ఎవరి పాత్ర ఏంటి? | Whose role is it? | Sakshi
Sakshi News home page

ఎవరి పాత్ర ఏంటి?

Published Thu, Feb 11 2016 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

ఎవరి పాత్ర ఏంటి?

ఎవరి పాత్ర ఏంటి?

ముమ్మరంగా ‘డాక్టర్ కాల్పుల’ కేసు దర్యాప్తు

♦ సెల్‌ఫోన్ లొకేషన్లు, హోటల్ సీసీ కెమెరాల్లోని దృశ్యాల విశ్లేషణ
♦ సూసైడ్ నోట్, వేలిముద్రలు, తూటాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..
♦ హోటల్ వద్ద శశికుమార్ కారు స్వాధీనం..
 
 సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌కుమార్, సాయికుమార్‌తోపాటు ఉన్న సూసైడ్‌నోట్‌లో ఉన్న ఇతర పేర్లు ఎవరివి..? వారితో శశికుమార్‌కు ఉన్న లావాదేవీలు ఏంటి..? ఆత్మహత్యకు ప్రేరేపించడంతో వారి పాత్ర ఉందా..? డాక్టర్ కాల్పుల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ అంశాలపై దృష్టి సారించారు. సాంకేతిక అంశాలే ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశా రు. డాక్టర్ల సెల్‌ఫోన్ లోకేషన్లు, హోటల్‌లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. వైద్యుల వేలిముద్రలు, శశికుమార్ రాసిన సూసైడ్ నోట్, తూటాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.

హిమాయత్‌నగర్‌లో సోమవారం డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పై హత్యాయత్నం కేసును నారాయణగూడ పోలీసులు, శశి ఆత్మహత్య కేసును మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపింది తాను కాదని సూసైడ్ లేఖలో శశికుమార్ పేర్కొనడం, తన భర్తను హత్య చేశారని ఆయన భార్య కాంతి ఆరోపించిన నేపథ్యంలో మొయినాబాద్ పోలీ సులు ప్రాథమికంగా దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్య స్థలంలో దొరికిన రివాల్వర్‌పై వేలి ముద్రలు శశివేనా కాదా నిర్ధారించుకునేందుకు ల్యాబ్‌కు పంపారు. సూసైడ్ నోట్‌లో చేతి రాత శశికుమార్‌దేనని ప్రాథమికంగా భావిస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతున్నారు.

 హోటల్ వద్ద కారు స్వాధీనం...
 సోమవారం మధ్యాహ్నం హిమాయత్‌నగర్‌లోని మినర్వా కాఫీ షాప్‌లో సమావేశానికి శశికుమార్ సొంత కారులోనే వచ్చారు. అక్కడ్నుంచి మిగిలిన ఇద్దరితో కలిసి ఉదయ్‌కి చెందిన కారులో వెళ్లారు. దీంతో శశికుమార్ కారు హోటల్ వద్దే ఉండిపోయింది. పోలీసులు బుధవారం ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. తన భర్త బ్రీఫ్‌కేస్ కూడా మాయమైందని శశి భార్య ఆరోపించారు. దీన్ని  పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఉదయ్, సాయిల ఆసుపత్రులు, వారి నివాసాల్లో తనిఖీ చేయాలని నిర్ణయించారు.

అలాగే మినర్వా కాఫీ షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించారు. ఇందులో డాక్టర్లు లోపలికి రావడం, కూర్చుని టిఫిన్/కాఫీ తీసుకోవడం, తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ముగ్గురికీ చెందిన సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్‌తో పాటు కాల్‌డిటేల్స్‌ను సేకరించి విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా వారు ఏ సమయంలో ఎక్కడున్నార? ఎవరితో సంప్రదింపులు జరిపారన్న అంశాలు తేలనున్నాయి. మరోపక్క ఉదయ్ శరీరం నుంచి వైద్యులు బయటకు తీసిన తూటాను, శశికుమార్ మృతదేహం వద్ద లభించిన తూటాతో పాటు ఆ రివాల్వర్‌ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు.
 
 మిగిలిన వారు ఎవరు?
 సూసైడ్ నోట్‌లో ఉదయ్, సాయితో పాటు శశికుమార్ పేర్కొన్న వారు ఎవర న్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శశికుమార్‌ను ఫాంహౌస్‌లో దింపి వచ్చిన ఆయన స్నేహితురాలు చంద్రకళను కూడా ప్రశ్నించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో సాయికుమార్ ప్రత్యక్ష సాక్షిగా మారాడు. అయితే కాల్పులు జరిపింది సాయికుమారే అని శశి సూసైట్ నోట్‌లో పేర్కొన్నాడు. దీంతో సాయి చేతి వేళ్ల మధ్యలో గన్‌షాట్ రెసిడ్యూ(జీఎస్సార్) ఉందా లేదా అన్నది నిర్ధారించునేందుకు పోలీసులు ఆయన నుంచి నమూనాలు సేకరించారు. వీటన్నింటినీ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తున్నారు.
 
 ఉదయ్‌ను కాల్చింది శశికుమారే
 ‘‘ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకా రం ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది శశికుమార్‌గా తేలింది. ఈ కేసులో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి చంద్రకళను మరోసారి ప్రశ్నిస్తున్నాం. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’’
 - మీడియాతో మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement