గంగిరెడ్డికి ఏం జరిగినా వారిదే బాధ్యత
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని అతని భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయించి జైల్లోనే అంతం చేయ్యాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కోర్టు నిర్ధారించిందని మాళవిక ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడనటంలో నిజంలేదని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయటంతో స్వదేశానికి తిరిగిరాలేదని తెలిపారు. మారిషస్ నుంచి గంగిరెడ్డిని హైదరాబాద్ తరలిస్తున్న సమయంలో అధికారులు రివాల్వర్‌తో బెదిరించారని అన్నారు. తన భర్తకు ఏం జరిగినా ఏపీ పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతడు.. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు.