‘‘నాన్న.. లే నాన్నా.. వెళ్దాం.. నాన్న’’ | EAMCET today: 1-minute delay can cause a year's loss and life | Sakshi
Sakshi News home page

‘‘నాన్న.. లే నాన్నా.. వెళ్దాం.. నాన్న’’

Published Fri, May 23 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

‘‘నాన్న.. లే నాన్నా.. వెళ్దాం.. నాన్న’’

‘‘నాన్న.. లే నాన్నా.. వెళ్దాం.. నాన్న’’

...అంటూ గుండెలవిసేలా విలపిస్తున్న ఈ అబ్బాయి పేరు ఉదయ్‌కుమార్. రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్నది ఆయన తండ్రి రాఘవేందర్. గురువారం ఉదయ్‌ని ఎంసెట్ పరీక్షకు తీసుకువెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. నల్లగొండకు సమీపంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కొడుకును పరీక్షకు అనుమతించరన్న ఆదుర్దాతో వెళ్తూ రాఘవేందర్ మృత్యుఒడికి చేరాడు. తండ్రి మరణం గుండెల్ని పిండేస్తున్నా.. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉదయ్ పరీక్షకు హాజరయ్యాడు.
 
 ‘నిమిషం’ తో నరకం ! 
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నలు లీక్ అవుతాయన్న అనుమానం..   దాన్ని అరికట్టలేని చేతగానితనం..  అధికారుల అత్యుత్సాహం...  వెర సి లక్షల మంది విద్యార్థులకు నరక యాతన!   నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు అనుమతించబోమన్న నిబంధన విద్యార్థులను తీవ్ర మాన సిక ఒత్తిడికి గురిచేస్తోంది. కొంద రు విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఏళ్ల తరబడి చదువుకొని, రేయింబవళ్లు నెలల కొద్దీ కష్టపడ్డా ఒక్క ‘నిమిషం’ వారి ఆశలను చిదిమేస్తోంది. ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేని విద్యార్థులను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తోంది. ‘నిమిషం’ భయం పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకూ వణుకు పుట్టిస్తోంది. పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడేస్తోంది. నల్లగొండ జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కోవలోనే జరిగింది. కొడుకును ఎంసెట్ (ఇంజనీరింగ్) పరీక్షకు తీసుకెళ్తున్న తండ్రి మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తండ్రి పోయారన్న ఆవేదనతోనే, దుఃఖాన్ని దిగమింగుకొని ఆ విద్యార్థి పరీక్ష రాయాల్సి వచ్చింది.
 
 జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సడలింపు..
అసలు రాష్ట్రం నిర్వహించే ఎంసెట్, ఐసెట్ తదితర అన్ని ప్రవేశ పరీక్షల్లో ఇలాంటి నిబంధన అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)... దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ లాంటి పరీక్షలను కూడా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తోంది.
 
 అంతేకాదు గేట్ వంటి పరీక్షల్లోనూ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదు. పరీక్ష ప్రారంభమైన పావుగంట వరకు కూడా అనుమతిస్తున్నారు. పక్కరాష్ట్రం తమిళనాడులో అయితే పరీక్ష ప్రారంభమైన అరగంట వరకు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఇక సివిల్స్, గ్రూపు-1 వంటి వివిధ కీలక పరీక్షల్లో నిర్ణీత సమయంలో పరీక్ష హాల్లో ఉండాలన్న నిబంధన ఉన్నా కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు. పావుగంట వరకూ కూడా అభ్యర్థులను అనుమతిస్తున్నారు. అలాంటిది ఈ ప్రవేశ పరీక్షలో ఎందుకు? చిన్నారులను తీవ్ర ఒత్తిడికి గురిచేసే ఈ నిబంధనతో అధికారులు సాధించేదేంటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
 
 శాస్త్రీయత లేని నిబంధన..
 విద్యార్థులను, తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గురి చేసి ఇబ్బందుల పాలుచేసే ఈ నిమిషం నిబంధనకు అసలు శాస్త్రీయతే లేదు. కేవలం బయట ఉన్న విద్యార్థులకు లోపల ఉన్న విద్యార్థుల నుంచి సమాచారం వెళ్తుందన్న అనుమానంతో లక్షల మందిని క్షోభకు గురిచేస్తున్నారు. పరీక్షకు ఆలస్యంగా వె ళ్తే నష్టం తనకేనన్న విషయం విద్యార్థికి తెలుసు. సాధ్యమైనంత వరకు ముందుగా రావడానికే ప్రయత్నిస్తారు.  కానీ అనుకోని పరిస్థితుల్లో కొద్ది నిమిషాలు పరీక్షకు ఆలస్యంగా వెళ్తే జీవితాన్ని నష్టపోవాలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
 
 ఈ నిబంధనను తొలగిండచడంతోపాటు ఆన్‌లైన్‌లో పరీక్ష  వంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు. పైగా ఇంటర్మీడియట్, పదో తరగతి వంటి పబ్లిక్ పరీక్షల్లోనూ ఈ అడ్డగోలు నిబంధనను అమలు చేసే ఆలోచనలు చేస్తుండటం దారుణం. నిజానికి ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షకు ఇలాంటి నిబంధనల అవసరమే లేదని ఉన్నత విద్యాశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. శుక్రవారం జరగనున్న ఐసెట్‌కు సైతం ఈ నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు.
 
