Verde
-
అన్నదాతకు కన్నీళ్లే
► వర్దాతో భారీగా పంటనష్టం ► 28వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంట ► త్వరలో సాయం ► మృతుల కుంటుంబాలకు రూ.4 లక్షలు ► మరో గండం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం ► రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ ► ముందస్తు చర్యలతో తగ్గిన ప్రాణనష్టం సాక్షి, చెన్నై : అసలే తీవ్ర కష్టాల్లో ఉన్న అన్నదాతను వర్దా మరింతగా దెబ్బతీసింది. మూడు జిల్లాల్లోని రైతులకు కన్నీళ్లు మిగిల్చే రీతిలో వర్దా విలయతాండవం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల మేరకు 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. త్వరలో బాధితులకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మరో గండం ముంచుకొస్తోందన్న ఆందోళన వద్దని, ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు ముందస్తుగానే సిద్ధం చేశామని ప్రకటించింది. తాజాగా తీసుకున్న ముందస్తు చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ని అన్నదాతలు పంట సాగును పక్కనబెట్టి వలసబాట పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొందరు రైతులు సాహసం చేస్తుండగా, మరి కొందరు బతుకు బండి లాగించేందుకు పొలం బాట పడుతున్నారు. డెల్టా అన్నదాతలు కావేరి నీళ్లు అందక తీవ్ర కష్టాల్లో ఉంటే, దక్షిణాది, కొంగు మండలం రైతులు వర్షాలు కరువై కన్నీటి మడుగులో మునిగారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని రైతులను వర్దా ముంచేసిందని చెప్పవచ్చు. ఏ మేరకు పంటనష్టం జరిగిందో ఆ వివరాలు ప్రభుత్వం గుప్పెట్లోకి చేరడం బట్టి చూస్తే, ఏ మేరకు అన్నదాతలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. 28 వేల హెక్టార్లలో పంటనష్టం: సోమవారం ఎళిలగంలో రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వర్దా రూపంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఏ మేరకు పంటనష్టం జరిగిందో వివరాలను సేకరించినట్టు తెలిపారు. మొత్తం 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని, రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందరికీ త్వరలో నష్ట పరిహారం అందిస్తామన్నారు. 529 పశువులు, 299 మేకలు, 33 వేల కోళ్లు వర్దా ధాటికి మరణించాయని వివరించారు. 70 వేల గుడిసెలు దెబ్బతిన్నాయని, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో అందించేందుకు ముమ్మరంగా చర్యలు సాగుతున్నాయన్నారు. ఆరుగురు మంత్రులు స్వయంగా పనుల్ని పర్యవేక్షిçస్తున్నారని వివరించారు. మరో గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం వర్దా ముప్పును ముందే గుర్తించి, ముందస్తుగా తీసుకున్న చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ పేర్కొన్నారు. ఈ ధాటికి 24 మంది మరణించారని, ఈ కుటుంబాలను ఆదుకునేందుకు తలా రూ.4 లక్షలు చొప్పున సాయాన్ని ఇప్పటికే ప్రకటించామన్నారు. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని గుర్తుచేశారు. దీని గురించి ఆందోళన వద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. మరో తుపాను ముప్పు తప్పదన్నట్టుగా ప్రచారం జరుగుతోందని, దీనిపై ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరో గండం ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంకు సహకారం సీఎం పన్నీరు సెల్వంకు తాను పూర్తి సహకారం అందిస్తున్నానని, ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆర్బీ ఉదయకుమార్ సమాధానమిచ్చారు. పార్టీలోనూ, అధికారంలోనూ ఒకరే నేతృత్వం వహిస్తే, ఎలాంటి విమర్శలు, ఆరోపణలు, అపోహలకు తావు ఉండదన్నదే తన అభిమతంగా వ్యాఖ్యానించారు. సీఎం పన్నీరు సెల్వం అమ్మ జయలలితకు, అన్నాడీఎంకేకు విశ్వాసపాత్రుడు అని, ఆయన నుంచి విశ్వాసం నేర్చుకున్నానని పేర్కొన్నారు. -
ఎగిరిన విమానాలు
► రైళ్ల సేవలకు ఆటంకాలు ►పలు రైళ్ల రద్దు ►మరికొన్ని సమయాల్లో మార్పు ►పునరుద్ధరణ చర్యలు ముమ్మరం ► ప్రయాణికులకు తీవ్ర కష్టాలు వర్దా విలయం నుంచి చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం కుదుట పడింది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ తీసుకున్నాయి. రైళ్ల సేవలకు తీవ్ర ఆటంకాలు నెలకొని ఉన్నాయి. ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ సేవలు ఆగడంతో నగర వాసులకు తీవ్ర కష్టాలు తప్పలేదు. చెన్నైకు రావాల్సిన అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను విల్లుపురం, విరుదాచలంకు పరిమితం చేశారు. ఎగ్మూర్, సెంట్రల్ నుంచి బయలు దేరాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా ముందుకు కదిలాయి. సాక్షి, చెన్నై: గత ఏడాది వరదల తాకిడికి చెన్నై విమానాశ్రయం కొన్ని రోజుల పాటుగా మూత పడ్డ విషయం తెలిసిందే. గత అనుభవాల నేపథ్యంలో ఈ సారి విమానయాన శాఖ అ›ప్రమత్తంగానే వ్యవహరించింది. ముందుగానే విమాన సేవల్ని రద్దు చేయడంతో పాటుగా, అనేక విమానాల్ని దారి మళ్లించడంతో వర్దా రూపంలో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. వర్దా రూపంలో రన్ వేలపై మూడు అడుగుల మేరకు నీళ్లు నిలవడంతో వాటిని తొలగించేందుకు భారీ మోటార్లను ఉపయోగించారు. రాత్రికి రాత్రే నీటిని అడయార్ నది వైపుగా మోటార్ల ద్వారా తరలించి, ఉదయం ఐదు గంటలకు అంతా విమానాశ్రయం తెరిచారు. అయితే, విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు మరింత సమయం తప్పలేదు. ప్రయాణికులు లేకుండా కొన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియను ట్రయల్ రన్ తో అధికారులు విజయవంతం చేశారు. భద్రతా పరంగా తీసుకున్న చర్యలు ఆశాజనకంగా ఉండడంతో, చివరకు ఢిల్లీకి నివేదికను పంపించారు. అక్కడి నుంచి అనుమతి తదుపరి తొమ్మిది గంటల నుంచి విమానాల సేవలకు శ్రీకారం చుట్టారు. అప్పటికే ఒకటి రెండు విమానాలు ల్యాండింగ్ నిమిత్తం చెన్నై పరిసరాల్లో చక్కర్లు కొట్టాయి. తొలి విమానం తొమ్మిది గంటల సమయంలో టేకాఫ్ తీసుకుంది. తదుపరి పూర్తి స్థాయిలో కాకుండా, సమయానుగుణంగా విమానాల టేకాఫ్ సాగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు యథా ప్రకారం ల్యాండింగ్ తీసుకున్నాయి. రైళ్ల సేవలకు ఆటకంతో కష్టాలు: వర్దా గాలి బీభత్సానికి రైల్వే ట్రాక్‌ల వెంబడి చెట్లు నేల కొరిగాయి. అనేక చోట్ల నీళ్లు పట్టాల్ని చీల్చుకుంటూ ముందుకు సాగడంతో ఎక్కడికక్కడ రైళ్లను అధికారులు ఆపేశారు. ప్రధానంగా చెన్నై నగరంలో ప్రధాన రైల్వే మార్గాల్లో ఎలక్ట్రిక్ రైళ్లు మంగళవారం కూడా ముందుకు కదలలేదు. చెంగల్పట్టు నుంచి తాంబరం–బీచ్ వరకు ఎలక్ట్రిక్ రైళ్లు, బీచ్ నుంచి వేళచ్చేరి వైపుగా ఎంఆర్టీఎస్ సేవలు లేక శివార్ల నుంచి నగరం వైపుగా రావాల్సిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. రోడ్ల మీద చెట్లు విరిగి పడి ఉండడంతో బస్సుల సేవలు అంతంత మాత్రంగానే సాగాయి. దీంతో బస్సుల కోసం ఆయా స్టాప్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయక తప్పలేదు. అన్నీ బస్సులు కిక్కిరిసి ముందుకు సాగాయి. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ నుంచి బయల్దేరాల్సిన అనేక రైళ్ల సేవలు ఆలస్యంగానే సాగాయి. కొన్ని రైళ్లను మంగళవారం కూడా రద్దు చేశారు. దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి చెన్నైకు ఎగ్మూర్‌కు ఉదయాన్నే రావాల్సిన రైళ్లన్నీ విల్లుపురం, విరుదాచలంకు పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానం చేరుకోలేని పరిస్థితి నెలకొంది. సెంగోట్టై, కన్యాకుమారి, అనంతపురి, చెందూరు తదితర ఎక్స్‌ప్రెస్‌లు ఎక్కడికక్కడ ఆగడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఆగమేఘాలపై రైల్వే యంత్రాంగం, తమిళనాడు రోడ్డు రవాణా శాఖ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. విల్లుపురం నుంచి తాంబరం వరకు ప్రత్యేకంగా ఆ రైళ్లలోని ప్రయాణికుల కోసం బస్సులు నడిపారు. ఎగ్మూర్, సెంట్రల్ నుంచి బయల్దేరాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేయగా, కొన్ని నిర్ణీత సమయం కంటే గంటన్నర ఆలస్యంగా బయల్దేరి వెళ్లాయి. దీంతో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.