనంగా కొడంగల్ సెగ్మెంట్ కలవనున్నాయి.