gangi reddy
-
వివేకా కేసు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి ఊరట లభించింది. ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే.. గంగిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలిపింది న్యాయస్థానం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి. అయితే.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కేసు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఓ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. గంగిరెడ్డి గనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది. అయితే.. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని అతని తరపున న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను.. కడప కోర్టు, ఏపీ హైకోర్టు కూడా కొట్టివేశాయని ప్రస్తావించారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే వాదనలు విన్న ఏకసభ్య బెంచ్.. సీబీఐ వాదనతోనే ఏకీభవించింది. దర్యాప్తు దశలో.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోవాలని, లేకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది హైకోర్టు. అలాగే.. రెండు నెలల్లోపు వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జులై 1వ తేదీ తర్వాత గంగిరెడ్డికి తిరిగి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలిపింది హైకోర్టు. 2019 అక్టోబర్‌లో వివేకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ ఇచ్చింది పులివెందుల కోర్టు. ఆపై 2021లో ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ వస్తోంది. ఇదీ చదవండి: వివేకా రెండో భార్య సంచలన స్టేట్మెంట్ -
సీఎం వైఎస్ జగన్ పెద్దమామ ఇసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూత
వేముల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దమామ, సీఎం సతీమణి వైఎస్ భారతిరెడ్డి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) శనివారం కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. పులివెందులలోని ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల స్వగ్రామం గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం పులివెందులకు తరలిస్తుండగా మార్గంమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామమైన గొల్లలగూడూరు గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ తల్లి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతిరెడ్డి గొల్లలగూడూరు చేరుకుని నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి అనంతరం పెద్ద గంగిరెడ్డి భార్య సుబ్బమ్మ, కుమార్తె విజయ, కుమారులను పరామర్శించారు. ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయానికి సోదరుడు, సీఎం వైఎస్ జగన్ మామ డా. ఇసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఇసీ సుగుణమ్మ, డా. ఇసీ దినేష్‌రెడ్డి, డా. వైఎస్ అభిషేక్‌రెడ్డి, సాక్షి డైరెక్టర్ ఎ.లక్ష్మీనారాయణరెడి, ఇంకా పలువురు స్థానిక నాయకులతో పాటు బంధువులు, గ్రామస్తులు నివాళులర్పించారు. గ్రామ సమీపంలోని సొంత తోట వద్ద ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
గంగిరెడ్డికి ఏం జరిగినా వారిదే బాధ్యత
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని అతని భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయించి జైల్లోనే అంతం చేయ్యాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కోర్టు నిర్ధారించిందని మాళవిక ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడనటంలో నిజంలేదని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయటంతో స్వదేశానికి తిరిగిరాలేదని తెలిపారు. మారిషస్ నుంచి గంగిరెడ్డిని హైదరాబాద్ తరలిస్తున్న సమయంలో అధికారులు రివాల్వర్‌తో బెదిరించారని అన్నారు. తన భర్తకు ఏం జరిగినా ఏపీ పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతడు.. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. -
నేనేం పారిపోలేదు.. బిజినెస్‌కోసం వెళ్లా...
-
'నేనేం పారిపోలేదు, వ్యాపార పనుల కోసం వెళ్లా'
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మారిషస్‌లో అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ రాముడు వెల్లడించారు. గంగిరెడ్డిపై కడప, కర్నూలు జిల్లాలలో పలు కేసులు ఉన్నాయనీ, వీటిపై సమగ్రంగా విచారణ జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే గంగిరెడ్డి మాత్రం నేనెక్కడికీ పారిపోలేదు, వ్యాపార పనుల కోసం మారిషస్ వెళ్లాను, నా టైం బాగోలేదు కాబట్టే ఇలా జరిగింది అంటున్నాడు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడం సరికాదని తనకు ఎవరి నుండి ప్రాణహాని లేదని గంగిరెడ్డి తెలిపాడు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్‌పోల్ అధికారులు మారిషస్‌లో గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆయన్ని ఇండియాకు రప్పించడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించి ఎట్టకేలకు తమ అదుపులోకి తీసుకున్నారు. -
తేనెటీగల దాడిలో ఒకరు మృతి
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలో శివాలయంవద్ద తేనెటీగలు దాడిచేయడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. చింతకొమ్మదిన్నె మండలం బలిజేపల్లికి చెందిన 18మంది బృందం దైవదర్శనార్థం శివాలయానికి వెళ్లారు. అక్కడ మంగళవారం ఉదయం తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతో గంగిరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు పరుగుతీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం తెలుసుకున్న చింతకొమ్మదిన్నె పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. గంగిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.