వివేకా హత్య కేసు: దోషులని నిర్ణయించుకుని.. అదే లక్ష్యంగా దర్యాప్తు  | Arguments Of Lawyers Of Ys Bhaskar Reddy And Uday Kumar In Cbi Court | Sakshi
Sakshi News home page

వివేకా హత్య కేసు: దోషులని నిర్ణయించుకుని.. అదే లక్ష్యంగా దర్యాప్తు 

Published Tue, Apr 18 2023 9:11 AM | Last Updated on Tue, Apr 18 2023 9:18 AM

Arguments Of Lawyers Of Ys Bhaskar Reddy And Uday Kumar In Cbi Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొందరిని దోషులుగా నిర్ణయించుకుని, అదే లక్ష్యంగా దర్యాప్తు చేస్తోంది తప్ప.. అసలు నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయడంలేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ల న్యాయవాదులు సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సీహెచ్‌ రమేశ్‌బాబు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.

భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ కస్టడీ పిటిషన్‌తో పాటు ఉదయ్‌కుమార్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. భాస్కర్‌రెడ్డి తరఫున ఉమామహేశ్వర్, ఉదయ్‌ తరఫున రవీందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఏ–4 (దస్తగిరి) చెప్పాడని వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి భాస్కర్‌రెడ్డి, అవినాశ్, శివశంకర్‌రెడ్డితో వివేకాకు విభేదాలున్నాయని పేర్కొన్నారు. హత్య కోసం రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందని, రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఈ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. రిమాండ్‌ పిటిషన్‌లోని సబ్జెక్ట్‌ను మార్చి కస్టడీ పిటిషన్‌గా వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను పాటించకుండా ఇష్టం వచ్చినట్లు పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక్క కస్టడీ అన్న పదం తప్ప రెండు పిటిషన్లు ఒక్కటే. 75 ఏళ్ల వృద్ధుడైన భాస్కర్‌రెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచారు. విచారణలో ఏం అడిగారు, ఆయన ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదో తెలపకుండా.. సహకరించలేదని అనడం సరికాదు. సీబీఐ కోరుకున్న విధంగా ఆయన సమాధానాలు వెల్లడించరు. అలాగే సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జీషీట్లలోనూ భాస్కర్‌రెడ్డి ప్రస్తావన కూడా లేదు.

ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసి నిందితుల జాబితాలో చేరుస్తున్నారు. ఇంకా ఎంత మందిని కోర్టు అనుమతి లేకుండా ఇలా చేరుస్తారో తెలియదు. సాక్షులు ఎవరన్నది కూడా పిటిషన్‌లో లేదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్‌రెడ్డి వెన్నెముకకు సర్జరీ జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. భాస్కర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఉమామహేశ్వర్‌ వాదించారు.

అరెస్టులతో హడావుడి 
‘ఉదయ్‌కుమార్‌ను ఏ నేరం కింద అరెస్టు చేశారో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. సీఆర్‌పీసీ 173 ప్రకారం.. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే ఏ–6 (ఉదయ్‌కుమార్‌), ఏ–7 (వైఎస్‌ భాస్కర్‌రెడ్డి)లను నిందితులుగా పేర్కొనాలి. కానీ కోర్టు నుంచి సీబీఐ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఏ–6పై నమోదు చేసిన అన్ని సెక్షన్లు బెయిల్‌ ఇచ్చేవే. ఇప్పటికి 22 సార్లు సీబీఐ ఉదయ్‌కుమార్‌ను విచారించింది. అతని మొబైల్‌ తీసుకున్న అధికారులు రసీదు కూడా ఇవ్వ­లేదు. ఇన్నిసార్లు విచారణ జరిపి.. ఇంకా సహకరించలేదనడం హాస్యాస్పదం.

తెలియని ప్రశ్నలకు సమా«­­దానం చెప్పకపోవడం అతని హక్కు. సీబీఐ మూడేళ్లుగా విచారణ చేస్తున్నా రెండు చార్జిషీట్లు వేయ­డం తప్ప సాధించిన పురోగతి లేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు దగ్గరపడుతుండటంతో అరెస్టులు చేస్తున్నారు తప్ప ఆధారాలను సేకరించడం­లేదు. చట్టాలను పాటించడం లేదు. సీబీఐ విచా­రణాధికారి రాంసింగ్‌పై ఉదయ్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
చదవండి: దస్తగిరితో డ్రామా! అప్రూవర్‌ వాంగ్మూలం ఉత్త కథే

ఉదయ్‌ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆయ­నపై మోపినవి నాన్‌–కాగ్నిజబుల్‌ నేరాలే. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయ్‌కి బెయిల్‌ ఇవ్వాలి’ అని రవీందర్‌రెడ్డి కోరారు. ‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి వివేకాతో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కార­ణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు’ అని సీబీఐ పీపీ వాదనలు వినిపించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement