కొత్త జిల్లా వికారాబాద్! | first phase of reorganization districts is vikarabad | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లా వికారాబాద్!

Published Thu, Sep 11 2014 11:25 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

first phase of reorganization districts is vikarabad

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  రంగారెడ్డి జిల్లా రెండుగా విడిపోనుంది. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకానుంది. జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... తొలిదశలో వికారాబాద్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పంపాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)ను ఆదేశించింది. దీంతో జిల్లాగా మార్చాలనే వికారాబాద్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌కు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది.

 ప్రస్తుత జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, ఆచరణలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన సర్కారు.. అధికారంలోకి వస్తే వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తామనే హామీని మొదట నెరవేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి పేరిట 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది.

అప్పట్లో కేవలం 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా గణన ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాలు కాస్త 14 సెగ్మెంట్లుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం పేర జిల్లాను విభజించాలనే చ ర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా ఈప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో... వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది.

 ఐదు నియోజకవర్గాలు..
 సగటున ఐదు నియోజకవర్గాలకు ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ పరిధిలోకి ఐదు నియోజకవర్గాలు వచ్చే అవకాశముంది. జిల్లా సరిహద్దులోని కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా వికారాబాద్ జిల్లాలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

 ఇదిలావుండగా, త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా ఉండడంతో సరిహద్దులు, భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకోవాలని యంత్రాంగం భావిస్తోంది. జిల్లా ఏర్పడిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగి... ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళితే ఎలా అనే అంశంపై చర్చిస్తోంది. డీలిమిటేషన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాల ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అప్పటివ రకు జిల్లాల జోలికి పోకపోవడమే మంచిదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గమే ప్రాతిపదికగా జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టత వస్తే జిల్లాల ప్రతిపాదనలు ముందుకెళ్తాయని, లేనిపక్షంలో గందరగోళానికి తావిచ్చే అవకాశంలేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement