doctors firing issue
-
పోస్టుమార్టం నివేదిక రాకుండానే కేసు మూసేస్తారా?
♦ నా భర్త సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వారందరినీ విచారించాలి ♦ ‘సాక్షి’తో కన్నీళ్ల పర్యంతమైన డాక్టర్ శశికుమార్ భార్య కాంతి సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం వారిది. ఒక కుమార్తె. ఒక కుమారుడు. పిల్లలు చాలా చలాకీగా చదువుతున్నారు. వృత్తిపరంగా కాసులకు కొదవలేదు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇంతలోనే ఊహించని పరిణామం. అన్నీ తానై చూసుకుంటున్న అతను చనిపోయాడనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హిమాయత్‌నగర్‌లో డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసలేమి జరిగిందో తెలియక అంతులేని ఆవేదనలో శశికుమార్ భార్య కాంతి కుంగిపోయారు. తన భర్త మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన భర్త మరణంపై ఆమె మనసులో ముసురుకున్న అనుమానాలను ప్రపంచం ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ‘ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అయితే నా భర్తకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా నా ప్రశ్నలను అడగాలనుకుంటున్నా’నని ఆమె బాధాతప్త హృదయంతో మాట్లాడారు. హైదరాబాద్ చైతన్యపురి ప్రభాత్నగర్లోని తమ నివాసంలో ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే పోలీసులు కేసు మూస్తామని చెబుతుండటం బాధిస్తోందన్నారు. ఆయన వెంట తీసుకెళ్లిన కారు, బ్రీఫ్ కేసు జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. బ్రీఫ్ కేసులో ఆయన సంతకం చేసిన చెక్‌బుక్ లీఫ్లు, ముఖ్యమైన ప్రొఫెషనల్ డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. ఆయన సూసైడ్ నోట్లో సాయికుమార్, ఓబుల్‌రెడ్డి, రమణారావు, చెన్నారెడ్డి, కేకే రెడ్డిలను శిక్షించాలని రాసిన దాని గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మానసిక ఆందోళనకు గురయ్యారు లారెల్ హాస్పిటల్స్ విషయంలో రెండు నెలల నుంచి ఉదయ్, సాయికుమార్‌ల వల్ల శశికుమార్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని, తిండి కూడా సరిగా తినలేదని ఆమె చెప్పారు. ‘సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వారి వద్ద నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. హిమాయత్‌నగర్‌కి రమ్మని చెప్పారు. అప్పుడు ఆయన మొహంలో ఆందోళన కనిపించింది. ఆయనతో మాట్లాడదామని అనుకునేలోపు వెళ్తున్నా అని బ్రీఫ్ కేసు పట్టుకొని కారులో బయలుదేరి వెళ్లారు. అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో హిమాయత్‌నగర్‌లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకి శశికుమార్ చనిపోయాడన్న విషయం తెలవడంతో అందరం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం’ అని ఆమె పేర్కొన్నారు. మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్న శశికుమార్‌ది ఎదుటివాళ్లను చంపాలనే మనస్తత్వం ఎంతమాత్రం కాదన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని కాంతి చెప్పారు. మొయినాబాద్ నక్కలపల్లిలోని ఫాంహౌస్‌కు శశికుమార్‌ను తీసుకెళ్లిందని మీడియాలో వస్తున్న వార్తల్లో కనిపిస్తున్న చంద్రకళ.. తన భర్త స్నేహితురాలిగా మాత్రమే తెలుసన్నారు. ఆత్మరక్షణ కోసమే రివాల్వర్ వెంట పెట్టుకునేవారని చెప్పారు. -
ఎవరి పాత్ర ఏంటి?
ముమ్మరంగా ‘డాక్టర్ కాల్పుల’ కేసు దర్యాప్తు ♦ సెల్‌ఫోన్ లొకేషన్లు, హోటల్ సీసీ కెమెరాల్లోని దృశ్యాల విశ్లేషణ ♦ సూసైడ్ నోట్, వేలిముద్రలు, తూటాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. ♦ హోటల్ వద్ద శశికుమార్ కారు స్వాధీనం.. సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌కుమార్, సాయికుమార్‌తోపాటు ఉన్న సూసైడ్‌నోట్‌లో ఉన్న ఇతర పేర్లు ఎవరివి..? వారితో శశికుమార్‌కు ఉన్న లావాదేవీలు ఏంటి..? ఆత్మహత్యకు ప్రేరేపించడంతో వారి పాత్ర ఉందా..? డాక్టర్ కాల్పుల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ అంశాలపై దృష్టి సారించారు. సాంకేతిక అంశాలే ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశా రు. డాక్టర్ల సెల్‌ఫోన్ లోకేషన్లు, హోటల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. వైద్యుల వేలిముద్రలు, శశికుమార్ రాసిన సూసైడ్ నోట్, తూటాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. హిమాయత్‌నగర్‌లో సోమవారం డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పై హత్యాయత్నం కేసును నారాయణగూడ పోలీసులు, శశి ఆత్మహత్య కేసును మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపింది తాను కాదని సూసైడ్ లేఖలో శశికుమార్ పేర్కొనడం, తన భర్తను హత్య చేశారని ఆయన భార్య కాంతి ఆరోపించిన నేపథ్యంలో మొయినాబాద్ పోలీ సులు ప్రాథమికంగా దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్య స్థలంలో దొరికిన రివాల్వర్‌పై వేలి ముద్రలు శశివేనా కాదా నిర్ధారించుకునేందుకు ల్యాబ్‌కు పంపారు. సూసైడ్ నోట్లో చేతి రాత శశికుమార్దేనని ప్రాథమికంగా భావిస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతున్నారు. హోటల్ వద్ద కారు స్వాధీనం... సోమవారం మధ్యాహ్నం హిమాయత్‌నగర్‌లోని మినర్వా కాఫీ షాప్‌లో సమావేశానికి శశికుమార్ సొంత కారులోనే వచ్చారు. అక్కడ్నుంచి మిగిలిన ఇద్దరితో కలిసి ఉదయ్‌కి చెందిన కారులో వెళ్లారు. దీంతో శశికుమార్ కారు హోటల్ వద్దే ఉండిపోయింది. పోలీసులు బుధవారం ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. తన భర్త బ్రీఫ్‌కేస్ కూడా మాయమైందని శశి భార్య ఆరోపించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఉదయ్, సాయిల ఆసుపత్రులు, వారి నివాసాల్లో తనిఖీ చేయాలని నిర్ణయించారు. అలాగే మినర్వా కాఫీ షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించారు. ఇందులో డాక్టర్లు లోపలికి రావడం, కూర్చుని టిఫిన్/కాఫీ తీసుకోవడం, తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ముగ్గురికీ చెందిన సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్‌తో పాటు కాల్డిటేల్స్ను సేకరించి విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా వారు ఏ సమయంలో ఎక్కడున్నార? ఎవరితో సంప్రదింపులు జరిపారన్న అంశాలు తేలనున్నాయి. మరోపక్క ఉదయ్ శరీరం నుంచి వైద్యులు బయటకు తీసిన తూటాను, శశికుమార్ మృతదేహం వద్ద లభించిన తూటాతో పాటు ఆ రివాల్వర్‌ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. మిగిలిన వారు ఎవరు? సూసైడ్ నోట్లో ఉదయ్, సాయితో పాటు శశికుమార్ పేర్కొన్న వారు ఎవర న్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శశికుమార్‌ను ఫాంహౌస్‌లో దింపి వచ్చిన ఆయన స్నేహితురాలు చంద్రకళను కూడా ప్రశ్నించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో సాయికుమార్ ప్రత్యక్ష సాక్షిగా మారాడు. అయితే కాల్పులు జరిపింది సాయికుమారే అని శశి సూసైట్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో సాయి చేతి వేళ్ల మధ్యలో గన్‌షాట్ రెసిడ్యూ(జీఎస్సార్) ఉందా లేదా అన్నది నిర్ధారించునేందుకు పోలీసులు ఆయన నుంచి నమూనాలు సేకరించారు. వీటన్నింటినీ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తున్నారు. ఉదయ్‌ను కాల్చింది శశికుమారే ‘‘ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకా రం ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది శశికుమార్‌గా తేలింది. ఈ కేసులో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి చంద్రకళను మరోసారి ప్రశ్నిస్తున్నాం. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’’ - మీడియాతో మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి -
కాల్పులు జరిపింది శశికుమారే!
లోరల్ ఆస్పత్రి భాగస్వామి ఉదయ్ కుమార్ మీద కాల్పులు జరిపింది.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమారేనని డీసీసీ కమలాసన్ రెడ్డి చెప్పారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైందని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కారులో వెళ్లేటప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉదయ్, పక్కసీట్లో సాయికుమార్ కూర్చోగా.. వెనకాల సీట్లో శశికుమార్ కూర్చున్నారు. చెవి దగ్గర కాల్చే అవకాశం వెనక కూర్చున్నవాళ్లకే ఉంటుందని, అందువల్ల కాల్పులు జరిపింది శశికుమారేనని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉదయ్ కుమార్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ఆయన పరిస్థితి కొంత మెరుగుపడినా, పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇక శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను కూడా నారాయణగూడ పోలీసులు విచారిస్తారని డీసీపీ తెలిపారు. ఆమెతో పాటు లోరల్ ఆస్పత్రికి చెందిన మిగిలిన డాక్టర్లను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అసలు వైద్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది, వాటాల వివాదం ఏంటన్న విషయాన్ని తెలుసుకుంటారు.