 ఒక్కో గడియారంలో ఒక్కో సమయం
 గడియారంలో సమయమే ఒక్కొక్కరికి మధ్య ఐదు నిమిషాల వరకూ తేడా ఉంటుంది. విద్యార్థుల చేతుల్లో గడియారం ఒక సమయం చూపిస్తే.. పరీక్ష హాల్లో ఉండే గడియారంలో సమయానికి తేడా ఉంటుంది. ఇన్విజిలేటర్ చేతికి ఉండే గడియారంలో మరో సమయం చూపిస్తుంది. పర్యవేక్షణ అధికారి చేతి గడియారంలో కూడా ఒకట్రెండు నిమిషాలు తేడా ఉండొచ్చు. గేటు వద్ద ఉండే వాచ్‌మెన్ గడియారంలో సమయం మరోలా ఉండొచ్చు. అలాంటపుడు నిమిషం నిబంధన కు ప్రామాణికతే లేదు. అందుకే ఇలాంటి నిబంధనను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
 
 ప్రాణం తీసిన నిబంధన
 ఒక్క నిమిషం.. ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది! కొడుకు నుంచి తండ్రిని దూరం చేసింది. ఆ కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు తన కొడుకును అనుమతించరన్న ఆదుర్దాతో బయల్దేరిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు. గురువారం నల్లగొండలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భువనగిరిలోని బాహార్‌పేటకు చెందిన రాఘవేందర్(48) తన కొడుకు ఉదయ్‌కుమార్‌ను ఎంసెట్ పరీక్షకు తీసుకువెళ్లేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. మరో 10 నిమిషాల్లో నల్లగొండకు చేరుకోబోతుండగా.. మహత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో వారి వెనుక వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది.
 
  ైబె క్‌పై నుంచి తండ్రీకొడుకులు చెరోవైపు పడిపోయారు. రాఘవేందర్‌పై నుంచిలారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. తండ్రి అచేతనంగా రోడ్డుపై పడిపోవడంతో ఉదయ్‌కుమార్ కన్నీరుమున్నీరుగా విల పించాడు. ‘లే డాడీ...వెళ్దాం..’ అంటూ చేయి పట్టి లాగడం చూసేవారిని కంటతడి పెట్టించింది. ఈలో పు అంబులెన్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. తండ్రి మరణం గుండెల్ని పిండేస్తున్నా.. ఉదయ్ పరీక్షకు హాజరయ్యాడు. తెలిసినవారు వెంట రాగా ఎన్జీ కాలేజీ సెంటర్‌కు చేరుకొని పరీక్ష రాశాడు. తనను ఇంజనీర్‌గా చూడాలనుకున్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చుతానంటూ ఉదయ్ కన్నీళ్లతో చెప్పాడు.
 
 గేట్లు మూసేసే పరిస్థితి ఉండదు
 జేఈఈ మెయిన్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పావుగంట, ఇరవై నిమిషాల వరకు పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. అంతేకాదు సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లోనూ పరీక్ష సమయానికంటే ముందుగా హాల్లోకి రావాలని మాత్రమే చెబుతారు. పావుగంట వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని గేట్లు మూసేసే పరిస్థితి ఉండదు. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లోనే ఈ విపరీత ధోరణి కనిపిస్తోంది.
 - జేఈఈ శిక్షణా సంస్థ ప్రతినిధి కృష్ణచైతన్య,
 సివిల్స్ శిక్షణా సంస్థ ప్రతినిధి శ్రీకాంత్

 
 విద్యార్థుల హక్కులను కాలరాయడమే
 నిమిషం నిబంధన పేరుతో విద్యార్థులను పరీక్ష రాయకుం డా చేయడం వారి హక్కులను కాలరాయడమే. ఆలస్యంగా వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులే ఉంటారు. ధనవంతుల  పిల్లల్లాగ వారు కార్లలో వెళ్లలేరు. బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపైనే ఆధారపడతారు. కాబట్టి ఒక్కోసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
 - మధుసూదన్‌రెడ్డి,
 జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి

 
 దుర్మార్గపు విధానం
 ట్రాఫిక్ సమస్యలు, ఇంటి నుంచి బయలుదేరడం ఆలస్యం కావడంతో పరీక్షకు కొంత ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగని వారిని పరీక్షకే అనుమతించకపోవడం దుర్మార్గం. ఎక్కడాలేని విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులను ముందే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
 - లక్ష్మయ్య,
 ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి

 
 జీవితాలు నాశనం చేయడమే
 నిమిషం పేరుతో వందల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమే. మండల కేంద్రాల్లో సెంటర్లు లేవు. ట్రావెలింగ్ సమస్యలు ఉన్నాయి. డివిజన్, జిల్లా కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
 - ఆవుల అశోక్, పీడీఎస్‌యూ
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement