ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవలే షెడ్యూల్ ప్రకటించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఎన్నికల సంఘం.. నవంబర్‌లో నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధం కావాలని సూచించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ స్పీడుగా జరుగుతోంది. 2018 నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్లలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
ఇప్పటికే పలువురు జాయింట్ కలెక్టర్లు, టీఆర్‌వోలు, ఆర్‌డీవోలు, ఏసీపీ/డీసీపీలను, సీఐలను బదిలీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 ఎస్సైఐ, సీఐలతోపాటు పలువురిని బదిలీ చేశారు. మరో ఐదుగురు ఉన్నతాధికారులతోపాటు 32 మంది తహసీల్దార్లు, పలువురు సీఐ, ఎస్సైల బదిలీ జాబితా నేడో రేపో వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం. కాగా.. తాజాగా ఓటర్ల జాబితాను కూడా జిల్లాల వారీగా ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో ఓ వైపు బదిలీలు.. మరోవైపు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ఆరా తీస్తుండగా, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఓ వైపు ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో మూడేళ్లపాటు పనిచేసిన సీఐలు, ఎస్‌ఐలను బదిలీ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. మరోవైపు గ్రామాల్లో శాంతిభద్రతల వ్యవహారంపై దృష్టి సారించాలని ఆదేశించింది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఓ ప్రశ్నావళిని పంపిన ఎన్నికల సంఘం వీలైనంత తొందరలో నివేదిక పంపాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రెండు రోజుల కింద జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికలు రెండు విడతల్లో జరుగగా.. ఆ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్ని బైండోవర్లు చేశారు..? రౌడీషీటర్లు ఎంతమంది ఉన్నారు..? ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు ఎన్ని..? వీటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి..? తుపాకీ అనుమతులు ఎంతమందికి ఉన్నాయి..? తదితర వివరాలు పూర్తిస్థాయిలో సేకరించి ఆ అంశాలను నివేదికలో పేర్కొనాలని ఆ ఉత్తర్వులో ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల సీపీ/ఎస్పీలు ఈ సమాచార సేకరణ బాధ్యతలను ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలకు అప్పగించినట్లు తెలిసింది. గ్రామానికి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున పంపిన పోలీసు యంత్రాంగం ఆ సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. పోలీసుల వద్ద ఇదివరకే ఉన్న అంశాలను ఎన్నికల సంఘానికి పంపినా వచ్చే ఎన్నికల్లో శాంతిభద్రతల అంశమే కీలకం కావడంతో మరో తాజాగా నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికార్ల జాబితా సిద్ధం.. నేడో రేపో ఎన్నికల బదిలీల ఉత్తర్వులు..
జిల్లాలో మళ్లీ అధికారుల స్థాయిలో బదిలీ సందడి మొదలు కానుంది. ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా స్థా యిలో అధికారుల బదిలీలు పచ్చజెండా ఊపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 8తో కూడిన ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి పేరు మీద విడుదల కాగా ఇప్పటికే పలువురు ఎస్సైలతోపాటు పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి.
జాయింట్ కలెక్టర్లు, డీఆర్‌వోలు, ఆర్‌డీవోలు, అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, డీఎస్‌పీలతోపాటు ఇతర శాఖల అధికారులు బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురి బదిలీ లు జరిగే అవకాశం ఉండగా, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను క్యాడర్‌ను బట్టి పాత వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు, హైదరాబాద్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. అదే విధంగా మూడేళ్లు పూర్తయిన 32 మంది తహసీల్దార్లు, తొమ్మిది మంది పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతోపాటు పలువురికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బదిలీల కసరత్తును పూర్తి చేసిన ఉన్నతాధికారులు నేడో రేపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని కూడా తెలిసింది.
బదిలీలకు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలివి..
- శాసనసభ ముందస్తు ఎన్నికల విధుల్లో పాల్గొంటు న్న అధికారులు సొంత జిల్లాల్లో కొనసాగరాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది.
- 2018, నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలి.
- ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
- బదిలీల్లో భాగంగా సొంత జిల్లాలకు ఎవరినీ పంపించరాదు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు/ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం/జిల్లా పరిధిలో పని చేసిన జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆపై హోదా కలిగిన అధికారులు మళ్లీ అదే నియోజకవర్గం/జిల్లా పరిధిలో కొనసాగరాదు.
- ఈ బదిలీల ప్రక్రియను ఈనెల 17లోగా పూర్తి చేసి, నివేదిక ఎన్నికల సంఘానికి సమర్పించాలి.
- జిల్లాస్థాయిలో ఎన్నికలతో నేరుగా సంబంధం ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల నోడల్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు ఈ బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
- ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లతో సంబంధమున్న సీపీ/ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లకు సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment