► వర్దాతో భారీగా పంటనష్టం
► 28వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంట
► త్వరలో సాయం
► మృతుల కుంటుంబాలకు రూ.4 లక్షలు
► మరో గండం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం
► రెవెన్యూ మంత్రి ఆర్‌బీ.ఉదయకుమార్
► ముందస్తు చర్యలతో తగ్గిన ప్రాణనష్టం
సాక్షి, చెన్నై : అసలే తీవ్ర కష్టాల్లో ఉన్న అన్నదాతను వర్దా మరింతగా దెబ్బతీసింది. మూడు జిల్లాల్లోని రైతులకు కన్నీళ్లు మిగిల్చే రీతిలో వర్దా విలయతాండవం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల మేరకు 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. త్వరలో బాధితులకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మరో గండం ముంచుకొస్తోందన్న ఆందోళన వద్దని, ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు ముందస్తుగానే సిద్ధం చేశామని ప్రకటించింది. తాజాగా తీసుకున్న ముందస్తు చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు తెలిపింది.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ని అన్నదాతలు పంట సాగును పక్కనబెట్టి వలసబాట పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొందరు రైతులు సాహసం చేస్తుండగా, మరి కొందరు బతుకు బండి లాగించేందుకు పొలం బాట పడుతున్నారు. డెల్టా అన్నదాతలు కావేరి నీళ్లు అందక తీవ్ర కష్టాల్లో ఉంటే, దక్షిణాది, కొంగు మండలం రైతులు వర్షాలు కరువై కన్నీటి మడుగులో మునిగారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని రైతులను వర్దా ముంచేసిందని చెప్పవచ్చు. ఏ మేరకు పంటనష్టం జరిగిందో ఆ వివరాలు ప్రభుత్వం గుప్పెట్లోకి చేరడం బట్టి చూస్తే, ఏ మేరకు అన్నదాతలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.
28 వేల హెక్టార్లలో పంటనష్టం: సోమవారం ఎళిలగంలో రెవెన్యూ మంత్రి ఆర్‌బీ.ఉదయకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వర్దా రూపంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఏ మేరకు పంటనష్టం జరిగిందో వివరాలను సేకరించినట్టు తెలిపారు. మొత్తం 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని, రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందరికీ త్వరలో నష్ట పరిహారం అందిస్తామన్నారు. 529 పశువులు, 299 మేకలు, 33 వేల కోళ్లు వర్దా ధాటికి మరణించాయని వివరించారు. 70 వేల గుడిసెలు దెబ్బతిన్నాయని, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో అందించేందుకు ముమ్మరంగా చర్యలు సాగుతున్నాయన్నారు. ఆరుగురు మంత్రులు స్వయంగా పనుల్ని పర్యవేక్షిçస్తున్నారని వివరించారు.
మరో గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం
వర్దా ముప్పును ముందే గుర్తించి, ముందస్తుగా తీసుకున్న చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌బీ.ఉదయకుమార్ పేర్కొన్నారు. ఈ ధాటికి 24 మంది మరణించారని, ఈ కుటుంబాలను ఆదుకునేందుకు తలా రూ.4 లక్షలు చొప్పున సాయాన్ని ఇప్పటికే ప్రకటించామన్నారు. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని గుర్తుచేశారు. దీని గురించి ఆందోళన వద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. మరో తుపాను ముప్పు తప్పదన్నట్టుగా ప్రచారం జరుగుతోందని, దీనిపై ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరో గండం ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎంకు సహకారం
సీఎం పన్నీరు సెల్వంకు తాను పూర్తి సహకారం అందిస్తున్నానని, ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆర్‌బీ ఉదయకుమార్ సమాధానమిచ్చారు. పార్టీలోనూ, అధికారంలోనూ ఒకరే నేతృత్వం వహిస్తే, ఎలాంటి విమర్శలు, ఆరోపణలు, అపోహలకు తావు ఉండదన్నదే తన అభిమతంగా వ్యాఖ్యానించారు. సీఎం పన్నీరు సెల్వం అమ్మ జయలలితకు, అన్నాడీఎంకేకు విశ్వాసపాత్రుడు అని, ఆయన నుంచి విశ్వాసం నేర్చుకున్నానని పేర్కొన్నారు.
అన్నదాతకు కన్నీళ్లే
Published Tue, Dec 20 2016 2:40 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
Advertisement
Advertisement